దారి తప్పిన రాజకీయం

by Disha edit |
దారి తప్పిన రాజకీయం
X

ప్రస్తుతం రాజకీయ పార్టీలు అంటే ఎన్నికల కోసం మద్యం, డబ్బు ప్రలోభాలు, ఆర్బాటాలు,రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పనిచేసే ముఠాలుగా మారాయని అనడం అతిశయోక్తి కాదేమో! అలాంటి దుస్థితి నుండి రాజకీయ పార్టీలు వెంటనే బయట పడాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేనట్లే, రాజ్యాంగ పరిధిలో పని చేసే రాజకీయ పార్టీలకు చౌకబారు రాజకీయ మాటలు మాట్లాడే అర్హత లేదు. చట్ట పరిధిలో హుందాగా వ్యవహరించాలి. అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, బుద్ధిజీవులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి సమగ్ర విధానాలను రూపకల్పన చేయడం ద్వారా మాత్రమే దేశ ప్రజలకు సుపరిపాలన అందించవచ్చు. పార్టీలు ఈ విషయాన్ని గమనిస్తాయా?

రాజ్యాంగబద్ధంగా ఉండే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్రం భారత ప్రజాస్వామిక సుగుణాలు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే కేంద్రం కనుక ప్రజల కోసం పని చేసే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు, మేధావులు, చివరికి ఎవరైనా ప్రజల కోసం రాజ్యాంగంలోని హక్కులను వినియోగించుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. అనేక సందర్భాలలో భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా రాజ్యాంగ పరిధిలో చట్టసభలలో, చట్టసభల బయట ప్రభుత్వాలను, వ్యవస్థలను, అధికారులను, ప్రశ్నించవలసిన అవసరం ఎంతగానో ఉన్నదని వ్యాఖ్యానించింది. అప్పుడు మాత్రమే పాలనలో నిజమైన పారదర్శకత సాధ్యం అవుతుందని స్పష్టం చేసింది. ప్రశ్న ప్రజాస్వామ్య మౌలిక లక్షణం కూడా. ప్రశ్నోత్తరాలు, చర్చ, సందేహాలు, ప్రభుత్వ సమాధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు, ప్రజాస్వామ్యంలో పరిపాటి అని పాలక పక్షాలతోపాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కూడా గుర్తించాలి.

చౌకబారు రాజకీయాలు

గత సంవత్సర కాలంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యన ఒక వైరుధ్య, ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగుతున్నది. ప్రజలు పారదర్శక, చిత్తశుద్ధి, నిజాయితీ కలిగిన సుపరిపాలనను కోరుకుంటున్నారు. అదే లక్ష్యంతో టీఆర్‌ఎస్ 2014లో అధికారానికి వచ్చింది. లక్ష్యం అయితే పెట్టుకున్నారు కానీ, లక్ష్యసిద్ధికి అనుగుణంగా పనిచేయడంలో విఫలమయ్యారు. గమనం ఓవైపు, గమ్యం మరో వైపు అన్నట్టుగా చుక్కాని లేని నావలా తెలంగాణ ప్రయాణం సాగుతున్నది. రాజకీయ పార్టీల మధ్యన చర్చలు, ప్రశ్నలు, సందేహాలు, సద్విమర్శ ధోరణులు సహజమే. ఇందులో తప్పు లేదు. కానీ, ఒక పార్టీ ఒక కార్యక్రమాన్ని తలపెడితే మరొక పార్టీ దాని మీద వింత వ్యాఖ్యలు చేయడం, చౌకబారు రాజకీయాలకు తెర తీయడం పరిపాటిగా మారింది.

బీజేపీ ప్రజల వద్దకు వెళ్లడానికి అనేక సమస్యలను కేంద్రంగా చేసుకొని ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది ఆ అవకాశం, హక్కు రాజ్యాంగబద్ధంగా పార్టీలకు ఉన్నది. తప్పుడు విమర్శలు చేసినా, ఆధారాలు లేకపోయినా పరువునష్టం దావా వేయవచ్చు. కానీ, టీఆర్ఎస్ అందుకు భిన్నంగా అనేక అనేకసార్లు దాడులకు దిగింది. నిరసనలు, నల్లజెండాల ప్రదర్శనలు చేసింది. రాళ్లు విసిరింది. గుండాలను కూడా ప్రయోగించిందనే విమర్శలు వచ్చాయి. బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల కోసమే అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక రాజకీయ పార్టీకి ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రభుత్వాలు అణిచివేస్తే ఇక సామాన్యుల సంగతి ఏమిటనేది నా ప్రశ్న. మరొక అంశం ఏమిటంటే, అయితే ఎన్నికలు లేదా రెండు పార్టీల మధ్య ఘర్షణ తప్ప గత సంవత్సర కాలంగా పాలనకు సంబంధించి ఎలాంటి అడుగు పడకపోవడం గమనార్హం. ప్రచార ఆర్భాటాలతోనే కాలం గడపడం విచారకరం. ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు అమలు కాకపోగా, వాటిని ప్రచారం కోసం మాత్రమే వాడుకొని లబ్ది పొందే ప్రయత్నం జరుగుతున్నది.

కాలు దువ్వుతున్న పార్టీలు

టీఆర్‌ఎస్ 'తమకు 60 లక్షల సైన్యం ఉందని, వారిని ఆదేశిస్తే మీ గతి ఏమిటో ఆలోచించుకోవాలని' అనేక సందర్భాలలో వ్యాఖ్యానించింది. కయ్యానికి కాలు దువ్వింది. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో చాలా హీనమైనవి. ప్రభుత్వాలను, అధికారులను, కలెక్టర్‌ను, న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించగలిగే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండాలి. అది అసలైన పారదర్శక పాలన అవుతుంది. రెండు పార్టీలు కూడా అదే రకంగా యుద్ధానికి తలపడితే మరి ప్రజల గురించి ఎవరు ఆలోచించాలి? అంతో ఇంతో లౌకికవాద పార్టీగా పేరుగాంచి ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు, పేదరికం తదితర అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాట కార్యక్రమాలు తీసుకొని విజయవంతం చేసింది. కానీ, ఆ పార్టీలో ఉన్న ఒకానొక జగమెరిగిన బలహీనత అంతర్గత కుమ్ములాట ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పాలిట శాపంగా పరిణమించినది.

సుపరిపాలనకు అడుగులు పడాలి

మూడు రోజుల కిందట బీజేపీ నేతలు ప్రజా సంకల్ప యాత్ర రెండవ భాగానికి శ్రీకారం చుట్టింది. దీని గురించి ప్రకటన చేయవలసిన అవసరం కానీ, విమర్శించవలసిన స్థితి కానీ ప్రభుత్వానికి ఉండవలసిన అవసరం లేదు. బండి సంజయ్ యాత్రను మంత్రి 'కేటీఆర్' దగాకోరు యాత్రగా అభివర్ణించారు. నిజానికి టీఆర్‌ఎస్‌కు ఆ విమర్శ చేయవలసిన అవసరం ఉన్నదా? ఆ యాత్రను నిర్ణయించేది పార్టీ అయితే, వ్యతిరేకించే అవకాశం ప్రజలకు ఉంది. ఆ సంగతి ప్రజలే చూసుకుంటారు. ఇక వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేసిన దీక్షను 'దొంగ దీక్ష' అని బండి సంజయ్ వ్యాఖ్యానించడం కూడా అసంబద్ధము. కుసంస్కారమే.

ప్రస్తుతం రాజకీయ పార్టీలు అంటే ఎన్నికల కోసం మద్యం, డబ్బు ప్రలోభాలు, ఆర్బాటాలు, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పనిచేసే ముఠాలుగా మారాయని అనడం అతిశయోక్తి కాదేమో! అలాంటి దుస్థితి నుండి రాజకీయ పార్టీలు వెంటనే బయట పడాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేనట్లే, రాజ్యాంగ పరిధిలో పని చేసే రాజకీయ పార్టీలకు చౌకబారు రాజకీయ మాటలు మాట్లాడే అర్హత లేదు. చట్ట పరిధిలో హుందాగా వ్యవహరించాలి. అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, బుద్ధిజీవులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి సమగ్ర విధానాలను రూపకల్పన చేయడం ద్వారా మాత్రమే దేశ ప్రజలకు సుపరిపాలన అందించవచ్చు. పార్టీలు ఈ విషయాన్ని గమనిస్తాయా?

వడ్డేపల్లి మల్లేశము

రాజకీయ, సామాజిక విశ్లేషకులు

90142 06412


Next Story

Most Viewed