అధికారానికి మించి ఆదర్శం.. తమిళ రాజకీయాల్లో స్టాలిన్ ప్రత్యేకత

by Ravi |   (  Updated:2026-05-09 00:45:57  IST  )

తమిళనాడులో అధికారం కంటే ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇస్తూ, కక్ష రాజకీయాలకు దూరంగా ఆదర్శ నాయకుడిగా నిలుస్తున్న ఎం.కే. స్టాలిన్ రాజకీయ వైఖరిపై ప్రత్యేక విశ్లేషణ.

అధికారానికి మించి ఆదర్శం.. తమిళ రాజకీయాల్లో స్టాలిన్ ప్రత్యేకత
X

తమిళనాడులో విజయ్ సృష్టించిన రికార్డు విశేషాలనే మనం చెప్పుకొంటున్నాం, చర్చిస్తున్నాం. నిజానికి స్టాలిన్ గురించి కూడా అంతకంటే గొప్పగానే మాట్లాడుకోవాలి. పూర్వ కాలంలో రాజ్యాలను మలుపుకొన్నట్టుగా, వర్తమాన కాలంలో రాష్ట్రాలను సాధించుకో వడంలో ఎన్నెన్నో అనైతికథలు వింటున్నాం. ఆ ప్రకారం తిరిగి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ స్టాలిన్ ఆ దిశగా ఏమాత్రం ధ్యాస పెట్టకుండా పాలిటిక్స్‌లో ఆరోగ్యకరంగా, ఆదర్శ ప్రాయంగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ఫెయిర్‌గా తమిళనాట నవీన రాజకీయాలకు చిరునామాగా నిలుస్తున్నారు స్టాలిన్.

కక్షపూరిత రాజకీయాలకు పోకుండా..

తాను 2021లో ముఖ్యమంత్రి అయి అవడంతోనే చాలా హుందాగా, బాధ్యతాయుతంగా, నిర్మల విధానాలు అవలంబించారు స్టాలిన్. తమిళనాడులో అమ్మగా పేరొందిన జయలలిత పేరిట ఉన్న అమ్మ క్యాంటీన్లను అలానే ప్రజలకు అందుబాటులో ఉంచారు. పేరు, ఫొటోలు మార్చలేదు. జయలలిత ఫొటోలు గల సంక్షేమ పథకాల సామగ్రిని కూడా యథావిధిగా పంపిణీ చేయించారు. రాజకీయ ప్రచార యావ కోసం ప్రజా ధనాన్ని ఎక్కడా వృధా కానివ్వలేదు. జయలలిత ఫొటోలపై ఈర్ష్య అసూయ ద్వేషాలు తనలో పొడ సూపనీయలేదు. ఆ విధంగానే కాదు, తమిళనాట 40 ఏళ్ల సాధారణమైన కక్ష, ద్వేషపూరిత రాజకీయాల జోలికి పోలేదు.

ఓడిన మరుదినమే ప్రజల వద్దకు..!

తన పరిపాలనలో సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే నీటి ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు వంటి సౌలభ్యాలను దరిచేర్చారు. కొన్ని అంశాల్లో విభేదిస్తూ తన కచ్చితత్వంతో విమర్శలు ఎదుర్కొన్నారే కానీ, తమిళనాట పాలన, రాజకీయాలను భ్రష్టు పట్టించలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి, తన పార్టీ డీఎంకే ప్రధాన ప్రతిపక్షం స్థితిలోకి చేరింది. ఇక్కడ మరీ విషాదం, బాధాకరం ఏమంటే.. అసెంబ్లీకి పోటీలో తాను స్వయంగా ఓటమి పాలవడం.

అనైతిక ఎత్తులపై ఆసక్తి లేని నేత!

అయినప్పటికీ తాను పోటీ చేసి, పరాజయం పాలైన నియోజకవర్గానికి మరుసటి రోజే వెళ్లారు. ప్రజలను కలిశారు. ఓటేసిన పౌరులకు కృతజ్ఞతలు చెప్పారు. ఓడిపోయినప్పటికీ తమ వద్దకు స్టాలిన్ రావడంతో కార్యకర్తలు, ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు. పేరుకు తగ్గట్టుగానే ఉక్కు మనిషి అయినా స్టాలిన్ కూడా ఆ క్షణాల్లో భావో ద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో, ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంలో టీవీకే విజయ్‌కి 11 మంది ఎమ్మెల్యేలు తక్కువై తమిళనాట రాజకీయ అనిశ్ఛితి ప్రస్తుతం నెలకొంది. ఈ స్థితిలో తనకు అవకాశం ఉన్నప్పటికీ రాజకీయంగా సొమ్ము చేసుకునే అనైతిక ఎత్తులపై స్టాలిన్ ఆసక్తి చూపడం లేదు.

విజయ్‌కి సలహాలు ఇస్తూనే...

కూటమి ధర్మాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీ స్టాలిన్‌ను సంప్రదించకుండానే విజయ్‌కి మద్దతు ప్రకటించింది. వామపక్షాలు, ఇతర రెండు పార్టీలతో స్టాలిన్ సమావేశమై టీవీకేకు మద్దతు అంశంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పడం ద్వారానూ తన పెద్ద మనసును చాటుకున్నారు. అత్యధిక స్థానాలు సాధించిన పార్టీయే పాలన చేయాలనే సూక్ష్మాన్ని, తమిళ ప్రజల తీర్పు సారాన్ని మనసా, వాచా కర్మణా గౌరవిస్తూ అందుకు అనుగుణంగానే ఆయన ప్రతి దశలోనూ మెదులుతున్నారు. పైగా ఇప్పటి దాకా చేసిన ముఖ్యమంత్రి అనుభవం, వాస్తవ ఖజానా పరిస్థితి ప్రకారం విజయ్‌కి చక్కని సలహాలు ఇస్తున్నారు..

రాజకీయాలకు గొప్ప సందేశం!

నెలకు తాను ఇచ్చినట్లు మహిళలకు రూ. వెయ్యి ఇవ్వాలనీ, విజయ్ ఇచ్చిన రూ. 2,500 హామీ ఇప్పటికిప్పుడు తనకు సాధ్యం కాకపోవచ్చనే సానుకూల దృక్పథంతో సూచనలు ఇస్తున్నారు. అంటే, దొడ్డి దారిన ప్రభుత్వాన్ని వశపర్చుకునే దురాశ, దురాలోచన, అధికార దాహం తనలో ఏమాత్రం లేదని ఈ విధంగానూ స్టాలిన్ సంకేతం ఇచ్చారు. తమ పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగానే, ప్రజా తీర్పుతోనే తిరిగి అధికారంలోకి రావాలే కానీ, ఇతరత్రా మార్గాల్లో కాదని వర్తమాన రాజకీయాలకు గొప్ప సందేశం ఇస్తోన్న స్టాలిన్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

- ఇల్లెందుల దుర్గాప్రసాద్

94408 50384

Next Story