- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెలోడీ మాంత్రికుడు ఖేమ్‌చంద్ ప్రకాష్
ఖేమ్‌చంద్ ప్రకాష్ పేరు ఇవ్వాళ సినిమాల అభిమానులకు గాని, భారతీయ సినిమా సంగీతాభిమానులకు గాని గుర్తుండకపోవచ్చు.

ఖేమ్‌చంద్ ప్రకాష్ పేరు ఇవ్వాళ సినిమాల అభిమానులకు గాని, భారతీయ సినిమా సంగీతాభిమానులకు గాని గుర్తుండకపోవచ్చు. ఆయనే కాదు.. అత్యంత విజయవంతంగా వెలుగు వెదజల్లిన నటులూ, గాయకులూ అనంతర కాలంలో అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కోవడాన్ని చూశాం. అందుకే విజయాల్ని మాత్రమే చూసే ఏ కళయినా ఏ కొంచెం అపజయాన్ని అంగీకరించదు.. క్షణాల్లో మరిచిపోతుంది. ఆ కళాకారులు మరుగున పడిపోతారు. ఇది కఠినమైన వాస్తవం. ఆ క్రమంలోనిదే ఖేమ్‌చంద్ ప్రకాష్ సంగీత ప్రయాణం..
ఖేమ్‌చంద్ ప్రకాష్‌ది హిందీ చలనచిత్ర సీమలోని సంగీత ప్రపంచంలో ఒక తిరుగులేని అధ్యాయం. ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన చేసిన గాయనీ గాయకుల పరిచయాలు, ఆయన పాటల వెనకున్న తత్త్వం ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఆయన్ని గుర్తుచేసుకోవడం ఇన్నేళ్ల తర్వాత కూడా మరిం త అవసరం. ఎందుకంటే సంగీతం ఎప్పటికీ నిలిచిపోదు కాని దాన్ని సృష్టించిన వాళ్లను గుర్తు చేసుకోకపోతే అదే నిజమైన మరణం. మిలమిల మెరిసే సినీ ప్రపంచం కేవలం విజయాల్ని, ప్రస్తుతాన్ని మాత్రమే గుర్తుంచుకుంటుంది.
సహాయకుడిగా చేరి..
హిందీ చలనచిత్ర సంగీతానికి తొలి అడుగులు వేసిన ప్రతిభావంతులలో ఖేమ్‌చంద్ ప్రకాష్ స్థానం అత్యుత్తమైంది. పాటల కంటే ఎంతో మిన్నగా హిందీ చిత్ర సంగీతానికి ఆయన అందించిన సేవలు ఎంతో ఉన్నతమైనవి. 1930వ దశకంలో ఖేమ్‌చంద్ సినీ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. మొదట ఆనాటి ప్రముఖ స్వరకర్త టిమీర్ బారణ్‌కు సహాయకుడిగా పనిచేశారు. 1935లో వచ్చిన K.L. సైగల్ నటించిన ‘దేవదాస్’ చిత్రంలో సహాయ స్వరకర్తగా పని చేశారు. ఆ తర్వాత స్వతంత్రంగా పని చేయడం ప్రారంభించారు. మొదటి రోజుల్లో పరదేశి, హోలీ, ఫర్యాద్ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ముఖ్యంగా గాయని ఖుర్షీద్‌తో కలిసి పనిచేసి అనేక హిట్ పాటలను అందించారు.. 1941లో వచ్చిన పరదేశీ భారీ విజయం సాధించింది.
లత, కిశోర్‌ల గాత్రానికి ప్రాణ ప్రతిష్ట...
1948లో వచ్చిన 'జిద్దీ' సినిమాలోని ‘ఏ కౌన్ ఆయా రే’ అనే యుగళగీతాన్ని రికార్డింగ్‌కు వెళ్తుండగా లతా, కిశోర్‌ను తనను వెంబడిస్తున్నాడని అపోహపడింది. ఇదే సినిమా ద్వారా కిశోర్ కుమార్ తన తొలి సోలో గీతం ‘మర్నే కి దువాయే క్యోన్ మాంగూ’ పాడి అరంగేట్రం చేశారు.. ఈ ఇద్దరినీ కలిపిన వాడు ఖేమ్‌చంద్ ప్రకాష్. ఇక 1948లో వచ్చిన ‘జిద్దీ’ అనే చిత్రంలో ఖేమ్‌చంద్ కిషోర్ కుమార్‌కు మొదటి గొప్ప అవకాశం ఇచ్చారు ప్రకాష్. అంతేకాదు, 1949లో వచ్చిన మిస్టరీ క్లాసిక్ ‘మహల్’ సినిమాలో “ఆయేగా ఆనేవాలా” అనే పాటను లతా మంగేష్కర్‌తో పాడించి ఆమెకు రాత్రికి రాత్రే యావత్ భారత దేశంలో అత్యంత పేరునూ, ప్రఖ్యాతినీ అందించారు..
హిందీ సంగీత స్వర్ణయుగానికి దారులు..
ఈ haunting melodyతో ఖేమ్‌చంద్ యావత్ సంగీత కారుల గాయకుల దేశ దృష్టిని మరోసారి ఆకట్టుకున్నారు. తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన రూపొందించిన ఈ పాటలే తర్వాత 1950లలో హిందీ సంగీత స్వర్ణయుగానికి దారులు వేశాయి. ఒకరకంగా వేదిక లయ్యాయి 1940ల చివరలో, 50 తొలిదశలో విశిష్ట సంగీత దర్శకుడిగా ఎదిగిన ఆయన, అనేక మంది గొప్ప గాయకులు, నటీనటులతో కలిసి పనిచేశారు. కె.ఎల్. సైగల్, కామిని కౌశల్, నూర్జహాన్, షంషాద్ బేగమ్, అశోక్ కుమార్ లాంటి వారు ఆయన స్వరానికి నాట్యం చేసినవారే.. లతా, కిశోర్ కాకపోతే మన్నా డే, ముకేశ్, మహమ్మద్ రఫీ, నౌషాద్ లాంటి వారి కెరీర్‌ను ఆవిష్కరించింది కూడా ఆయనే..
ఈ పాటలు అజరామరం..
1907 డిసెంబర్ 12న జైపూర్‌లో జన్మించిన ఖేమ్‌చంద్ ప్రకాష్ చిన్న వయసులోనే రాజస్థాన్ కోటల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లి స్వతంత్రంగా సంగీత దర్శకత్వంలో ప్రయాణం ప్రారంభించారు. ఆయన మొదటి చిత్రం ‘గాజీ సలావుద్దీన్’, దానిలో నౌషాద్ తనకి సహాయకుడిగా పని చేశారు. 1943లో వచ్చిన తాన్సేన్ చిత్రం ఖేమ్‌చంద్‌ను సంగీత దర్శకుల లోకంలో అగ్రస్థానానికి చేర్చింది. ది యా జలావో జగమగ జగమగ, రుమ్‌ఝుమ్ రుమ్‌ఝుమ్ చ ల్ తిహరీ, సప్త సురన్ తీన్ గ్రామ్ వంటి పాటలు నేటికీ సంగీత అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ చిత్రంతో ఆయన సంగీత ప్రతిభ మరింత గొప్పగా వెలుగులోకి వచ్చింది.
రాగ, తాళ, స్వర మాధుర్యం..
తనకున్న హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంపై పట్టు, మరో వైపు పియానో, క్లారినెట్ లాంటి పాశ్చాత్య వాద్యాలను తన పాటలలో వినిపించిన తొలి సంగీత దర్శకుల్లో ఒకడిగా చరిత్ర లో నిలిచారు ప్రకాష్. ఆయన స్వరాల్లో ఉన్న భావోద్వేగం, శ్రావ్యత, శ్రేణి వింటూ ఉంటే నేటికీ సంగీత ప్రియులను పర వశింపజేస్తుంది. ఖేమ్‌చంద్ ప్రకాష్ తన తక్కువ కెరీర్‌లోనే 40కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.. చివరి రోజుల్లో మూడు సినిమాలపై పని చేస్తుండగా ఆయన హఠాన్మరణం చెందారు. ఆయన మరణానంతరం మన్నాడే ముందుండి వాటిని పూర్తి చేశారని చెబుతారు.
రెండు తరాలకు సంగీతం అందించి..
అంత గొప్ప సంగీతాన్ని అందించిన ఖేమ్‌చంద్ ప్రకాష్, అంతమంది గొప్ప గాయకులకు తొలి అవకాశాలు ఇచ్చిన ఖేమ్‌చంద్ ప్రకాష్ కుటుంబం ఆయన మరణానంతరం దారిద్య్రంలో పడిపోయింది. ఈ విషాదకరమైన విషయాన్ని ప్రఖ్యా త గీత రచయిత జావేద్ అక్తర్ భారత పార్లమెంట్‌లో పేర్కొన్నారు. కేవలం ‘ఆయేగా ఆనేవాలా’ పాటకు రాయల్టీ రూపంలో పది లక్షల రూపాయల విలువ ఉండగా కూడా, ఆ కుటుంబం అడుగడుగునా బాధను చవిచూసింది. రెండు తరాల సంగీతాన్ని అందించిన ఈ మెలోడి మాంత్రికుడు మరువలేనివాడు.
వారాల ఆనంద్
94405 01281






