మీరు ఉనికి కోల్పోకుండా ఉండాలా? ఇలా చేయండి!

by Ravi |   (  Updated:2025-04-04 05:02:18  IST  )

భారతదేశం అనేక జీవరాశులకు ప్రకృతి సంప దకు నిలయం, ప్రపంచంలో ఎక్కడా లభించని విభిన్నమైన ఔషధ

మీరు ఉనికి కోల్పోకుండా ఉండాలా? ఇలా చేయండి!
X

భారతదేశం అనేక జీవరాశులకు ప్రకృతి సంపదకు నిలయం, ప్రపంచంలో ఎక్కడా లభించని విభిన్నమైన ఔషధ మొక్కలు, జీవరాసులు భారతదేశంలో మాత్రమే లభిస్తాయి. ఆయుర్వేదానికి మరో రూపమే భారతదేశం, కానీ మనిషిలో పెరుగుతున్నా అత్యాశకు ప్రకృతి బలవుతుంది. రోజు రోజుకు క్లిష్టంగా మారుతున్న వాతావరణం, ప్రజల అవసరాలకు భూమి ఎంత అవసరమో, ప్రకృతి అంతే అవసరం, ప్రజలు భవిష్యత్తు తరాలకు కావలసిన వనరులను సంరక్షించాలి అనే ఆలోచనలు మానేసి స్వలాభం కోసమే ఎక్కడికక్కడ చెట్లను నరుకుతున్నారు. మనిషి జీవితకాలం వందేళ్లు అనేది ఒకప్పటి మాట, నేడు మనిషి చేస్తున్న ప్రకృతి విధ్వంసానికి మనిషి జీవనకాలం అరవైకి పడిపోయింది. ఈ ప్రకృతి విలయం ఇలానే కొనసాగిస్తే జీవించే ప్రతి ఒక్కరు బతకాలంటే ఆక్సిజన్ సిలిండర్లను మోసుకుంటూ తిరగాల్సి వస్తుంది. పెంచాల్సిన అడవులను తగ్గించేస్తునారు, తగ్గించాల్సిన కాలుష్యాన్ని పెంచేస్తూ మనిషి తన ఉనికిని తను కోల్పోయే స్థితిలోకి వస్తున్నాడు. మొక్క, మహావృక్షంగా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మహావృక్షాలుగా మారి వందల సంవత్సరాలు బతికి, మనుషులకు కావలసిన ప్రాణ వాయువును ఎండ, వర్షాల నుంచి కాపాడుతూ వస్తుంది. అలాంటి మహావృక్షాలను క్షణాలలో నేలకొరిగిస్తున్నారు. చెట్ల శాతం తగ్గడం వలన గాలిలో తేమ శాతం పడిపోయి ఎండలు విపరీతంగా వస్తున్నాయి, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రతి కాలం ఎండాకాలమే అవుతుంది. ఇప్పటికే సకాలంలో వర్షాలు పడడం లేదు. మనిషి బతకడానికి కావలసిన ఆహారం, పీల్చే గాలి మీద అనేక ప్రభావాలు పడుతూ, లభించే ఆహారంలో నాణ్యత లేకుండా పోయింది, పీల్చే గాలి సైతం కలుషితంగా మారింది. భారతదేశానికి, ప్రజ లకు నష్టం కలిగించే అంశాలు ఎలాంటివి ఉన్నా ప్రభుత్వాలు అనుమతులను ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఆలోచించి, ప్రవర్తించినప్పుడే ప్రకృతిని కాపాడటానికి అవకాశం ఉంటుంది. ప్రతి పౌరుడు బాధ్యతతో మెలగాలి. బాధ్యతను విస్మరిస్తే వినాశనమే.

డాక్టర్. వై. సంజీవ కుమార్,

93936 13555

Next Story