- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరుపులు తగ్గిన.. మా ఇంటి బంగారం
సమంత స్వీయ నిర్మాణంలో, నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' సినిమా ఎలా ఉంది? కథ, కథనం, సమంత నటన, సాంకేతిక విభాగం, బలాలు–బలహీనతలపై పూర్తి సమీక్ష..

కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు గత దశాబ్ద కాలంలో చాలా తక్కువగానే విడుదల అయినాయి. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రం 'మా ఇంటి బంగారం.' కొంత విరామం తరువాత ప్రముఖ నటి సమంత స్వీయ నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రమిది. ఇది సంపూర్ణ కుటుంబ కథా చిత్రం. ఇంటిల్లిపాది ఇబ్బంది పడకుండా చూడతగ్గ క్లీన్ చిత్రం. నిర్మాణ విలువలు 'చిత్రానికి 'తగిన విధంగా ఉన్నాయి. అయితే కథనం, పాత్రలు వంటి కొన్ని అంశాలు ప్రేక్షకులను నిరాశకు లోను చేస్తాయి.. ఓ కుటుంబ కథకు కావలసిన అంశాలన్ని చిత్రంలో ఉన్నాయి. ఇది పూర్తిగా సమంత చిత్రం. ప్రతీ సన్నివేశంలోను ఆమె నటన సంపూర్ణంగా ఆవిష్కరించారు దర్శకులు.. తనదైన నటన, హావభావాలతో స్వర్ణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి శత శాతం న్యాయం చేసారనే చెప్పాలి.
కథ ఏమిటంటే..?
చిన్నతనంలోనే అమ్మ, నాన్నలను పోగుట్టుకున్న అనాధ స్వర్ణ (సమంత ). అనాధ ఆశ్రమంలో పెరుగుతుంది. పెద్దింటి అబ్బాయి అనిరుధ్(దిగంత్ మంచాలే)ను ఇష్టపడి వివాహం చేసుకుంటుంది. ఇది ఇష్టం లేని అతని కుటుంబం వారిని దూరం పెడుతుంది. ఇందుకు విచారించినా స్వర్ణ అతడిని తిరిగి ఆ కుటుంబానికి దగ్గర చేయాలనీ అనుకుంటుంది. ఇంతలో వారింట్లో ఓ శుభకార్యం జరుగుతుందని తెలుసుకున్న ఆమె ఇది కలసివచ్చిన అంశంగా భావించి, తొలిసారిగా అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. వారి ఆచారాలు, అలవాట్లు తెలుసుకొని, నేర్చుకొని వారిచేత 'మా ఇంటి బంగారం ' అనిపించుకోవాలని ఆశ పడుతుంది. ఈ ఆశకు అడుగడుగునా కరుణ (గుల్సన్ దేవయ్య )అడ్డుగా వస్తాడు. అతడెవరు ఆమెను ఎందుకు కోరుకుంటున్నాడు.. ఆమె గతమేమిటి ఆమె ఆశయం నెరవేరిందా? అత్తవారింట్లో ఆమె కాళికగా ఎందుకు మారింది, ఎవరికోసం అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాలి.
ఎలా ఉంది..
ఓ కుటుంబ కథకు కావలిసిన అంశాలన్ని చిత్రంలో ఉన్నాయి. సమంత నటన చిత్రానికి సంపూర్ణమైన బలం. సినిమా ప్రారంభం అదుర్స్ అనే విధంగా ఉంటుంది. ప్రధమార్ధం ఆసక్తికరంగా సాగుతుంది. విశ్రాంతి తరువాత 'మెరుపులు' తగ్గిపోయాయనిపిస్తుంది. కథ ఎత్తుగడ బాగుంది. ఒక దశ దాటిన తరువాత పాత్రలు, కథనం దారి తప్పినట్టుగా ప్రేక్షకులు ఫీలవుతారు. స్వర్ణ గతమేమిటి, అది అత్తవారింట్లో తెలిస్తే ఏమవుతుందో అనేవి కొన్ని ట్విస్టులు.. వాటిని దాటి ఆమె ఎలా బయటపడిందనేది ఆసక్తికరం. స్వర్ణ, ఆమె స్నేహితురాలు చేసిన సందడి నవ్వులు పూయిస్తాయి. ఆ పాత్రలలోని అమాయకత్వం, యాక్షన్‌లను దర్శకురాలు బాగానే చిత్రీక రించారు. అయితే స్వర్ణ తన గతాన్ని బయటపెట్టే సన్నివేశాలలో పెద్దగా డ్రామా లేక తేలిపోయినట్టుగా ఉన్నాయి. ఇంటర్వెల్ తరువాత చిత్రం సాదాగా వెళుతుంది. మెరుపులు ఏమి లేవు. కరుణ పాత్రలో క్రూరత్వ ప్రదర్శనకు చూపే కారణాలు బల హీనంగా ఉన్నాయి అనిపిస్తుంది. సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతం. వెన్నెల కిషోర్ చివర్లో కురిపించిన నవ్వులు చిత్రానికి కొసమెరుపులు..
నటీనటులు, సాంకేతిక విభాగం...
ఇది పూర్తిగా సమంత చిత్రం. ప్రతీ సన్నివేశంలోనూ ఆమె నటన సంపూర్ణంగా ఆవిష్కరించారు దర్శకులు.. తనదైన నటన, హావభావాలతో స్వర్ణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి శత శాతం న్యాయం చేసారు. దేవయ్య, దిగంత్, శ్రీముఖి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు పాత్రల పరిధిలో బాగా చేశారు. చిత్రానికి సంగీతం సమాకూర్చిన సంతోష్ నారాయణ్ పెళ్లి పాటతో పాటు, నేపథ్య సంగీతం చక్కగా అందించారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ప్రతీ దృశ్యాన్ని ఎంతో నీట్‌గా చిత్రించారు. రాజ్ నిడుమోరు కథ బాగుంది. కథనం మరింత క్రీస్పీగా మలచుకొని వుంటే చిత్రం వేరే లెవెల్‌లో ఉండేది. నందినిరెడ్డి దర్శకత్వానికి శతశాతం మార్కులు ఇవ్వాలి.
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395






