శిథిల జ్ఞాపకాల ఆవేదన.. మై వాపస్ ఆవుంగా

by Ravi |   (  Updated:2026-07-18 00:45:55  IST  )

దేశ విభజన గాయాలు, జ్ఞాపకాలు, తొలి ప్రేమ, కుటుంబ బంధాలను హృద్యంగా ఆవిష్కరించిన ‘మై వాపస్ ఆవుంగా’ చిత్ర సమీక్ష.

శిథిల జ్ఞాపకాల ఆవేదన.. మై వాపస్ ఆవుంగా
X

చరిత్ర మిగిల్చిన వేదనాభరిత జ్ఞాపకాల్లో ‘దేశ విభజన’ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ నేపథ్యం నుంచి అనేకానేకమైన చిత్రాలు వచ్చాయి.. చరిత్ర ఎప్పుడూ ఆనంద కరమయిన సన్నివేశాలతో నిండి ఉండదు. కొంత సాగినట్లుగా, మరికొంత వేగవంతంగాను కొనసాగుతుంది. కానీ.. వ్యధాభరిత హృదయాలలోని తెగిన సంగతులు గుర్తుకు వచ్చిన ప్రతీసారి కళ్ళు చెమర్చుతాయి.. గుండె గొంతులో కొట్టాడుతుంది. హిందీ చిత్రం ‘మై వాపస్ ఆవుంగా’ ద్వారా దర్శకుడు ఇంతియాజ్ అలీ స్పష్టం చేసిన ‘కథ’ కూడా ఇదే! దేశ విభజన తాలూకా గాయాలు, జ్ఞాపకాలు, ఆకాంక్షలను లోతును భావోద్వేగాలతో ఆవేదన యుతంగా అన్వేషించిన చిత్రం. కొందరి వ్యక్తుల జీవితాల్లోని వ్యధాత్మక ‘నీడలు’ ఎంతో విశాలంగా ఉంటాయి. మనిషి ముగింపు వరకు వాటి ప్రభావం ఉంటుందనే సూత్రం కథలో తొంభై అయిదు సంవత్సరాల సిక్కు పెద్ద (షా) ద్వారా వ్యక్తమవుతుంది.

కథ ఏమిటంటే?

తొంబై ఐదు సంవత్సరాల ఇషర్ సింగ్ గ్రేవాల్ (షా) పక్షావాతానికి గురై మరణశయ్యపై ఉంటాడు. పాకిస్తాన్‌కి చెందిన పంజాబ్‌లోని ఫర్నాడో ప్రాంతంలో ఉన్న తన పూర్వీకుల ఇంటికి తిరిగి వెళ్లాలని అతని ఆశ. మనవడు నిర్వైర్ (దోసాంజ్) అతనికి సంరక్షుడుగా ఉంటాడు. తన సణుగుడు మాటలకు అతడే అర్థం చెబుతుంటాడు. ఇంతకీ ఇషర్‌కు ఎందుకాకోరిక అంటే ఇదో ఫ్లాష్ బాక్. డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితంనాటి ప్రేమ కథ. 1947 భారత దేశ విభజనకు ముందు ఇషర్, జియా ప్రేమించుకుంటారు. విభజన వారి ప్రేమను చిన్నాభిన్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో నిర్వైర్ తాత గతాన్ని శోధిస్తాడు. జియా (అఫ్సానా) కుటుంబాన్ని కనుగొంటాడు. తర్వాత ఏం జరిగిం‌దనేది తెరపైన చూస్తే హృద్యంగా ఉంటుంది. మనవడి ప్రయత్నం, తాత ఆరాటం, ఆమె ఏమైంది, బతికి ఉందా? లేదా, అతను ప్రశాంతంగా కన్నుమూశాడా లేదా? ఇవే అసలైన ప్రశ్నలు..

విభజన చాటున మిగిలిన భావోద్వేగాలు..

సినిమా మొత్తంలో చాలా సున్నితమైన అంశాలున్నాయి. ఇదో అద్భుతమైన సినిమాగా మలిచాయి. దిల్జిత్ పాత్ర చెప్పే చిన్న చిన్న వ్యాఖ్యానాలు ఆలోచింపజేస్తాయి. వర్తమానంలో ప్రతి ఒక్కరూ ‘అర్థం’ చేసుకోవాలని చెబుతాయి. కథలోని ‘దేశ విభజన’ చాటున ఇంకా మిగిలి పోయిన ‘భావోద్వేగాలను’ చిత్రించిన విధానం వెనుక ఏ.ఆర్. రెహమాన్ శ్రమ, బాధ్యత వినిపిస్తాయి. తీవ్ర జాతీయ వాదంతో వస్తున్న చిత్రాల నేపథ్యంలో ఈ చిత్రం సరికొత్త ఆవిష్కరణ. ‘మై వాపస్ ఆవుంగా’ లోని ‘తొలి ప్రేమ’ తొలినాటి వెచ్చదనాన్ని, వెనక్కి తిరిగి వెళ్లి మాట నిలుపుకున్న నిజాయితీని చెబుతుంది. తప్పనిసరిగా కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం.

నటీనటుల్లో పరిణతి..

ఈషర్ గా నసిరుద్దీన్ షా పాత్రలో లీనమై నటించారు. వివిధ రకాలైన షేడ్స్ పాత్రలో ఉన్నాయి. వాటికి తన అనుభవంతో ప్రాణం పోశారు. నిర్వైర్‌గా దిల్జిత్ దోసాంజ్, యంగ్ ఇషర్ (కీను)గా వేదాంగ్ రైనా, జియా (అఫ్సానా)గా శార్వరీ, కావేరీగా బనితా సందు, అఫ్జల్, ఇక్బాల్ గ్రేవాల్, సంజయ్ సూరి, జైపీత్ సింగ్ డాలీ, యహల్య అహ్ల వాలియా తదితరులు పాత్రల పరిధి మేరకు ఎంతో పరిణితితో నటించారు. దేశ విభజన నాటి ముందు కథలోని ప్రేమ కథను ‘ఫ్రెష్’గా చిత్రించిన దర్శకుడు ఇంతియాజ్ అలీ ప్రతిభ ఎంత చెప్పుకున్నా తక్కువే.

-భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Next Story