మ్యారేజ్.. బాయ్‌కాట్ గోల్డ్!

by Ravi |   (  Updated:2026-01-25 01:15:44  IST  )

దేశవ్యాప్తంగా రెండేండ్లుగా ఒక్క పదం వింటేనే సామాన్యుల్లో వణుకు పుడుతుంది.. అదే బంగారం. ఇప్పుడు ఇంకొకటి చేరింది. అదేమో వెండి. భారతీయ సంప్రదాయాల్లో ఈ రెండింటికీ ఉన్న ప్రాధాన్యత అంతు లేనిది..

మ్యారేజ్.. బాయ్‌కాట్ గోల్డ్!
X

దేశవ్యాప్తంగా రెండేండ్లుగా ఒక్క పదం వింటేనే సామాన్యుల్లో వణుకు పుడుతుంది.. అదే బంగారం. ఇప్పుడు ఇంకొకటి చేరింది. అదేమో వెండి. భారతీయ సంప్రదాయాల్లో ఈ రెండింటికీ ఉన్న ప్రాధాన్యత అంతు లేనిది. కట్టుబాట్లలో ఎన్ని మార్పులొచ్చినా ఈ రెండూ ఎవర్ గ్రీన్. ఐతే ఇప్పుడేమో ఆ కట్టుబాట్లను దాటినట్లుగానే బంగారం, వెండిని కూడా దూరం చేసుకోవాల్సిందే. అయితే, పేద, మధ్య తరగతి వర్గాల్లో ఈ రెండింటికీ అవకాశం లేదు.. ఈ రెండు వస్తువులను అనివార్యంగా దూరం చేసు కోవాల్సిందే.. ఆ ఆభరణాలు కావాలని పట్టుబడితే కుటుంబాలే ఆగమయ్యే కాలమొచ్చింది. ఆహార్యానికి ప్రాధాన్యతనిచ్చే కుటుంబాలు మరో దారిని వెతుక్కోవాలి.

అలా కాదని బంగారు ఆభరణాలే ఒంటి నిండా ఉండాలని ఆశ పడితే అప్పుల పాలై జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. పెళ్లిల్లో కట్నం ప్రస్తావన రాగానే.. ఎంత బంగారం? అనేది మొదటి ప్రశ్న. ఆ తర్వాతే ఇంకేదైనా.. ఇప్పుడది మారనున్నదని తెలుస్తుంది. సామాన్యులంతా బంగారం అనే పదానికి దూరం కావాలని బులియన్ మార్కెట్ ఆదేశిస్తుంది. ఎవరింట పెళ్లి ఉన్నా కాస్తో కూస్తో బంగారు ఆభరణాలు తప్పనిసరి. 50, 60 ఏండ్ల క్రితం పెళ్లిల్లో పట్టు పీతాంబరాలు పెట్టేవారు. అందులో బంగారం లేదా వెండి ఉండేది. ఇప్పుడది కనుమరు‌గైంది. ఎందుకంటే చీరల్లో ఆ ముడిసరుకుల వినియోగం లేదు. ఐతే ఇప్పుడిలాగే మార్కెట్ ఉంటే ఒకప్పుడు బంగారు ఆభరణాలు పెట్టేవారట! అని చెప్పుకోవాలి.

అమ్మాయి కోసం..

మాది కూడా మధ్య తరగతి కుటుంబం. అందుకేనేమో మా బంధువుల్లో చాలా మంది బంగారం ఆభరణాలు కొనేందుకు ప్రతి నెలా చిట్టీలు వేస్తున్నారు. నెలకు రూ.2 వేలు, రూ.5 వేల వంతున పొదుపు చేసేవారు. చిట్టీ పూర్తి కాగానే ఆ మేరకు బంగారం కొనేవాళ్లు ఉన్నారు. అంతెందుకు.. చాలా బంగారం షోరూములు కూడా నెలవారీ వాయిదాలు చెల్లించే స్కీంలు నడిపిస్తున్నాయి. ప్రతి నెలా చెల్లిస్తే గడువు ముగియగానే దానికి తగ్గట్లుగా బంగారం ఇచ్చేందుకు అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. పెద్ద పెద్ద గోల్డ్ షోరూమ్స్ ఈ స్కీమ్స్‌ని నడిపిస్తున్నాయి.. వాటిలోనూ ఒకేసారి బంగారం కొనుగోలు చేయలేని మధ్య తరగతి వర్గాలు చేరుతున్నాయి. ఏడాదికో, రెండేండ్లకో ఓ తులం బంగారం వస్తుంది కదా అన్న ఆశ. ఎలాగూ ఒకే సారి కొనడం అసాధ్యం. ఇలా పైసా పైసా కూడబెడితేనే రేపు మా అమ్మాయి పెళ్లికి ఉపయోగపడుతుందంటూ స్కీంల్లో చేరే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని షోరూమ్స్ ల్లోనూ నెల వారీ చెల్లింపుల పథకాలు అమలవుతున్నాయి. అంటే అమ్మాయి పెళ్లిలో బంగారం ఎంత ప్రధానమో అర్థం చేసుకోవడానికి నడుస్తోన్న ఈ స్కీమ్స్ ఓ ఉదాహరణ మాత్రమే.. ఐతే ఇప్పుడెట్లా అన్న ప్రశ్న ప్రతి కుటుంబంలోనూ చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో పది తులాల బంగారం పెట్టాలనుకునే వారికి ఇప్పుడు మూడు తులాలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

పెళ్లి ఓ బిజినెస్..

పెళ్లి అంటే ఇరువురి మధ్య జరిగే ఒప్పందమే. కానీ ఈ తంతులో ఓ పెద్ద బిజినెస్ డామినేట్ చేస్తుంది. అందులోనూ బంగారం / వెండి, బట్టలే పెద్దవి. దాంతో పాటు ఫంక్షన్ హాల్, ఫోటో షూట్స్, వంటలు, ట్రాన్స్ పోర్ట్.. ఇలాంటివి అనేకం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వీటిలో దేన్ని నుంచీ తప్పించుకోవడానికి చాన్స్ లేదు. ఎందుకంటే మన పక్కింటోళ్లూ, మన బంధువులు.. అలాగే చేశారు కదా! వాళ్లు చేశారు కనుక.. మనమూ అలాగే చేయాలన్న కుటుంబ వ్యవస్థ సామాన్యుడిని అప్పుల పాలు జేస్తున్నాయి. ఆఖరికి ఏ చిన్న ఫంక్షన్ చేసినా.. అందులో ఈ బంగారం, వెండి అతిథులే.. వాళ్లు లేకుండా ఫంక్షన్ చేయడానికే వీ‌ల్లే కుండా వ్యవస్థను రూపొందించారు. పెళ్లి అనే బిజినెస్‌లో అన్ని రంగాలు విరాజిల్లాలన్నట్లుగా సంప్రదాయాలను మార్చారు. వీటిని అధిగమించకపోతే రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం, వెండి జీవితాలనే ఆవిరి చేసే అవకాశం ఉంది. జీవితాంతం కష్టపడి సంపాదించినదంతా వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు 15 నుంచి 20 ఏండ్ల పాటు ఈఎంఐలు కడుతున్న జీవితాలు కోట్లల్లో ఉన్నాయి. సొంతిల్లు సొంతం కావాలంటే అన్నేండ్ల పాటు చెమట ఆవిరి కావాల్సిందే.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెళ్లిని సింప్లిఫై చేసుకోవాల్సిన వాస్తవాన్ని సామాన్యుడు గుర్తించాల్సిందే.

ధరలెందుకు పెరుగుతున్నాయబ్బా?

బంగారం, వెండి ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం 10 గ్రాములు రూ.లక్షన్నర దాటింది. అలాగే వెండి కిలో రూ.3 లక్షలు దాటింది. పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏమిటో నాలాంటి వాడికి కూడా సరిగ్గా అర్ధం కావు. కానీ అది మన భవిష్యత్తు అంచనాలను కిందా మీద చేస్తున్నది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయన్నది వాస్తవమే. అమెరికా, ఇతర దేశాల మధ్య నెలకొన్ని తగాదాలు, గ్రీన్‌ల్యాండ్‌‌ని కొనుగోలు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడి ప్రకటన, ఐరోపా దేశాలపై పన్నులు విధిస్తామన్న హెచ్చరికలు ప్రపంచాన్ని అస్థిరం చేస్తున్నాయి. ఈ ప్రతికూల సమయాల్లో డబ్బులు ఉన్నోళ్లంతా షేర్ మార్కెట్లో కంటే బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తు‌న్నారు. ఇండియా, చైనా, ఇతర అనేక దేశాల బ్యాంకులు డాలర్ నిల్వలను తగ్గించుకుంటున్నాయి. బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాయి. దీని వల్ల మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఆర్ధికవేత్తలు అంటున్నారు..

ధర పెరిగినప్పుడే కొంటున్నరు..

ఐతే ఈ ఏడాది చివరి నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు, తగ్గుతాయని మరికొందరు అంటున్నారు. ఈ భిన్న వాదనల మధ్య బంగారం, వెండి కొనుగోళ్లపై గందరగోళం నెలకొన్నది. ఐతే ఏ గోల్డ్ షోరూమ్ ఖాళీగా లేదు. కస్టమర్లు కనిపిస్తూనే ఉన్నారు. ఇంకా పెరిగితే ఎట్లా అన్న భయంతో ఉన్నదంతా వెచ్చించి కొనుగోలు చేసే వారు లేకపోలేదు. బంగారం ధర తగ్గినప్పుడు ఎవరూ కొనడం లేదు. అదే ధర పెరిగిందనప్పుడు చూడాలి అన్ని బంగారం దుకాణాలు ఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఇంకా ధర పెరుగుతుందేమోనన్న భయం వెంటాడుతున్నది. 2022లో రూ.52 వేలకే అన్నాం. ఇప్పుడు దానికి ముందు ఓ అంకె చేరింది. ఇంకేం కొంటాం అనుకుంటే రానున్న రోజుల్లో నంబర్ మారొచ్చు. వెండి కూడా రూ.600 అనుకుంటే ఇప్పుడది ఎక్కడి దాకా పోయిందో చూడండి.

- శిరందాస్ ప్రవీణ్​కుమార్

80966 77450

Next Story