దారి తప్పిన బాల్యం

by Ravi |   (  Updated:2025-10-03 00:45:40  IST  )

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కూకట్‌పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో

దారి తప్పిన బాల్యం
X

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కూకట్‌పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో ఈ హత్య కేసుకు సంబంధించిన కొన్ని నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 14 ఏళ్ల బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం సహస్రను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పదవ తరగతి కూడా పూర్తికాని 14 ఏళ్ల బాలుడు 11 ఏళ్ళ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేయడం ఏంటి? ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటనే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి.

యూట్యూబ్ ఆధారిత నేరాలు..

బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం పక్కా ప్రణాళికతో అవసరమైతే హత్య చేయడానికైనా వెనకాడకూడదన్న ఉద్దేశంతో ముందుగానే తన ప్రణాలికను స్క్రిప్ట్ రూపంలో రాసుకుని దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించేలా చేసింది. 14 ఏళ్ల బాలుడికి స్క్రిప్ట్ రాసుకుని దొంగతనం చేయాలనే ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది క్రైమ్ సంబంధిత వీడియోల ప్రభావమే అని చెప్పాలి. అంతే తప్ప ఏ తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలు చేయమని తమ పిల్లలకు చెప్పరు. మరి క్రైమ్ సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో లభ్యమవుతున్నాయంటే తప్పు ఎవరిది అనే విషయంపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది.

క్రైమ్ వీడియోల కట్టడి ఎప్పుడు?

గతంలో క్రైమ్‌కి సంబంధించిన సినిమాలు కట్టడి చేయాలని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అందుకు సెన్సార్ బోర్డు చర్యలను సమర్థించుకుంటూ మానవ సమాజంలో నేరాలపై అవగాహన తీసుకురావడానికి మాత్రమే ఇలాంటి చిత్రాలు తయారు చేస్తున్నామని సమాధానమిచ్చారు. అంతేకాకుండా మంచి సినిమాలతో పాటు, క్రైమ్ సంబంధిత సినిమాలు కూడా చేస్తుంటే మరి మంచి సినిమాల ద్వారా ఎందుకు ప్రభావితం కావడంలేదన్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఏది ఏమైనా క్రైమ్ సంబంధిత వీడియోలు కట్టడి చేయడం ద్వారానే ఇలాంటి దుశ్చర్యల కట్టడి సాధ్యమనేది ముమ్మాటికీ నిజం.

జీవితంలో మొబైల్ ఓ భాగమయ్యింది!

మొబైల్ ఫోన్ ఇప్పటి పిల్లల జీవితంలో భాగం అయిపోయింది. పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలు కూడా మొబైల్ ఫోన్‌కి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ పని చేయనిదే ఇల్లు గడవని పరిస్థితి. ఈ హడావుడి బతుకుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు ఉండట్లేదు. మరికొందరి తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌పోన్లు మొదలు అడిగిందల్లా కొనిచ్చి అతి గారాబం చేస్తున్నారు. గత సంవత్సరం నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు అబ్బాయిలు అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేశారు. ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసే ఉత్సాహంలో తాము ఈ నేరానికి పాల్పడ్డామని వారు చెప్పారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లల్లో దుష్ట ప్రవృత్తి ప్రబలంగా ఉందనేది అక్షర సత్యం, కానీ ఆ పాపం ఎవరిది తల్లిదండ్రులదే..

బాల నేరస్తుల సంఖ్య పెరుగుతోంది!

ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా ఆయా నేరాల్లో పట్టుబడిన మైనర్లు 32.5శాతం మంది ఉండగా 2022 నాటికి పట్టుబడిన మైనర్ల సంఖ్య దాదాపు యాభై శాతానికి పెరిగింది. ఒక్క ఢిల్లీలోనే హత్యలతో ప్రమేయం ఉన్న మైనర్ల సంఖ్య 2014-24 మధ్య 8. 7 శాతం నుంచి 26. 78 శాతానికి పెరిగిందంటే రాబోవు రోజుల్లో దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఈ అంశాలపై విస్తృత చర్చ జరిగితేనే మార్పు కొంతమేరకు సాధ్యం అనే విషయాన్ని పాలకులు, తల్లిదండ్రులు, సభ్య సమాజం గమనించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించాలి.

-కోట దామోదర్

93914 80475

Next Story