మండే మాదిగల గుండెచప్పుడు..

by Ravi |   (  Updated:2025-01-12 01:00:21  IST  )

మాదిగ మహవీరులారా ఆది జాంబవుని వారసులారా అలుపెరుగని ధీరులారా అసువులు బాసిన అమరులారా" అని అంటాడు

మండే మాదిగల గుండెచప్పుడు..
X

"మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా అలుపెరుగని ధీరులారా అసువులు బాసిన అమరులారా" అని అంటాడు మాదిగ వాగ్గేయ కారుడైన ఎర్ర ఉపాళీ. వర్గీకరణ ఆకాంక్ష మూడు దశాబ్దాల పోరాటాల దారి. ఈ మజిలీలో ప్రాణ త్యాగాలు చేసిన మాదిగ అమరులు కూడా ఎందరో ఉన్నారు. వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన మాదిగ దండోరా, సమాజంలోని అన్ని వర్గాల మన్ననలను పొందిన ఉద్యమాల ఊట బావిలా, ఎంఆర్‌పీఎస్‌గా స్థిరపడింది. ఇది అనేక సామాజిక అంశాల పట్ల తన వంతు పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చింది. ఆరోగ్యశ్రీ పుట్టుకకు, దివ్యాంగుల పింఛన్, వృద్దులు-వితంతువుల పింఛన్ పెంపులో కీలక పాత్రదారి పోషించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాదిగలదే సింహ భాగం. ఆనాటి ఆంధ్రా ప్రాంతం లో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విశిష్టత గురించి మాట్లాడిన ఏకైక గొంతుక ఎంఆర్‌పీఎస్ మంద కృష్ణ మాదిగదే. అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకున్న ఎంఆర్‌పీఎస్ ముప్పైయేండ్ల పోరాటాల ఫలితంతో 2024 ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు వర్గీకరణకు సానుకూల తీర్పును వెల్లడించింది. ఈ దిశగా సుప్రీంకోర్టు తీర్పు అమలుకై తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న పోరాటం మరొక చారిత్రాత్మక ఘట్టమే.

పంచుకోవాల్సిన రిజర్వేషన్‌ను..

సబ్బండ వర్గాల పోరాట త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో దాదాపుగా దశాబ్ద కాలం పాటు తెలంగాణకై నినదించిన గొంతులు, కలాలకు సహితం నిశబ్దం ఆవహించిన సమాయాన "ఏవనిపాలయ్యిందిరో తెలంగాణ ఏవడేలుతున్నడురో తెలంగాణ" అంటూ పల్లె నుండి పట్నం వరకున్న యావత్ తెలంగాణను మేల్కోల్పిన గొంతుక ఏపూరి సోమన్న ఒకమాటలో చెప్పాలంటే నేడు తెలంగాణలో ప్రభుత్వం మారడానికి ఈపాటొక కారణమే! సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యం లో మళ్లీ తెరపైకి కుట్రలు ఆరంగ్రేటం చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. 59 కులాలుగా ఉన్నటువంటి ఎస్సీ సమూహంలో ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఒకే ఒక కులం మరల ప్రభుత్వాలను మభ్యపెట్టే ప్రయత్నంతో పాటుగా కోర్టు ధిక్కరణ కూడా చేస్తూనే ఉన్నది కాబోలు..!? దశాబ్దాల కాలంగా సమానంగా పంచుకోవాల్సిన రిజర్వేషన్ వాటాలను ఏకపక్షంగా అనుభవిస్తున్నది చాలక మరల మిగతా కులాల కంచంలో మన్నుబోసే చర్యలకు పూనుకుంటుంది!?

వేయిగొంతులు- లక్షడప్పులు పేరుతో..

ఈ నేపథ్యంలోనే వర్గీకరణ సాధకుడైన మంద కృష్ణన్న నాయకత్వంలో జరగబోవు వేయి గొంతులు-లక్ష డప్పులు అనే సభా నిర్వాహణకు ఏర్పడిన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏపూరి సోమన్న సారథ్యంలో హైదరాబాద్ గడ్డపైన ఫిబ్రవరి 7న జరగనున్న ఈ చారిత్రాత్మక సభకు సన్నాహ ర్యాలీలతో తెలంగాణ కొరకు ఆడి- పాడిన సబ్బండ వర్గాల కళాకారుల ఇమ్మతితో గోసి/గొంగడి, కాలి గజ్జె, డప్పులతో కలిసి తెలంగాణ ప్రతి పల్లెను చుట్టిరానున్నారు. "దండోరా ఎందుకు పుట్టిందోయ్ పుట్టిందోయ్ పుట్టింది డప్పెందుకు గర్జన చేసిందోయ్ పోరుకు పయనం కట్టింది అంటాడు మరొక వాగ్గేయకారుడైన పొలిశెట్టి లింగన్న. దండోరా సమాన హక్కుల కొరకు పయనమై మానవ హక్కుల దండోరా వేసింది. సమాజానికి మేల్కొలు పైన డప్పు మాదిగ అస్థిత్వ దరువులను మ్రోగించింది. వర్గీకరణ సాధన త్వరిత గతిన అమలుజేయాలనే ఫిబ్రవరి 7న హైదరాబాద్ నగరం నడిబొడ్డున లక్ష డప్పులు-వేల గొంతులై కవాతు చేయనున్నారు. ఈ సందర్భాన్నే ప్రజా వాగ్గేయ కారుడైన బహుజన యుద్ధనౌక ఏపూరి. ఆయన " వేల గొంతులు-లక్షా డప్పులు వేయరా దండోరా వేయ్ వేయరా దండోరా న్యాయమైన మన వాటా కోసం కదలాలి ఊరురా మోగించరా దండోరా".

(తెలంగాణ పల్లె-పల్లెలో కొనసాగుతున్న మాదిగ కళాకారులకు ఇమ్మతితో)

వరకుమార్ గుండెపంగు

99485 41711

Next Story