పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

by D.Markandeya |
పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?
X

2021 జూన్ నాటికి తెలంగాణలో అంత్యోదయ అన్నయోజన, అంత్యోదయ అన్నపూర్ణ పథకాల కింద కలిపి మొత్తం 90 లక్షల 47 వేల 150 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. 2020 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో మొత్తం ఒక కోటి మూడు లక్షల కుటుంబాలున్నాయి. అనగా నూటికి 87.8 శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఈ కుటుంబాలలోని వ్యక్తుల నుంచే వివిధ రకాల పథకాల, స్కీముల నియమ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. కేవలం 12.2 శాతం అనగా 12 లక్షల 52 వేల 850 కుటుంబాలు మాత్రమే పేదరికంలో లేవన్నమాట. మరో 4 లక్షల 46 వేల కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని గత జూన్ 8న రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది కనుక ఈ సంఖ్య 10 లక్షల దిగువకు చేరుకోవడం ఖాయం. అంటే, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షల కంటే అధికంగా సంపాదించే కుటుంబాలు నూటికి పది మాత్రమే ఉన్నట్లు లెక్క.

సమగ్ర కుటుంబ సర్వే డాటా ప్రకారం మూడెకరాలకు పైబడిన రైతులు రాష్ట్రంలో 13 లక్షల 47 వేలు ఉన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలలో, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8 లక్షల 37 వేలు. మరో 9 లక్షల 13 వేల మంది ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్నారు. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరై నెలనెలా పెన్షన్ అందుకుంటున్న కుటుంబాల సంఖ్య 3 లక్షల 17 వేలు. ఏడాదికి ఐదు లక్షలకు మించి రాబడి వుండి ఆదాయపు పన్ను కడుతున్న కుటుంబాల సంఖ్య 7 లక్షల 6 వేలు. ఇళ్లలో ఏసీలున్నవాళ్లు 97 వేలు, ట్రాక్టర్లు-హార్వెస్టర్లు ఉన్నవాళ్లు 94 వేలు, కార్లు తదితర ఫోర్ వీలర్లున్నవాళ్లు 3 లక్షల 17 వేలు, త్రీవీలర్లున్నవాళ్లు లక్షా 21 వేలు. టూ వీలర్లున్నవాళ్లు 23 లక్షల 65 వేలు ఉన్నారు. 24 లక్షల 90 వేల మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్‌సీసీ నివాసభవనాలున్నాయి. 5 లక్షలకు పైబడిన ఇళ్లల్లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లున్నాయి. ఇవి 2014 లెక్కలు కనుక ఇప్పడు ఈ సంఖ్య ఇంకా పెరిగే వుంటుంది.

ఇప్పుడు చెప్పండి.. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు పేదల బతుకులకు ఆసరానిస్తున్నాయా? లేక పెద్దల జేబులు నింపుతున్నాయా? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, రిటైరై వేల రూ.ల పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లు, ఇన్‌కం టాక్స్ కడుతున్నవాళ్లు, డబుల్, ట్రిపుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటూ ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్లు, హోం థియేటర్లు, ఐప్యాడ్లు, ఐఫోన్లు మెయింటెయిన్ చేస్తున్నవాళ్లు, సొంత కార్లున్నవాళ్లు, ఫ్లైట్ జర్నీ చేస్తున్నవాళ్లు, లక్షలలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నవాళ్లు పేదలెలా అవుతారు? వాళ్లకు తెల్ల రేషన్‌కార్డులెందుకు ఇవ్వాలి? తీసుకున్న రేషన్ బియ్యం బ్లాక్‌లో అమ్మకోవడానికా? ఆరోగ్యశ్రీ మొదలు ఆసరా వరకు వివిధ పథకాల కింద ప్రయోజనాలు పొంది మరిన్ని ఆస్తులు కూడబెట్టుకోవడానికా?


సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీవాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13 లక్షల మంది వృద్ధులకు, 14 లక్షల మంది వితంతువులకు, 1.20 లక్షల ఒంటరి మహిళలకు, 4.17లక్షల బీడీ కార్మికులకు, 35 వేల మంది నేతన్నలకు, 60 వేల మంది కల్లుగీత పనివాళ్లకు, 16 వేల మంది బోధకాలు బాధితులకు, 32 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ. 2016 చొప్పున, 4.94 లక్షల మంది వికలాంగులకు, 43 వేల మంది వృద్ధ కళాకారులకు రూ.3016 చొప్పున ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. పది వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. 2018 ముందస్తు ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ప్రస్తుత (2021) రబీ సీజన్‌లో మొత్తం 63.25 లక్షల మంది రైతులు కోటీ యాభై లక్షల ఎకరాలకుగానూ రూ.7508 కోట్ల లబ్ధి పొందుతారు. ఏటా ఈ పథకానికయ్యే ఖర్చు అక్షరాలా 15 వేల కోట్లు. ఇక రైతుబీమాతో 32 లక్షల కుటుంబాలు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్ కింద 6 లక్షలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటు కింద 4 లక్షలు, గొర్రెల పంపిణీ కింద 3.76 లక్షలు, బర్రెల పంపిణీ కింద మరో లక్షకు పైగా, చేపపిల్లల పెంపకంతో 1.50 లక్షలు, ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 2 లక్షల కుటుంబాలు సర్కారు ఖజానా నుంచి వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం పొందుతున్నాయి. పలు జిల్లాలలో వేలాది డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్యలక్ష్మి, కంటివెలుగు, గర్భిణులకు కేసీఆర్ కిట్ అమలవుతున్నాయి. రైతులకు ట్రాక్టర్లు, ముదిరాజ్‌లకు టాటా ఏస్ వాహనాలు సబ్సిడీపై అందిస్తున్నారు. ఇటీవలే అర్హులైన ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించే దళితబంధును కూడా సీఎం ప్రారంభించారు.

అసలు తిరకాసు ఇక్కడే

చాలా వివరంగా నేనిచ్చిన ఈ లెక్కలు మీకు ఫుల్ బోరింగ్‌గా ఉండచ్చు. ఆ లెక్కలు తెలువంది ఎవరికి? అని కూడా అనిపించవచ్చు. అసలు తిరకాసు ఇక్కడే ఉంది. లెక్కకు మిక్కిలి అమలవుతున్న ఈ పథకాలన్నింటికీ కలిపి ఏటా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోంది. అది మనందరం వివిధ రకాల పన్నుల రూపంలో కట్టిన మన సొమ్మే. 2014-15 నుంచి 2021-22 వరకు ఏడు రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో ఇలాంటి సంక్షేమ పథకాల కోసం 3 లక్షల 94 వేల 517 కోట్ల రూ.లు కేటాయించారు. కేసీఆర్ మాటలలో. ప్రభుత్వ ప్రకటనలలో, జీఓలలో చెప్పినట్లుగా ఈ అన్ని పథకాల లక్ష్యం ఒక్కటే. కష్టాలలో, కన్నీళ్లలో, బాధలలో ఉండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని అభాగ్యులను, పేదలను ఆదుకోవడమే. ఒక్క రైతుబంధుకు తప్ప ఏ పథకానికి సంబంధించిన జీఓ చూసినా ఈ విషయమే నియమ నిబంధనలలో ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి వివిధ డాక్యుమెంట్లను జత చేయమంటారు. ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును ఆధారంగా తీసుకుంటారు. కులం అవసరమైతే క్యాస్ట్, స్థానికత కావాలంటే నేటివిటీ, ఆదాయం కావాలంటే ఇన్‌కం సర్టిఫికేట్ అడుగుతారు. అతను పేదవాడా? కాదా? నిర్ణయించడం కోసం మాత్రం బేసిక్‌గా వైట్ రేషన్ కార్డును ప్రాతిపదికగా వాడుతారు. ఇతర నిబంధనలు వర్తించి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ పేదలకోసం ప్రవేశపెట్టిన ప్రతి ప్రభుత్వ పథకమూ మంజూరవుతుంది.

లెక్కల మాయాబజార్

2021 జూన్‌నాటికి తెలంగాణలో అంత్యోదయ అన్నయోజన (ఏఏవై-కేంద్ర పథకం) కింద 53 లక్షల 67 వేల 678 కార్డులు, అంత్యోదయ అన్నపూర్ణ (ఏఏపీ-రాష్ట్ర పథకం) కింద 36 లక్షల 79వేల 472 కార్డులు కలిపి మొత్తం 90లక్షల 47 వేల 150 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. మరో 4 లక్షల 46 వేల 169 కార్డులను కొత్తగా ఇవ్వాలని గత జూన్ 8న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. కాగా, 2020 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో మొత్తం ఒక కోటి మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి. అనగా నూటికి 87.8 శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఈ కుటుంబాలలోని వ్యక్తుల నుంచే వివిధ రకాల పథకాల, స్కీముల నియమ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. 12.2 శాతం అనగా 12 లక్షల 52 వేల 850 కుటుంబాలు మాత్రమే పేదరికంలో లేవన్నమాట. మరో 4 లక్షల 46 వేల మందికి కూడా ప్రస్తుతం కొత్తగా కార్డులు ఇస్తున్నారు కనుక ఈ సంఖ్య 10 లక్షల దిగువకు చేరుకోవడం ఖాయం. అంటే తెలంగాణలో నూటికి కేవలం పది మంది మాత్రమే అధికారికంగా ధనికులు ఉన్నట్లు లెక్క.

వేరు వేరు నిబంధనలు

2015లో కేంద్రం ప్రతిపాదించిన ప్రకారం నెలకు గ్రామీణప్రాంతాలలో రూ. 1,060, పట్టణ ప్రాంతాలలో రూ.1,286 ఖర్చు చేసే స్థితిలో లేని కుటుంబాలు దారిద్ర్యరేఖకు (బీపీఎల్) దిగువన జీవిస్తున్నట్లు అర్థం. దేశ జనాభాలో 6.7 శాతం ప్రజలు మాత్రమే దారిద్ర్యంలో బతుకుతున్నారని 2019లో మోడీ సర్కారు తెలిపింది. ఈ అర్హతల ప్రకారమే అంత్యోదయ అన్నయోజన కార్డులు జారీ కావాలి. అయితే, ఈ కార్డులు మంజూరు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే కనుక ఒక్కోచోట ఒక్కోరకం నిబంధనలు అమలవుతున్నాయి. మన తెలంగాణలో 52 శాతం కుటుంబాలకు ఈ కార్డులున్నాయి. ఇక, రాష్ట్రానికి వస్తే, తెల్ల రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణప్రాంతాలలో ఏడాదికి రూ.60 వేలు, పట్టణప్రాంతాలలో రూ.75 వేలు సంవత్సరాదాయ పరిమితిగా ఉండింది. తెలంగాణ ప్రభుత్వం 2015లో ఈ పరిమితిని పెంచింది. ప్రస్తుతం పల్లెలలో ఏటా రూ.1.50 లక్షలకు, పట్టణాలు, నగరాలలో రూ.2 లక్షలకు మించని ఆదాయం ఉన్నవాళ్లకు ప్రస్తుతం అంత్యోదయ అన్నపూర్ణ పథకం కింద వైట్ కార్డులు (ఆహార భద్రతకార్డులు) జారీ చేస్తున్నారు. అనగా జనాభాలో మరో 35.7శాతానికి ఈ తరహా కార్డులున్నాయి.

సర్కారువారి లెక్కలు ఇలాగా

ఇప్పుడు నాణానికి మరోవైపు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రైతుబంధు లెక్కల ప్రకారం తెలంగాణలో మూడెకరాల పైబడి భూమి ఉన్న రైతు కుటుంబాలు 16 లక్షల 72 వేలు ఉన్నాయి. 2014లో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డాటా (2019లో విడుదలైంది) కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. ఈ వివరాల ప్రకారం కూడా మూడెకరాలకు పైబడిన రైతులు 13 లక్షల 47 వేలున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలలో, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8 లక్షల 37 వేలు. మరో 9 లక్షల 13 వేల మంది ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్నారు. వీరుకాకుండా ప్రభుత్వోద్యోగం చేసి రిటైరై నెలనెలా పెన్షన్ అందుకుంటున్న కుటుంబాల సంఖ్య 3 లక్షల 17 వేలు. ఇక ఏడాదికి ఐదు లక్షలకు మించి రాబడి వుండి ఆదాయపు పన్ను కడుతున్న కుటుంబాల సంఖ్య 7 లక్షల 6 వేలు. భారీ వ్యాపారం చేస్తున్న వారు 27 వేల మంది. ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు ఉన్నవాళ్లు 97వేలు, ట్రాక్టర్లు-హార్వెస్టర్లు ఉన్నవాళ్లు 94 వేలు, కార్లు, బస్సులు, లారీలు తదితర ఫోర్ వీలర్లున్నవాళ్లు 3 లక్షల 17 వేలు, త్రీవీలర్లున్నవాళ్లు లక్షా 21 వేలు, టూ వీలర్లున్నవాళ్లు 23 లక్షల 65 వేలు ఉన్నారు. 71 లక్షల 15 వేల మందికి బ్యాంకు అకౌంట్లున్నాయి. రాష్ట్రంలో మొత్తం 46 లక్షల 78 వేల ఆర్‌సీసీ నివాస భవనాలుండగా, వీటికి 24లక్షల 90వేల యజమానులున్నారు. పెంకుటిళ్లు, పూరిగుడిసెలు, డేరాలలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 13 లక్షల 90 వేలు మాత్రమే. సొంతింటిలోనో లేదా అద్దె ఇంటిలోనో రెండు లేదా అంతకంటే ఎక్కువ గదులున్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య ఏకంగా 52 లక్షలకు పైగానే ఉంది. 5 లక్షలకు పైబడిన కుటుంబాలు ఆర్‌ఓ వాటర్ తాగుతున్నాయి. ఇవి 2014లో సేకరించినవి కనుక ఇప్పడు ఈ సంఖ్య ఇంకా పెరిగేవుంటుంది.

తెల్లకార్డులు వాపస్ చేస్తారా?

ఇప్పుడు చెప్పండి. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు పేదల బతుకులకు ఆసరానిస్తున్నాయా? లేక పెద్దల జేబులు నింపుతున్నాయా? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, రిటైరై వేల రూ.ల పెన్షన్లు తీసుకుంటున్నవాళ్లు, ఇన్‌కం టాక్స్ కడుతున్నవాళ్లు, డబుల్, ట్రిపుల్ బెడ్రూం ఇళ్లలో ఉంటూ ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్లు, హోం థియేటర్లు, ఐప్యాడ్లు, ఐఫోన్లు మెయింటెయిన్ చేస్తున్నవాళ్లు, సొంత కార్లున్నవాళ్లు, ఫ్లైట్ జర్నీ చేస్తున్నవాళ్లు, లక్షలలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నవాళ్లు పేదలెలా అవుతారు? వాళ్లకు తెల్ల రేషన్‌కార్డులెందుకు ఇవ్వాలి? తీసుకున్న రేషన్ బియ్యం బ్లాక్‌లో అమ్మకోవడానికా? ఆరోగ్యశ్రీ మొదలు ఆసరా వరకు వివిధ పథకాల కింద ప్రయోజనాలు పొంది మరిన్ని ఆస్తులు కూడబెట్టుకోవడానికా? ఆలోచించండి. ధైర్యం, దమ్ము, మానవత్వం ఉంటే, మీరు పేదలు కాదనుకుంటే, బాగానే బతుకుతుంటే తెల్లకార్డులు వాపస్ చేయండి. పథకాలకు అప్లయి చేయకండి. ఆ పథకాలు నిజమైన అనాథలకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు, కటిక దరిద్రంలో బతుకుతున్నవాళ్లకు అందేలా సహకరించండి! ('సంక్షేమ పథకాలలో మరోకోణం' వచ్చే వారం)

-డి మార్కండేయ


Next Story