NMMS ఆన్‌లైన్ ప్రక్రియను సులభతరం చేయండి!

by Ravi |   (  Updated:2025-08-08 00:30:29  IST  )

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి వారికి ఆర్థికంగా చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం

NMMS ఆన్‌లైన్ ప్రక్రియను సులభతరం చేయండి!
X

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి వారికి ఆర్థికంగా చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పుర స్కారం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ (NMMS) పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు టాలెంట్ పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇంటర్ వరకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను సాయంగా అందిస్తున్నారు. ఇంతవరకు బానే ఉన్నా, ఎంపికైన విద్యార్థుల ఖాతాల్లో మొత్తం జమకావడానికి ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయ డానికి ఎనిమిది దశలలో ప్రక్రియ ఏర్పాటు చేయడంతో ఇది ప్రధానోపాధ్యాయులకు పరీక్షగా మారింది. విద్యార్థికి బ్యాంక్ అకౌంట్ మొదలు.. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వివరాలతో పాఠశాల నమోదు వివరాలు సరిపోకపోతే ఉపకార వేతనం రావడం లేదు. ఇక చర వాణిలో ముఖ గుర్తింపు సరిగ్గా రాకపోవడం, పాఠశాల హెడ్ నమోదు, నోడల్ ఆఫీసర్ నమోదు కాకపోవడం మూలాన విద్యాశాఖ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరగవలసి వస్తుంది. ఈ విధానం పట్ల జిల్లాశాఖ అధికారులకు కూడా పూర్తి అవగాహన లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో కొన్నిసార్లు ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయకపో వడంతో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు అందకుండా పోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతిభ కనబరచి పరీక్షలో ఎంపికైన విద్యార్థుల నమోదు ప్రక్రియను సరళతరం చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేసి ప్రక్రి యను సులభతరం చేస్తుందని ఆశిద్దాం.

-సుధాకర్ ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Next Story