లాస్ ఏంజిల్స్‌.. సంక్షోభానికి కారణాలు

by Ravi |   (  Updated:2025-06-13 00:45:20  IST  )

లాస్ ఏంజిల్స్, హాలీవుడ్ గ్లామర్‌కు, సాంస్కృతిక శోభకు పేరుగాంచిన మహా నగరం. 2025 జూన్‌లో చెలరేగిన అడవి మంటలు

లాస్ ఏంజిల్స్‌.. సంక్షోభానికి కారణాలు
X

లాస్ ఏంజిల్స్, హాలీవుడ్ గ్లామర్‌కు, సాంస్కృతిక శోభకు పేరుగాంచిన మహా నగరం. 2025 జూన్‌లో చెలరేగిన అడవి మంటలు, సామాజిక అశాంతి, రాజకీయ ఉద్రిక్తతలతో ఈ మహానగరం సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల అరెస్టులకు ఆదేశాలు జారీ చేయడంతో నిరసనలు తీవ్ర రూపం దాల్చి సైనిక చర్యల వరకు పరిణామాలు వికటించాయి.

రాష్ట్ర గవర్నర్ నిర్ణయం లేకుండా ఫెడరల్ సైనిక దళాలు రాష్ట్రంలోకి ప్రవేశించి నేరుగా సైనిక చర్యలు తీసుకోవటం అమెరికా సంయుక్త రాష్ట్రాల హక్కులకు భంగకరం, రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తున్నారు. ఇది అరుదైన సంఘటన.

వాతావరణం మారడంతో..

ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌ను వణికిస్తున్న ప్రధాన సమస్య 2025 ప్రారంభంలో సంభవించిన పాలిసేడ్స్, ఈటన్ అడవి మంటలు.. ఈ మంటలు 12,000కి పైగా నిర్మాణాలను ధ్వంసం చేశాయి. కనీసం 29 మంది ప్రాణాలు పోయాయి. దీర్ఘకాలంగా కొనసాగిన పొడి వాతావరణం, వాతావరణ మార్పులు ఈ మంటలకు ఆజ్యం పోశాయి. జనవరి చివరి వరకు గణనీయమైన వర్షం లేకపోవడం, గాలులు కూడా మంటల వ్యాప్తికి దోహదపడ్డాయి. శాస్త్ర వేత్తలు దీనిని "వాతావరణ ఊగిసలాట"గా అభివర్ణించారు. అంటే వేడెక్కుతున్న వాతావరణంలో తడి నుండి పొడి పరిస్థితులకు వేగంగా మారడం. ఈ విపత్తు బీమా నష్టాలు బిలియన్ల డాలర్లకు చేరవచ్చని అంచనా, కాలిఫోర్నియా ఆస్తి బీమా మార్కెట్‌ను ఇది మరింత ఒత్తిడిలోకి నెట్టింది.

పర్యావరణ, సామాజిక అశాంతి

ఈ పర్యావరణ విపత్తుతో పాటు, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా వచ్చిన తర్వాత ఫెడరల్ ప్రభుత్వ చర్యల వల్ల ఈ ప్రాంతంలో సామాజిక, రాజకీయ అశాంతి తలెత్తింది. 2025 జూన్‌లో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో " అక్రమ వలసదారులను" లక్ష్యంగా చేసుకొని కఠినమైన వరుస దాడులు జరిగాయి. అందుకు వ్యతి రేకంగా శాంతియుతంగా నిరసనలు పెరిగాయి. ఈ ఆందోళనా కారులను అణచివేసేందుకు 4,000 నేషనల్ గార్డ్ సైనికులు, 700 మెరైన్స్‌ను లాస్ ఏంజిల్స్‌కు పంపారు. ఈ దాడుల్లో వేలాది మంది అరెస్టయ్యారు. ఫలితంగా నిరసనలు మరింతగా ఉద్ధృతం మయ్యాయి. నిరసనకారులు హైవేలను అడ్డుకున్నారు. వాహనాలను తగలబెట్టారు. రక్షణ అధికారుల నుండి భాష్పవాయువు, మిరియాల స్ప్రేతో ఎదుర్కొన్నారు.

ట్రంప్ వ్యవహారశైలిని తప్పుబడుతూ..

కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ జాతీయ సైనిక దళాల మోహరింపును "చట్ట విరుద్ధం, అనైతికం" అని ఖండించారు. ఫెడరల్ ప్రభుత్వంపై దావా వేయనున్నట్లు ప్రకటించారు. శాంతి యుతంగా ఆందోళనలు జరుపుతున్న వారిని అరెస్టు చేయడం, టియర్ గ్యాస్ బుల్లెట్స్ ఉపయోగించించటం, గవర్నర్ అనుమతి లేకుండా ఫెడరల్ రిజర్వ్ సైనిక బలగాలు దించటం.. వంటి ట్రంప్ చర్యలను తప్పుబడుతున్నట్టు లాస్ ఏంజెల్స్ నగర మేయర్ కరెన్ బాస్ పేర్కొన్నారు. ఇది రాష్ట్ర -ఫెడరల్ మధ్య విభేదాలను బయట పెట్టింది. ఈ అశాంతి వలస విధానాలు, అసమానత, సంస్థలపై అపనమ్మకం వంటి సమస్యలను ప్రతిబింబిస్తోంది. మరోవైపు ట్రంప్ తిరుగుబాటును అణచి వేసే చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. విదేశీ శత్రువులు లాస్‌ ఏంజెల్స్‌ను ఆక్రమించుకోవడాన్ని అనుమతించబోనని, నగరానికి స్వేచ్ఛను ప్రసా దిస్తానని పేర్కొన్నారు.

ఆందోళనా ఉధృతి ఎందుకంటే?

ఈ ఆందోళనలకు ప్రధాన కారణం ఫెడరల్ రక్షణ దళాలు చేస్తున్న అరెస్టులు.. రోజుకు దాదాపు 2 వేల మందిని అరెస్టు చేస్తున్నారు. అయితే వారి లక్ష్యం రోజుకు 3 వేల మందిని అరెస్టు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు మెక్సికన్ జెండాలు పట్టుకొని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ సంక్షోభం వెనుక కారణాలు బహుముఖం.. అడవి మంటలకు దీర్ఘకాల కరువు, భూమి నిర్వహణ లోపాలు, మంటలను అరికట్టడానికి తక్కువ నీటి ఒత్తిడి వంటి సాంఘిక, మానవ కారణాలు ఉన్నాయి. లాస్ ఏంజిల్స్‌లో నిరాశ్రయుల సమస్య, పోలీసింగ్‌పై చర్చలు ఈ అసంతృప్తిని మరింత రాజుకొనేలా చేస్తు న్నాయి. అయితే లాస్ ఏంజిల్స్ పర్యావరణ విపత్తు, సామాజిక అశాంతితో అల్లాడుతున్న ఈ సమయంలో అమెరికా, అంతర్జాతీయ మీడియా దీని స్థాయి తీవ్రతను చూపినప్పటికీ, మూల కారణంపై దృష్టి పెడుతున్నాయి. వాతావరణ నరమేధం, సామాజిక న్యాయం, రాజకీయ వేర్పాటును పరిష్కరించే విశ్లేషణాత్మక చర్చ అవసరం. ఇవి మాత్రమే లాస్ ఏంజిల్స్‌లో నిజమైన మార్పును తీసుకురాగలవు.

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story