- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుఃఖం అనుభవించు.. జీవితం అర్థమవుతుంది!
గమ్యం దిశగా నేను ఒంటరిగానే ప్రయాణాన్ని ప్రారంభించాను / కానీ మనుషులు రాస్తాలో కలిసి రావడం మొదలు పెట్టారు

‘గమ్యం దిశగా నేను ఒంటరిగానే ప్రయాణాన్ని ప్రారంభించాను / కానీ మనుషులు రాస్తాలో కలిసి రావడం మొదలు పెట్టారు / క్రమంగా అది ఓ ఊరేగింపయింది’. ఇది మజ్రుహ్ సుల్తానపురి ప్రఖ్యాత కవితలో ఒక భాగం.. ఈ రోజు మళ్లీ జీవించాలనిపిస్తోంది/ బంధాల భయాల ఊసులు విరిచి / స్వేచ్ఛ లేని గడులనుండి వెలుగు వైపు పరుగులు/ ఓ కొత్త ఊపిరి లాంటి ఉత్సాహం/ ఓ కొత్త గమ్యం లాంటి పిలుపు/ ఇప్పుడే నిజమైన జీవితం మొదలైనట్లు ఉంది... ఇది ఆయన ‘గైడ్’ సినిమా కోసం రాసిన ఒక పాట.
నీవు లేని ఈ జీవితంలో నాకేమీ బాధ లేదు/ నీ జ్ఞాపకాలే నా ప్రాణ నాడి/ నీవు లేని జీవితం ఓ శూన్యపు గాథ అయినా/ నీ ప్రేమ ఒక నిరంతర ప్రవాహంగా/ నన్ను నడిపిస్తోంది/ నీ తోడు లేకపోయినా/ నీ తలపులే నన్ను నిలిపాయి.. ఇది ఆంధీ సినిమాలోని పాట. ఇట్లా ఇటు కవిత్వంలోనూ అటు హిందీ సినిమా పాటల్లోనూ తనదైన స్వరంతో రచనలు చేసిన వాడాయన.
ప్రజలకు చేరువైన కవిత్వం
మజ్రూహ్ సుల్తానపురి కవిత్వం మొత్తం ప్రేమ, తిరుగుబాటు, మార్మికతలతో నిండి ఉన్న గొప్ప అనుభవం. ఆయన రచనల్లో జీవితం ఉంది, భావోద్వేగాల గాథలున్నాయి. బాలీవుడ్ పాటల ప్రపంచంలో ఆయన అనేక గొప్ప పాటలు రాసి చిరస్మరణీయంగా నిలబడ్డప్పటికీ మజ్రూహ్ అసలు కవితా శక్తి అర్థవంతమైన, ప్రజలకు చేరువైన ఆయన కవిత్వంలో ఉంది. మజ్రూహ్ కవితా శైలిలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఆయన ఉపయోగించిన అతి సాధారణ పదాలు వాటిలోని లోతైన భావాలు.. ఆయన రాసిన "చలో ఏక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయే హమ్ దోనో” వంటి పంక్తులు ప్రేమలో ఏర్పడే మౌనాన్ని, విరహాన్ని సున్నితంగా వ్యక్తపరుస్తాయి.
జనం నిత్యం శ్వాసించే ప్రకంపన
మొత్తంగా మజ్రూహ్ జీవితం మాటల ప్రవాహం అదొక పద ప్రయాణం. ఒంటరిగా మొదలై, లక్షల మందితో సాగిన ఈ కవితా పయనం శాశ్వతంగా కొనసాగుతుంది ఆయన కవిత్వం సామాన్యుడు నిత్యం శ్వాసించేది, ఎప్పటికీ చిర స్థాయిగా నిలిచేది. ఆనాడే ప్రోగ్రెసివ్ రైటర్స్ ఉద్యమంతో ప్రభావితుడైన మజ్రూహ్ తన కవిత్వాన్ని సామాజిక మార్పును ఆశిస్తూ రాశారు. "హమ్ తో ఆవాజ్ హైం, దీవార్ సే చున్ జాతే హైం" వంటి వాక్యాలు నిరంకుశత్వాన్ని ఎదుర్కొన్న ధైర్యాన్ని సూచిస్తాయి. ఘజల్స్, కవితలు, పాటల్లాంటి అన్ని కవితా రూపాల్లో మజ్రూహ్ తన భావాలను వ్యక్తపరిచారు. "రాత్ భర్ కా హై మెహ్మాన్ అంధేరా’ లాంటి మాటలు మనసుకు హత్తుకుంటాయి. ఆయన సాహిత్యం నిండా ప్రేమ విరహం తిరుగుబాటు ఒంటరితనం, ఆశా దృక్పథం, మానవత్వం తొణికిసలాడతాయి. మజ్రూహ్ కేవలం ఒక కవి కాదు ఒక ప్రకంపన. చిన్న పట్టణ దారుల నుంచి ముంబై స్టూడియోల వైభవోపేతమైన ప్రపంచానికి ఆయన ప్రయాణం సాగింది. భావోద్రేకంతో, నిర్భీతితో కూడిన ఆయన భాష ఒక అపారమైన ప్రేమతో నిండింది.
గాయపడ్డ వారికి సాంత్వన
మజ్రూహ్ సుల్తాన్‌పురి అనే పేరుతో చిరస్మరణీయంగా నిలిచిన ఆయన, అసలు పేరు అస్రార్ ఉల్ హసన్ ఖాన్, ఆయన సుల్తాన్‌పూరి, ఉత్తరప్రదేశ్‌లో 1919 అక్టోబర్ 1న పుట్టారు. మజ్రూహ్ యువకుడిగా మదర్సాలో అరబీ, ఫార్సీ చదువుకున్నాడు. కానీ చిత్రంగా గజళ్లు ఆయన రక్తంలో ప్రవహించాయి. ఆ ప్రేమ, కష్టం, తన కలలన్నింటికి చిహ్నంగా ‘గాయపడ్డవాడు’ అనే అర్థంలో ‘మజ్రూహ్’ అనే పేరు ఏర్పడింది. 1935లో సుల్తాన్‌పూరిలో జరిగిన ముషాయి రాలో మొదటిసారి గజల్ చదివాడు. అది ఆయన జీవితాన్నే మార్చేసింది.
నాటి నేతలను కుదిపేసిన కవిత
తాను వెయ్యికి పైగా హిందీ సినిమాల పాటలు రాసిన ప్పటికీ, తన పాటల్ని “ప్రదర్శన కళ”గా మాత్రమే అభివర్ణించాడు. మజ్రూహ్ సమాన హక్కుల కోసం పోరాడేవాడు. మిల్లు కార్మికుల కోసం నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన నెహ్రూకు వ్యతిరేకంగానూ, ఖాదీపైనా వ్యంగ్యంగా తాను రాసిన కవితను చదివాడు. అది ఆనాటి రాజకీయ వర్గాలను కుదిపేసింది. అప్పుడు బొంబాయి గవర్నర్‌గా ఉన్న మోరార్జీ దేశాయ్, మజ్రూహ్‌ను ఆర్థర్ రోడ్ జైల్లో వేసి, క్షమాపణ కోరాడు. కానీ నిబద్ధత కల మజ్రూ క్షమాపణ చెప్పడానికి నిరాకరించి, రెండేళ్లు జైలులోనే గడపడానికి సిద్ధమయ్యాడు. జైల్లో ఉన్నప్పటికీ రచనలు చేయడం ఆపలేదు. సామాజిక రాజకీయ ఒత్తిడి పెరిగి, పరిస్థితులు వేడెక్కడంతో, ఆనాటి రాజకీయ వ్యవస్థే ఆయనను విడుదల చేయాల్సి వచ్చింది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత
సంగీత దర్శకుడు నౌషాద్ ఒక ముషాయిరాలో ఆయన కవితను విని “షాజహాన్” చిత్రంలో మొదటిసారి పాట రాయించాడు. తర్వాత 1965లో “దోస్తీ” చిత్రానికి రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలిచాడు. S.D. బర్మన్, R.D. బర్మన్, లక్ష్మీకాంత్–ప్యారేలాల్, ఆనంద్–మిలింద్ వంటి గొప్ప సంగీత దర్శకులతో కలిసి ఎన్నో గొప్ప పాటలు రాసాడు. సీనియర్ సంగీత దర్శకులతోనే కాకుండా నవ తరంతో కూడా కలిసి పనిచేసిన ఆయన యువతలో యువకుడిగా కలిసిపోయాడు. 1993లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుని, అటు భారతీయ హిందీ సినిమా రంగంలోనూ ఇటు సాహిత్యంలోనూ చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన రాసిన పాటలు, షాయరీ, నజ్మ్స్ ఈనాటి యువతరాన్ని ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. సుల్తాన్‌పూరి సెమినార్‌లో ఒక యువకుడు .. “సార్, మీరు ఇన్ని అందమైన పంక్తులు ఎలా రాస్తారు?” అని అడగ్గా మజ్రూహ్ చిరునవ్వు నవ్వుతూ “బేటా, దర్ద్ అనుభవించు, జీవితం అర్థమవుతుంది” అన్నాడు. ఆయన ముంబైలో 2000 మే 24న చనిపోయినా, రచనలు, పాటలు సజీవం.
- వారాల ఆనంద్
94405 01281






