- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల కొత్త దశకు ఐక్యతే మార్గం!
సాయుధ పోరాటం, అజ్ఞాత జీవితం నుంచి బయటకు వస్తున్న మావోయిస్టుల కొత్త రాజకీయ ప్రయాణం, వారి త్యాగాల ప్రాధాన్యం, వామపక్ష ఐక్యత అవసరం, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి నిర్మాణ అవకాశాలపై విశ్లేషణ.

మావోయిస్టు ముఖ్య నాయకులంతా సాయుధ పోరాటాన్ని, అజ్ఞాతాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చారు. వారితో పాటు వందలాదిగా దళాలు, దళ సభ్యులు వచ్చారు. దండకారణ్యం అంతా దాదాపు ఖాళీ అయింది. ఎవరో కొంతమంది మిగిలినా వారి ప్రభావం చాలా పరిమితం.
అనేకమంది ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, కవులు, రచయితలు, వామపక్ష సంస్థలు కలిసి మావోయిస్టులు సాయుధ పోరాటం, అజ్ఞాతం వదిలి బయటకు వచ్చి బహిరంగంగా కార్యక్రమాలలో పాల్గొనాలని, ప్రభుత్వం కూడా అందుకు సహకరించాలని కోరుతూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు....
అమూల్య త్యాగాలు వృధా కారాదు..
ఏదైతేనేం సైద్ధాంతికంగా విభేదించి కొందరు, అనివార్యమైన పరిస్థితుల రీత్యా మరికొందరు బయటకు వచ్చారు. జనాలు, మావోయిస్టుల త్యాగాలను గుర్తించారు. హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. వారు మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి ప్రజల కొరకు పనిచేయాలని కోరుకుంటున్నారు. అజ్ఞాతం వదిలి బయటకు వస్తున్న మావోయిస్టులు తమ పోరాట రూపం మారుతుందే కాని పోరాటం ఆగదన్నారు. వారు రాజకీయ సన్యాసం చేస్తారని ఎవ్వరూ భావించలేదు. వీరి అమూల్యమైన త్యాగాలు వృధా కాకూడదని మాలాంటి వారం ఆశిస్తున్నాం.
ఏమీ తెలీనివారి నుంచి విమర్శలు..
నాలుగైదు దశాబ్దాల పాటు అనేక త్యాగాలు చేసిన మావోయిస్టులను సమాజమంతా ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా మారిన పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకొని ప్రాణాలతో ఉండాలని, ప్రజల పక్షాన నిలడాలని, అందుకు అజ్ఞాతం నుండి బయటికి రావాలని కోరుకున్నారు. ఎవరో కొంతమంది పరిపక్వత లేని, పరిణామాలు అర్థం చేసుకోలేని వారు భిన్నాభిప్రాయాలు కలిగుండవచ్చు. అజ్ఞాతం, ఆయుధాలను వదిలి వచ్చిన మావోయిస్టుల నిర్ణయం తప్పని అనవచ్చు. అలా అనేవారెవరికి సాయిధ పోరాటం చేసిన అనుభవం లేదు. అక్కడ ఎదుర్కొన్న సాధక బాధకాలు వీరికి ఏమాత్రం తెలియవు. ఎన్ని ఇబ్బందుల తర్వాత, అనివార్యమైన పరిస్థితుల్లో మావోయిస్టులు బయటకు రావాల్సివచ్చిందో వారికి అర్థం కాదు. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పటికీ ఉద్యమాలపై సానుభూతి..
తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మేము ఫలానా తెలంగాణ సాయుధ పోరాట యోధుని కొడుకునని, మనువడినని గర్వంగా చెప్పుకుంటుంటారు. కమ్యూనిస్టు ఉద్యమం అన్నా, కమ్యూనిస్టు పార్టీ అన్నా ఏ పార్టీలో వున్నా అభిమానం చూపిస్తూ ఉంటారు. గత 50 సంవత్సరాల పైగా నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో బలంగానే వేళ్ళూనికొని ఉన్నది. విద్యార్థి ఉద్యమంలో, యువజన ఉద్యమాలలో, రైతు కూలీ ఉద్యమాలలో, విప్లవ రచయితల సంఘం తదితర సంఘాల ద్వారా కొంత కృషి జరిగింది. తాత్కాలిక నిర్బంధాలకు గురై చురుకుగా కనపడకపోయినా సమయం వచ్చినప్పుడు వారంతా కూడా కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులుగానే ఉద్యమానికి సహకరించగల స్థితిలోనే ఉంటారు.
స్పష్టంగానే అపార్థాలున్నాయ్..!
గత ఐదారు నెలలలో సోను, ఆశన్న, బార్స్ దేవా, చంద్రన్న, దామోదర్, దేవ్‌జీ, సంగ్రాం, ముప్పిడి సాంబన్న, చొక్కారావు తదితరులతో వందలాది మంది వివిధ స్థాయి నాయకులు, దళసభ్యులు బయటకు వచ్చారు. వారందరి మధ్య చిన్న చిన్న విషయాల పైన భిన్నాభిప్రాయాలు, అపార్థాలు ఉన్నట్టు వివిధ సందర్భాలలో బహిర్గతమైనవి. వీటిని ఆసరా చేసుకుని మిత్రులనుకునే వారు సహితం అపరిపక్వతతో వాటిని పెంచటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది శత్రువుకే లాభం. బయటికి వచ్చిన మావోయిస్టులంతా సమన్వయం చేసుకొని, భిన్నాభిప్రాయలను, అపార్థాలను భూతద్దంలో చూసుకోకుండా ప్రజల ప్రయోజనాల కోసం ఐక్యంగా సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఒక్క ఇగోను త్యాగం చేయగలిగితే...
కమ్యూనిస్టులు అన్ని త్యాగం చేయగలరు కానీ ఒక్క ఇగో ని(అహంభావం) మాత్రం త్యాగం చేయలేకపోతున్నారనే అభిప్రాయం మిత్రుల్లోను, శత్రువుల్లోను ఉన్నది. దేశంలోని అత్యధిక ప్రజానీకం అనుభవిస్తున్న బాధలను కష్టాలను చూసి స్పందించి తమ సౌఖ్యాలను త్యజించి, కుటుంబ బాధ్యతలను పక్కకు పెట్టి సమాజం కొరకు ప్రాణాలను సైతం ఫణంగా పె ట్టటానికి సిద్ధపడ్డ కమ్యూనిస్టులు సంకుచితత్వాలు ఏమైనా ఉంటే పక్కకు పెట్టి, విశాలంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విశాల ప్రత్యామ్నాయం ఆవశ్యం!
వివిధ కమ్యూనిస్టు పార్టీల నిర్మాణాలలో ఉన్న వారి కంటే కమ్యూనిస్టు పార్టీల బయటున్నవారే ఎక్కువగా ఉన్నారు. వారందరూ కమ్యూనిస్టుల ఐక్యత కోరుకుంటున్నారు. ఇలాంటి శక్తులన్నీ సరైన వామపక్ష ప్రత్యామ్నాయంతో ముందుకు వస్తే అత్యధిక ప్రజానీకం వామపక్ష శక్తులతో నడవడానికి వెనుకాడవు. మావోయిస్టులు ఇంతకాలం సాయుధంగా ఉండటం వలన, అజ్ఞాతంలో ఉండటం వల్ల మిగతా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పని చేసే అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు అందరూ కలిసి బహిరంగంగా, బయట పనిచేయడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి అందుకు కావలసిన విధివిధానాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఐక్యత ఒక్కటే కాపాడుతుంది!
మావోయిస్టుల ముందు కొన్ని తక్షణ సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే అరెస్టైనవారు, బయటికి వచ్చిన వారంతా ఐక్యంగా ఉంటేనే ఒక శక్తిగా కనపడతారు. మిగతా వామపక్ష, అభ్యుదయ, ప్రజాస్వామ్య శక్తులను సమైక్య పరచడానికి మార్గం సుగమం అవుతుంది. ఇతరులు కూడా వీరి పట్ల శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. వివిధ వామపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, మేధావులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పడి వారి సమస్యల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భావం అవసరం!
అలాంటప్పుడే మావోయిస్టులు దేశంలోనే ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వీరి చొరవతో బలమైన ప్రత్యామ్నాయాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం కచ్చితంగా అన్ని వామపక్షాలు కలిసి ఒక కనీస కార్యక్రమాలతో ముందుకు పోతే తప్పకుండా ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని నా నమ్మకం. "సాయుధ పోరాట పంధా మార్చాము, కానీ మా పోరాటం ఆగదు" అన్న వాళ్ల అవగాహన సార్ధకమవుతుందని నేను నమ్ముతున్నాను. అందుకు బయటకొచ్చిన మావోయిస్టులు కూడా బాధ్యతతో కృషి చేస్తారని ఆశిద్దాం.
-జి రాములు
కేంద్ర కంట్రోల్ కమిషన్ మాజీ సభ్యుడు, సీపీఎం
94900 98006






