- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా స్వేచ్ఛ: అవకాశాల వలయంలో సాగుతున్న అంతర్గత యుద్ధం!
చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబనతో మహిళ జీవితంలో మార్పులు వచ్చినా, ఆమె అంతరంగంలో కొనసాగుతున్న స్వేచ్ఛ కోసం యుద్ధాన్ని విశ్లేషించే ఆలోచనాత్మక వ్యాసం

నేటి మహిళ జీవితం మార్పుల దారిలో ప్రయాణిస్తోందని గమనించే లోపునే అది తనను తాను అర్థం చేసుకునే ఒక ఆత్మయాత్రగా కూడా మనకు కనిపిస్తోంది. చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన ఇవి మహిళలు అందుకుంటున్న బాహ్య, ఉపరితల విజయాలు. కానీ ఆమె లోపల జరిగేది మాత్రం మరింత లోతైన యుద్ధం..
స్వేచ్ఛ అనే శబ్దం తనకు ఏ అర్థాన్ని అందిస్తోంది? ఆమె జీవన ప్రయాణం ఎవరి కోసం, ఎందుకోసం! వేదికల మీద నిలబడ్డ ఆమె ఎందాకా తన స్వరాన్ని వినిపించగలదు? అందుకు ఎవరి అనుమతి అవసరం, ఎందుకు అవసరం? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ సరి అయిన సమాధానం దొరకదు కానీ ఒక్కో ప్రశ్నలోనూ ఒక నొప్పి, ఒక అభిమానం, ఒక ప్రతిఘటన కలిసే మనల్ని ప్రశ్నిస్తాయి. స్త్రీ ఎదుగుదలను సమాజం స్వాగతించినట్లు కనిపించినా, ఆ స్వాగతం ఆమె విముక్తి కొరకు కాదు. ఆమెను మరిన్ని పనుల, మరిన్ని అంచనాల, మరిన్ని పాత్రల రూపంలో మళ్లీ బంధించడానికి. ఇది ఎదుగుదలేనా, లేక ఎదుగుదల పేరుతో వచ్చిన మరొక కొత్త వలేనా అన్నది ఇప్పుడు ఎదురవుతున్న సరికొత్త సవాలు..
చదువుతో మరిన్ని పెద్ద పరీక్షలు..
చదువు ఆమెను బలపరుస్తుంది అని ఒకప్పుడు నమ్మేవాళ్ళం, అందుకోసం పోరాటాలు చేశాం, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే నినాదాలు గోడలపైన రాసుకున్నాం, కానీ అదే చదువు ఆమెపై సామాజిక - ఆర్థిక శక్తి వ్యవస్థలు పెట్టే పరీక్షలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఉద్యోగం ఆమె ను ఇంటి నుంచీ బయటకు సమాజంలోనికి పంపగలిగింది. కానీ అదే ఉద్యోగం ఆమెలో ఉన్న మౌన త్యాగాలను మరింత ఎక్కువ చేస్తూ, ఆమె నోరుని మరింత గట్టిగా నొక్కే స్తోంది. స్వావలంబన ఆమెకు ఆత్మగౌరవం అందిస్తోంది. కానీ అదే స్వావలంబనను సమాజం ఆమె సేవలు మరింత సునాయాసంగా పొందడానికి సరైన మార్గంగా ఉపయోగించుకుంటోంది.
వలయం లోపల మాత్రమే కదిలే స్వేచ్ఛ!
మిడిల్ క్లాస్ జీవితం ఆమెకు కొంత స్వేచ్ఛని ఎక్కువ ఇస్తునట్టు కనిపిస్తున్నా.. ఆ స్వేచ్ఛ ఒక వలయం లోపలే కదలడానికి అనుమతిస్తుంది. జీవితం పట్ల అంచనాలు ఎక్కువయ్యే కొద్దీ వాటి కేంద్రస్థానంలో నిలిపిన మహిళ పాత్రా, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా ఆమె మానసిక శారీరక శ్రమా ఎక్కువ అవుతోంది. ఆమె సంపాదించినంత వరకే కుటుంబం నిలుస్తుంది. ఆమె కాయకష్టం ఇంటి ఎదుగుదలకు ఉపయోగ పడుతుంది. కానీ ఆమెకు తన కోసం బతికే సమయం మాత్రం దొరకడం లేదు. బిలో మిడిల్ క్లాస్‌లో ఈ లోటు మరింత ఎక్కువగా, మరింత లోతుగా ఉంది. శ్రమ ఎక్కువ, విశ్రాంతి తక్కువ. కనీసం నెలసరి సమయంలోనూ, ప్రసవ సమయంలోనూ, లేదా ఇతర అనారోగ్య కారణాలతో ఆమె ఇబ్బంది పడే వేళల్లోనూ ఈ సంపాదన గ్రహణం ఆమెను వీడడం లేదు. ఆమె స్వావలంబన ఆమెకు సాంత్వనను ఇవ్వడం లేదు. పై మధ్యతరగతిలో స్వేచ్ఛ కాస్త ఎక్కువగా కనిపించినా ఆ స్వేచ్ఛకు ఆమె చెల్లించాల్సిన సామాజిక ధర పెద్దది. అందుకోసం ఆమె కోల్పోయే స్థితిగతులు కూడా పెద్దవే. అదొక కనిపించని మాయ, చెప్పుకోలేని మర్మం.
ప్రతి అడుగుపై యజమాని ఎవరు?
ఆమె ప్రతి అడుగూ సరిహద్దుల వెంట నడుచుకుంటూ వెళ్తున్న ప్రశాంతతను చూపించాలి. కానీ వాస్తవానికి ఆమె నడక రెండు ఎదురీతల మధ్య తగలుతున్న బలమైన గాలుల ఒత్తిడిని భరిస్తోంది. ఈ పోరాటం ఆమెను చూసే ఎవరికీ కనిపించదు. ఇది అంతర్గతంగా ఆమెలో జరుగుతున్న యుద్ధం. ఆమె ఆలోచనల్లో, ఆమె అడుగుల మలుపుల్లో, ఆమె జీవన పోరాటంలో, తనని తాను నిరూపించుకోవాలనుకునే అన్ని దశల్లో ఆమె చేస్తున్న నిశ్శబ్ద యుద్ధం, నిర్లిప్త ఉద్వేగ పయనం. మహిళ తన జీవనపథం మీద అడుగులు వేస్తోంది. కానీ ఆ అడుగులకు యజమానిగా తాను ఉండలేకపోతోంది. ఆ అడుగులకు యజమాని ఎవరో? ఆ అడుగుల దిశ ఎవరి చేతుల్లో ఉందో ఆమెకు కాదు ఎవరికీ అర్థం కాదు, ఆమెను నిరోధిస్తూ, ఆమె గమనాన్ని నిర్దేశిస్తున్న ఆ స్వరాలకూ అర్థం కాదు. ఈ ప్రశ్న కేవలం ఒక సామాజిక ప్రశ్న కాదు. ఇది ఒక బాహ్య, అంతర్గత పోరాటాల ప్రశ్న.
అంతర్గత మార్పే అసలు దినోత్సవం!
నిజమైన స్వేచ్ఛ బాహ్య అవరోధాలు తొలగిపోయినప్పుడు వచ్చేది కాదు.. అది తన ఆత్మని నియంత్రించే అన్ని అగోచర శృంఖలాలు తెగిపోయినప్పుడు వచ్చేది. నేడు ప్రపం చం మహిళకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఇస్తోంది. కానీ నిజానికి ఆమెకు ఇవ్వాల్సినది అవకాశాలు కాదు, ఆ అవకాశాలపై నిజమైన హక్కు. ఆమెను చదివించడం మాత్రమే కాదు, ఆ చదువుపై స్వతంత్రత. ఉద్యోగం కాకుండా, ఉద్యోగం గురించి తనే నిర్ణయించుకునే తనదైన మార్గం. స్వావలంబన కాకుండా, తన జీవితం తనదే అనే ఆత్మస్థైర్యం. మహిళ ఎక్కడ ఉన్నా పేద, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతికి చెందినదైనా ఆమె యుద్ధం ఒకటే స్వేచ్ఛ అసలు అర్థాన్ని తిరిగి సాధించుకోవడం. ఈ ప్రపం చం ఆమెను మార్చుతుందో , లేదో కానీ మహిళ మారు తోంది. మార్పు మొదలు కావలసింది బాహ్య వ్యవస్థల్లో కాదు; ఆమె హృదయపు లోతుల్లో. ఆ మార్పు వచ్చిన రోజు అదే మహిళా దినోత్సవం అసలు అర్థం.
- సుధా మురళి
83096 22246






