ప్రజాధనంతో మంత్రుల పన్ను? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం!

by Ravi |   (  Updated:2026-06-30 00:46:00  IST  )

తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఆదాయపు పన్నును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే విధానంపై రాజ్యాంగపరమైన, నైతిక, ప్రజాస్వామ్యపరమైన ప్రశ్నలు ఏమిటి? సమానత్వ సూత్రం, ప్రజాధన వినియోగం, ప్రభుత్వ జవాబుదారీతనంపై విశ్లేషణ.

ప్రజాధనంతో మంత్రుల పన్ను? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం!
X

ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానులనే సూత్రం అత్యంత ప్రాథమికమైనది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన బాధ్యతలను నిర్ధారించింది. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన ఇతర ప్రముఖుల ఆదాయపు పన్నును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే విధానం కొనసా‌గుతుండటం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది.

పన్ను నుండి ఎవరూ తప్పించుకోలేరు కానీ..

ఒక రైతు తన కష్టార్జిత ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందే. ఒక ఉపాధ్యాయురాలు తన జీతంలో భాగాన్ని ఆదాయపు పన్నుగా చెల్లిస్తుంది. ఒక కార్మికుడు తన శ్రమ ఫలితంగా సంపాదించిన ఆదాయంపై విధించిన పన్నును తప్పించుకోలేడు. సామాన్య పౌరుడికి చట్టం నుంచి మినహాయింపు లేదు. అయితే అధికారంలో ఉన్నవారి వ్యక్తిగత ఆదాయపు పన్నును మాత్రం ప్రజల డబ్బుతో చెల్లించడం ఎలా సమర్థనీయమవుతుంది? ఈ అంశాన్ని చాలా కాలంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) లేవనెత్తుతోంది. ఫోరం అధ్యక్షుడు ఎం. పద్మనాభ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్లు వినతిపత్రాలు సమర్పించి, ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో రాష్ట్ర గవర్నర్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. ప్రజాధనాన్ని వ్యక్తిగత పన్ను బాధ్యతల కోసం వినియోగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

నిబంధన పాతదైతే న్యాయ సమ్మతమవుతుందా?

భారత రాజ్యాంగంలోని అధికరణ -14 ప్రతి పౌరుడికి చట్టం ముందు సమానత్వాన్ని హామీ ఇస్తుంది. సాధారణ ఉద్యోగి తన ఆదాయపు పన్నును స్వయంగా చెల్లించాల్సి వస్తే, ప్రజాప్రతినిధుల పన్నును మాత్రం ప్రజలే భరించడం సమానత్వ సూత్రానికి విరుద్ధంగా కనిపిస్తోంది. ఒక చట్టం పేదలకు, మరో చట్టం అధికార వర్గాలకు వర్తించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుకూలం కాదు. ఈ విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అమలులో ఉన్న Andhra Pradesh Payment of Salaries, Pensions and Removal of Disqualifications Act, 1953లోని నిబంధనల ఆధారంగా కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే ఒక నిబంధన పాతదై ఉండటం వల్ల అది న్యాయ సమ్మతమవుతుందని చెప్పలేం. కాలానుగుణంగా చట్టాలను సమీక్షించడం ప్రభుత్వ బాధ్యత. ఈ సౌకర్యాన్ని పొందుతున్న ప్రజాప్రతినిధుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు, అది వ్యక్తిగత సమాచారం అంటూ వెల్లడించలేమని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల పన్నుల డబ్బుతో చెల్లింపులు జరుగు తున్నప్పుడు, ఆ సమాచారం పూర్తిగా ప్రజా ప్రయోజనానికి సంబంధించినదే. ప్రజా ధనం ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?

సమానత్వం.. ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబించాలి!

ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు పాఠశాలలు, ఆసు పత్రులు, రహదారులు, తాగునీటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించాలి. కానీ అదే నిధులను ఇప్పటికే అధికార హోదాలు, వేతనాలు, భత్యాలు పొందుతున్న వ్యక్తుల వ్యక్తిగత ఆదాయపు పన్నుల చెల్లింపులకు వినియోగించడం సమంజసం కాదు. ప్రజాసేవ ప్రత్యేక హక్కు కాదు, బాధ్యత. ప్రజల ఓట్లతో ఎన్నికైన నాయకులు సాధారణ పౌరుల కంటే ఎక్కువ జవాబుదారీతనం ప్రదర్శించాలి. ప్రజలు చెల్లించే పన్నును ప్రజాప్రతినిధులు కూడా చెల్లించాలి. పన్ను నుంచి సామాన్య పౌరుడు తప్పించుకోలేనప్పుడు, ప్రజాప్రతినిధులకు కూడా దాని నుంచి మినహాయింపు ఉండకూడదు. ప్రజల డబ్బుతో మంత్రుల వ్యక్తిగత ఆదాయపు పన్నులు చెల్లించడం నిజంగా షాకింగ్. ఇది పునఃసమీక్షకు కాదు, తక్షణ సవరణకు అర్హమైన అంశం. ప్రజల డబ్బు ప్రజల కోసమే వినియోగించాలి. అధికారవర్గాల ప్రత్యేక ప్రయోజనాల కోసం కాదు. ప్రజాస్వామ్యంలో సమానత్వం రాజ్యాంగ పుస్తకాలలో మాత్రమే కాకుండా ప్రభుత్వ విధానాలలో కూడా ప్రతిబింబించాలి.

- సయ్యద్ రఫీ

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

[email protected]

Next Story