- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు పాత్రలతో.. హృద్యమైన సినిమా
ఫాహద్ ఫాసిల్, వడివేలు నటించిన మారీశన్ సినిమా భావోద్వేగం, మానవత్వం, ఒంటరితనం, ప్రతీకారం కలగలిపిన హృద్యమైన రోడ్ ట్రిప్ డ్రామా. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రంపై విశ్లేషణ.

కొన్ని సినిమాలు వినోదాన్ని ఇస్తాయి.. కొన్ని సినిమాలు ముగిసిన తర్వాత కూడా మనసులో మిగిలిపోతాయి. అలాంటి భావోద్వేగ ప్రయాణమే ‘మారీశన్’. ఒక వృద్ధుడి ఒంటరితనం, ఓ చిన్న దొంగ మనసులో దాగిన మానవత్వం కలిసి సాగిన ఈ రోడ్ ట్రిప్ కథ.. ప్రేక్షకుడిని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ చివరికి కంటతడి పెట్టిస్తుంది. వడివేలు, ఫాహద్ ఫాజిల్ నటన ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది.
సాధారణంగా పిల్లలు లేని, వయసు పైబడిన ఒక పెద్దాయన తనకు సంబంధం లేని చిన్నారులు లైంగిక దాడికి గురయితే, అతని భార్య కోరిక మేరకు అలాంటి దారుణాలకు ఒడిగట్టిన వారిని ఎలా శిక్షిస్తాడు అనే సినిమానే మారీశన్ కథ.. నెట్‌ఫ్లిక్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా చూస్తే అందులోని పాత్రలు తప్ప, నటులు కని పించరు. అందుకే ఇది థియేటర్‌లో అరుపులు వేయించే సినిమా కాదు.. ఇంటికి వెళ్లాక కూడా మనసులో మిగిలిపోయే సినిమా.
కథలో కనిపించే మానవత్వం!
సినిమా అంటే థ్రిల్లర్, ట్విస్టులు, యాక్షన్, హత్యలు ప్రధానంగా ఉంటాయి. కానీ మారీసన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనుషుల భావోద్వేగాలను చాలా సహజంగా చూపిస్తుంది. ఈ పాయింట్ పాతదే అయినా, రోడ్ ట్రిప్ కాన్సెప్టును జోడించి కొత్తదనం తీసుకొచ్చారు. అందుకే ఒక సాధారణ రోడ్ మూవీలా ప్రారంభమై, చివరికి భావోద్వేగ థ్రిల్లర్‌గా మారుతుంది. మొదటి పది నిమిషాల్లోనే దర్శకుడు ప్రేక్షకుడిని కథలోకి లాగేస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన చిన్నపాటి దొంగ దయాలన్ (ఫహాద్ ఫాసిల్) జీవితం, ఓ వృద్ధుడు వేలాయుధం (వడివేలు) జీవితంతో అనుకోకుండా కలుస్తుంది. ఇక్కడి నుంచే సినిమా అసలు ప్రయాణం మొదలవుతుంది. అల్జీమర్స్‌తో బాధపడుతున్నట్టు కనిపించే వృద్ధుడిని చూసి మొదట డబ్బు కోసం దగ్గరైన దయా, క్రమంగా అతనితో ఒక అను బంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే “డబ్బు కోసం మొదలైన ప్రయాణం.. చివరికి మనసును తాకే బంధంగా మారుతుంది.” ఈ భావనను దర్శకుడు బలంగా నిర్మించాడు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మన ఇంట్లో ఉన్న పెద్దలను గుర్తు చేస్తాయి.
నటుల సహజ నటనతో..
పాత్ర ఏదైనా, దానిలో జీవించడం ఫహాద్ ఫాసిల్ ప్రత్యేకత. ఈ సినిమాలో కూడా ఒక చిన్నపాటి దొంగ పాత్రను చాలా సహజంగా చేశాడు. ఎక్కడా హీరోయిజం చూపించకుండా, నిజ జీవితంలో ఉండే వ్యక్తిలా కనిపించాడు. ముఖ్యంగా వడివేలుతో అతనికి వచ్చే సంభాషణలు సినిమాకి హైలైట్. ఒకవైపు డబ్బు కోసం ఆలోచించే మనసు, మరోవైపు ఆ వృద్ధుడిపై పెరుగుతున్న అనురాగం ఈ రెండింటి మధ్య ఫహాద్ చూపించిన భావాలు అద్భుతంగా ఉంటాయి. ఇక వడివేలు అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు. కానీ మారీసన్ చూస్తే ఆయనలోని గొప్ప నటుడు కనిపిస్తాడు. అల్జీమర్స్‌తో బాధపడుతున్న వ్యక్తిగా ఆయన చూపించిన అమాయకత్వం చాలా సహజంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కళ్లలో కనిపించే బాధ మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా తన గతాన్ని గుర్తు చేసుకునే సన్నివేశాల్లో ప్రేక్షకుడు కూడా భావోద్వేగానికి లోనవుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వడివేలు ఈ సినిమాలో నవ్వించలేదు, కానీ ప్రేక్షకుడి హృదయాన్ని తాకాడనిపిస్తుంది.
కథ నెమ్మదిగా సాగినా..
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఇది కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. కానీ అదే సినిమా బలం. దర్శకుడు పాత్రలను, వారి మనస్తత్వాన్ని బలంగా నిర్మించడానికి సమయం తీసుకున్నాడు. రోడ్ జర్నీ నేపథ్యంలో వచ్చే గ్రామీణ దృశ్యాలు, మధ్య మధ్యలో వచ్చే చిన్న హాస్య సన్నివేశాలు సినిమాకు సహజత్వాన్ని తెచ్చాయి. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఒక్కసారిగా మరో మోడ్‌లోకి వెళుతుంది. అక్కడి నుంచి కథలో మిస్టరీ, హత్యలు, గతం, ప్రతీకారం వంటి అంశాలు ప్రవేశిస్తాయి. అయితే రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు కొంచెం సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఇక కెమెరామెన్ గ్రామీణ ప్రాంతాలను చాలా అందంగా చూపించాడు. సినిమా చూస్తుంటే ప్రేక్షకుడు కూడా ఆ ప్రయాణంలో ఉన్నట్టే అనిపి స్తుంది. ఇప్పటి కాలంలో ఎక్కువ సినిమాలు వేగంగా సాగుతూ, వెంటనే ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ మారీషన్ మాత్రం ఓపికగా కథ చెబుతుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ మంచి కథలు, నటన, భావోద్వేగాలకు విలువిచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మనుషుల మధ్య బంధం, బాధ, మానసిక స్థితి, ఒంటరితనం వంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన చిత్రం ఇది.
సమీక్షకులు
-స్వర్ణ
96664 58088






