స్వరమే ఆత్మగా వెలిగిన మన్నా డే

by Ravi |   (  Updated:2026-04-25 01:00:33  IST  )

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించి, హిందీ సినీ సంగీతంలో ప్రత్యేక స్థానం సంపాదించిన మన్నా డే జీవిత గాధ, ఆయన గాన వైభవం, గుర్తుండిపోయే పాటలపై సమగ్ర విశ్లేషణ.

స్వరమే ఆత్మగా వెలిగిన మన్నా డే
X

మన్నా డే హిందీ చలన చిత్ర సీమలో ఒక గాయకుడు మాత్రమే కాదు. ఆయన పాడిన ప్రతి పాటలో రాగం ఒక నదిలా ప్రవహించింది. తాళం ఒక శ్వాస అయింది, భావం ఒక దీపమై వెలిగింది. ఆయన సంప్రదాయం మరియు ఆధునికత మధ్య వంతెనలాంటి వాడు. నిజానికి బెంగాల్‌ సాంస్కృతిక పరంపరను, బొంబాయి సినీ ప్రపంచాన్ని కలిపిన గొంతు ఆయనది..

ఒక సందర్భంలో మహమ్మద్ రఫీ ‘ప్రజలు నా పాటలు వింటారు.. కానీ నేను మాత్రం మన్నా డే పాటలనే వింటాను’ అని అన్నారు.. ఇదే ఒక గాయకుడు మరో గాయకుడికి ఇచ్చే అత్యున్నత ప్రశంసగా చెప్పుకోవచ్చు.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించి..

తన అసలు పేరు ప్రభోద్ చంద్ర డే 1919 మే 1న కోల్‌కతా‌లో జన్మించిన ఆయన, బాల్యంలోనే సంగీత కుటుంబ వాతావరణంలో పెరిగారు. ఆయన మొదటి గురువు తన పినతండ్రి కిషన్ చంద్ర డే. అక్కడి నుంచే శాస్త్రీయ సంగీత పట్ల భక్తి, క్రమశిక్షణ మన్నాడేలో పెరిగాయి. తరువాత ఉస్తాద్ దబిర్ ఖాన్, ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ గురువుల వద్ద శిక్షణ పొంది, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించాడు.. ఈ పునాది ఆయన సినీ గాన ప్రయాణానికి బలమైన మూలం అయింది. బాబాయి మన్నాడేని చేయి పట్టి సంగీత ప్రపంచం‌లోకి నడిపించాడు. కే.సి.డే ను 13 ఏండ్ల వయస్సు‌లోనే అంధత్వం ఆవరించడంతో మన్నా డే అతనికి నీడలా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కలకత్తాలో న్యూ థియేటర్స్ వారి ప్రాభవం వుండగా వీళ్లు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు బాంబే దారిని ఎంచుకున్నారు.

గాంధీ చూసిన ఏకైక సినిమా..

1940 దశకంలో బొంబాయికి వెళ్లిన మన్నా డే, సంగీత దర్శకులకు సహాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. తరువాత స్వతంత్ర గాయకుడిగా ఎదిగాడు. ఆ ఎదుగుదల అంత సులభంగా జరగలేదు. దాదాపు అప్పటికే మహమ్మద్ రఫీ మాధుర్యం, ముఖేష్ విరహ వేదన, కిషోర్ కుమార్ చలాకితనం హిందీలో వేళ్లూనుకుని ఉంది. అంతే కాకుండా రాజ్ కపూర్ అంటే ముకేష్ అన్నట్టుగా ఒక్కొక్క నటుడికి హీరోకి ఒక స్వరం స్థిరమై వుంది. మన్నా డే 1942లో తమన్నా చిత్రంతో ప్లేబ్యాక్ సింగింగ్ కెరీర్ మొదలు పెట్టారు. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. తర్వాత 1943లో రామరాజ్యలో ముసలి పాత్రకు పాడారు.. దాంతో మన్నా డే స్వరం అలాంటి పాత్రలకే సరిపోతుందనే భావం స్థిరపడ సాగింది. రామరాజ్య సినిమా మహాత్మా గాంధీ చూసిన ఏకైక సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.

సంగీతజ్ఞుల గాయకుడు..

తర్వాత మన్నాడే 1950లో వచ్చిన ‘మషాల్’ చిత్రంలో ‘ఉపర్ గగన్ విశాల్’ అనే సోలో గీతం ద్వారా విజయాన్ని సాధించారు. దీనికి సంగీతం అందించింది ఎస్.డి.బర్మన్ 1952లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘అమర్ భూపాలి’లో బెంగాలీ, మరాఠీ భాషల్లో పాడి బెంగాలీ నేపథ్య గాయకుడిగా తన స్థానాన్ని స్థిరపరుచుకున్నారు. అప్పరికి బెంగాల్‌లో హేమంత్ కుమార్ ప్రభావం అనితర సాధ్యంగా వుండేది. అలాంటి స్థితిలో కూడా మన్నాడే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. హిందీ చలన చిత్ర సీమలో కూడా క్రమంగా తన స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. సంగీత దర్శకులకు ‘సంగీతజ్ఞుల గాయకుడి’గా మారారు. క్లిష్టమైన, శాస్త్రీయ ఆధారిత గీతాలు ఆయనకు అప్పగించసాగారు. ఆ క్రమంలో ఎస్.డి.బర్మన్, శంకర్ జైకిషన్ ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు.

జనరంజక గీతాలాపన కర్త

ఇక మన్నాడే పాటల్ని చూస్తే ‘దిల్ హీ తో హై’ సినిమాలో రాజ్ కపూర్ పై చిత్రీకరించిన ‘లగా చునరి మే దాగ్’ విశేషమయిన సంగీత భరితమయిన పాట. ఇక ‘మేరా నామ్ జోకర్’లో ఏ భాయ్ జరా దేఖ్ కే చలో హాస్యభరితమైన పాట, చాలా జనాదరణ పొందింది. ‘జంజీర్’ లో విలన్ ప్రాన్ పై చిత్రీకరించిన యారీ హై ఇమాన్ మేరా స్నేహానికి చిహ్నంగా నిలిచిన పాట. పడోసన్‌లో ఏక్ చతుర్ నార్ పాట మన్నా డే కిశోర్ కుమార్‌లు పోటీగా సాగే హాస్య గీతం అద్భుతమైన క్లాసిక్, ఉపకార్ సినిమాలో డే పాడిన కసమే వాదే ప్యార్ వఫా దేశభక్తి స్పూర్తితో నిండిన పాట. ఇక సీమా సినిమాలో ఆయన పాడిన తు ప్యార్ కా సాగర్ హై భక్తిభావంతో నిండిన పాట, ఇప్పటికీ భజన్‌గా పాడతారు. ఇక ‘మేరీ సూరత్ తేరీ ఆంఖే’ లో పూఛో న కైసే మైంనే రైన్ బితాయీ విషాదభరితమైన పాట, మన్నా డే గారి గొప్ప ప్రతిభకు నిదర్శనం ఇది. మరో అద్భుతమయిన పాట ‘బసంత్బహార్’ లో పండిట్ భీమ్‌సేన్ జోషి గారితో కలిసి పాడిన పాట సుర్ నా సజే శాస్త్రీయ సంగీత పోటీ దృశ్యంలో చిత్రీక రించారు. ఆ పాట చరిత్రలో నిలిచి పోయింది.

ప్రపంచవ్యాప్తంగా గాన ప్రదర్శనలు..

అట్లా వేలాది పాటలను అనేక భారతీయ భాషల్లో ఆలపించిన మన్నా డే ప్రపంచవ్యాప్తంగా వేదికలపై గాన ప్రదర్శనలు ఇచ్చారు.. సంగీతంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు ప్రదానం చేసింది. అయిదు దశాబ్దాలకుపైగా ముంబైలో గడిపిన ఆయన తర్వాత బెంగళూరులో నివసిస్తూ కూడా వృద్ధాప్యంలో ప్రపంచమంతా పర్యటిస్తూ ప్రదర్శనల్ని ఇచ్చారు.

- వారాల ఆనంద్

94405 01281

Next Story