- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

పరిపాలన విభాగంలో అత్యున్నతస్థాయి ఐఏఎస్ మహిళా అధికారులను గురించి ప్రధాన న్యూస్ చానల్స్, యూట్యూబ్ న్యూస్ లలో అభ్యంతర, అసత్య వార్తలు, కథనాలు ప్రసారం కావడం సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రసారమైన కథనాలు పూర్తిగా మహిళా ఐఏఎస్ ల గౌరవ మర్యాదలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవి. ఈ వార్తలు వారిని మానసిక క్షోభకు గురిచేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఊహాజనిత అంశాల ఆధారంగా ఉన్నతాధికారులపై కథనాలు ప్రసారం చేయడం లైవ్ చానల్స్ శాడిజానికి పరాకాష్ట.
మహిళా ఐఏఎస్‌కు హక్కులుండవా?
మంత్రులతో అక్రమ సంబంధాలను అంటగడుతూ మహిళా ఐఏఎస్ పట్ల నీచమైన వివాదస్పద కథనాన్ని ఒక ప్రముఖ చానెల్, మరి కొన్ని ఇతర చానళ్ళు ప్రసారం చేశాయి. వీటి ప్రసారాలకు ముందు వార్తలలోని వాస్తవాలేమిటోనని బేరీజు వేసుకోకపోవడం శోచనీయం. జర్నలిస్ట్ వృత్తి తర్కంతో పరిశీలించకపోవడం బాధాకరం. అధికారులకు అక్రమసంబంధాలు అంటగట్టే ముందు వారు భవిష్యత్తులో ఎదుర్కునే అవమానాలు, జరగబోయే పరిణామాలను మానవతా కోణంలోనైనా ఆలోచించాల్సింది. ఏదో ఒక అంశానికి ఇష్టమైన రంగు పులిమి ప్రసారం చేయడం దురదృష్టకరం. రాజకీయ చదరంగంలో మీడియా, అధికారులు ఇరుక్కోవడం విచారకరం.
తప్పుడు ప్రసారాలకు హక్కులు ఏమిటో?
అసలు విషయం పక్కన పెడితే మహిళల వ్యక్తిగత హననానికి కారణమైన వార్తలు ప్రసారం చేయడం సిగ్గుచేటు. గతంలో సిఏంఓలో పని చేసిన స్మిత సబర్వాల్ మీద అవుట్‌లుక్ పత్రిక ఇలానే అభ్యంతరకర కార్టూన్‌ను ప్రచురించింది. అది తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని ఆమె అవమాన భారంతో పరువునష్టం దావా వేశారు. ఇలాంటి పిచ్చివార్తలు, కథనాల ప్రసారానికి చానల్స్‌కి ఉన్న హక్కులేమిటో?. ఈ కథనాలతో ఉన్నత స్థాయి మహిళాధికారులకు మీడియా ఇచ్చే గౌరవం ఇదేనా అన్పించక మానదు.
వ్యూస్ కోసం పుకార్ల ప్రసారం
యూట్యూబ్ చానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటితో సమాజానికి మేలుకంటే కీడే ఎక్కువ. చానల్స్ వ్యూస్ పెరగడం కోసం తప్పుడు వార్తలను లేదా పుకారులను ప్రసారం చేయడానికి వెనకడుగు వేయడం లేదు. యూట్యూబ్ చానల్స్‌తో వ్యూవర్స్ గందరగోళానికి లోనవుతున్నారు. నిజం మరుగున పడుతోంది. మెయిన్ స్ట్రీమ్ చానళ్ళ కంటే వీటి హడావిడి అంతా ఇంతాకాదు. ప్రస్తుత మహిళా అధికారిపై తప్పుడు వార్తల ప్రసారంలో యూట్యూబ్ చానల్స్ ఒకదానితో ఒకటి పోటీ పడి ప్రచారం చేశాయి. రాజకీయ వికృత క్రీడలో చాలా యూట్యూబ్ చానల్స్ పావులు. రాజకీయ లబ్ధిదారుల కోసం అబద్ధాలను వండి వారించడంలో ఇవి దిట్ట. ఇలాంటి చానల్స్ ను ప్రశ్నించే వ్యవస్థలు లేకపోవడం. పత్రికా స్వేచ్ఛ పేరుతో వాటిని ఎవరు ఏమీ చేయలేకపోవడం వలన టి.ఆర్.పి రేట్లు, వ్యూస్, లైక్ ల ఆరాటంతో యూట్యూబ్ చానల్స్ ఇష్టారీతిన చెలరేగిపోతున్నాయి.
చట్ట ప్రకారం తప్పుడు రాతలపై చర్యలు
చానల్స్ పైన, తప్పుడు వార్త కథనాలపై ఒకేసారి మార్పు తీసుకురావడం సాధ్యంకాదు. కాబట్టి చట్టం పరిధిలోనే తప్పుడు ప్రసారాల, ప్రచార చానల్లను తరుచుగా ప్రశ్నించాలి. ఇదే వారిని సరిదిద్దే మార్గం. తప్పుచేసిన చానల్స్‌ను విచారించాలి. తప్పు చేస్తే శిక్షించాలి. అప్పుడే అసత్య వార్తలను ప్రసారంచేస్తే కేసులు, విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం వారిలో కలుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ప్రసారాలు, అసత్య కథనాలను అడ్డుకోవాలంటే ప్రభుత్వం సమాచార సాంకేతిక చట్టం-2000 లలోని అవసరమైన సెక్షన్లను వాడుకోవాలి. విచారణలో ప్రసారం చేసిన వార్తల్లో ఎలాంటి వాస్తవికత లేదని తేలితే సెక్షన్ 79(3)(b) ప్రకారం కంటెంట్ ను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రసార వార్తలు హేయమైనవైతే యూట్యూబ్ ఛానల్లనే మూసివేసే అధికారం ప్రభుత్వానికి కలదు. వార్తల ప్రసార స్వేచ్ఛా యూట్యూబ్ చానళ్ళకు ఉంది, కాని అవి వ్యక్తిగత నిందలకు, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేవై ఉండకూడదు.
హుందాగా విచారించాలి, ఆదర్శంగా నిలపాలి.
ప్రస్తుత వివాద విచారణలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తూ సంబంధిత చానెల్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో యాజమాన్యాలను వదిలేసి కేవలం జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోవడం అసలైన దోషులకు వెన్నుకాయడమే. ఈ ఉదంతం వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని జర్నలిస్టు సంఘాలు, ప్రధాన పార్టీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. జర్నలిస్టుల అరెస్టులను ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్య మనుగడకు నాలుగో స్తంభంగా పిలువబడే పత్రికలపై, జర్నలిస్టులపై ప్రభుత్వ చర్యలు గర్హనీయం. సమాజం మొత్తాన్ని అత్యంత ప్రభావితం చేసే ఇలాంటి ఉదంతాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించి భవిష్యత్తుకు ఆదర్శంగా నిలపాలి.
-డాక్టర్ సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
98496 18116






