- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమ సంఘాలకు మద్దతిద్దాం!
ఒక లక్ష్య సాధనలో ఒకే విధమైన ఆలోచనలు పంచుకునే వ్యక్తుల సమూహం చేసే వ్యవస్థీకృత ప్రయత్నమే ఉద్యమం. తమ న్యాయపరమైన హక్కుల

ఒక లక్ష్య సాధనలో ఒకే విధమైన ఆలోచనలు పంచుకునే వ్యక్తుల సమూహం చేసే వ్యవస్థీకృత ప్రయత్నమే ఉద్యమం. తమ న్యాయపరమైన హక్కుల కోసం ఆయా వర్గాలు, సమూహాలు చేసే సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, సహాయ నిరాకరణ, విధుల బహిష్కరణ మొదలైనవన్నీ అహింసా మార్గంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగే ఉద్యమ స్వరూపాలే.. అయితే ఉద్యమం చేయగానే లక్ష్యం సాధించబడుతుందా? ఫలితం కలుగుతుందా? అంటే అది ఉద్యమ లక్ష్యానికి ఉండే ప్రాధాన్యత, ఉద్యమ సమూహ బల ప్రదర్శన, ఉద్యమ తీవ్రత అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కొన్నిసార్లు ప్రభుత్వ చర్యల వల్ల, ఆయా వర్గాల నాయకుల స్వార్థం వల్ల ఉద్యమ లక్ష్యం దెబ్బతినవచ్చు. అలాగే ఆ ఉద్యమం పట్ల సమూహాలకు సంబంధించిన వ్యక్తుల అలసత్వం, ఉదాసీనత ఉద్యమాన్ని వ్యక్తిగత స్వార్థంతో కాకుండా తమ వర్గ సామూహిక ప్రయోజనాల కోసం, హక్కుల కోసం పోరాటం చేసే ఉద్యమ నాయకుల చిత్తశుద్ధి వల్ల ఉద్యమాలు నిలుస్తాయి.
ఇది ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు!
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పొందే జీతాలు, ఉద్యోగ విరమణ చేసిన వారు పొందే పెన్షన్, ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు కానీ పాలకుల దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావు. అది వారి పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలు.. నెల రోజులు చేసిన పనికి ప్రతిఫలంగా తర్వాత నెల మొదటి రోజున జీతం పొందడం ఉద్యోగ హక్కు. ఏ కారణంగానైనా ప్రభుత్వం ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతం పెన్షన్ అందించలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ఒకటో తారీఖున ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు అందకపోవడం అందరికీ అనుభవమే. మాకు ఇంకేమీ సమ స్యలు లేవు ఒకటో తేదీన జీతాలు ఇప్పించండి మహాప్రభో! అదే సమస్య అని పాలకులను వేడుకొనే పరిస్థితి దాపురించింది.
కొన్ని సంఘాలు ఒక్కటై..
అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తి పోరాటం చేయాల్సిన కొన్ని సంఘాల నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాలు కోసం పాలకుల పంచన చేరి భజన చేయడం, దాని పరిణామం మొదలైన విషయాలు ఉద్యోగ ఉపాధ్యాయులకు విదితమే. అయినా ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించలేకపోయారు. దాని కారణం వారిలో ఉండే ఉదా సీనత, అలసత్వం. అటువంటి పరిస్థితుల నడుమ ఉద్యమ స్వభావం, నేపథ్యం గల ఎస్టీయూతో పాటు అటువంటి స్వభావం గల సోదర సంఘ నాయకులు ఒక్కటై గత ప్రభుత్వాన్ని నిలదీశారు. పీఆర్సీ లోపాలను వేలెత్తి చూపుతూ నిరసన తెలిపారు. తత్ఫలితంగా వారు అక్రమ కేసులు ఎదుర్కొంటూ నేటికి కోర్టులకు హాజరవ్వడం విచారకరం. ఇటీవలే వజ్రోత్సవ సంబరాలు జరుపుకున్న ఎస్టీయూ సంఘ ప్రస్థానంలో అనేక ఉద్యమాలు చేపట్టింది. రెండు రూపాయల డీఏ కోసం పోరాడిన చరిత్ర గల సంఘం ఇటీవల వరంగల్ నడిబొడ్డున నూతన పెన్షన్ రద్దు కోసం చేసిన ఉద్యమం వీటికి నిదర్శనాలు.
పోరాటం, ఫలితం అందరిదీ కావాలి!
ప్రతి ఉద్యోగికి అన్ని సౌకర్యాలు కావాలి. ఆర్థిక ప్రయోజనాలు పొందాలి కానీ ఉద్యమంలో పాల్గొనరు. ఎవరో ఉద్యమిస్తే తాము ఫలితం పొందాలనుకుంటారు. సంఘానికి సభ్యత్వం ఇస్తే చాలు తమ పని అయిపోయింది అనుకుంటారు. తమ బదులు నాయకులే ఉద్యమం చేయాలని అందుకే సభ్యత్వం ఇస్తున్నామని భావనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండడం విచారకరం. కేవలం నాయకులే ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమ తీవ్రత ప్రభుత్వానికి ఎలా చేరుతుందో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయ కులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమం చేయకుండా తమ సమూహ సమస్యలు సాధనకై చిత్తశుద్ధితో అంకితభావంతో నిజాయితీగా ఉద్యమించాలి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని గ్రహించాలి. అంతే కానీ కేవలం వాట్సాప్‌లలో మెసేజ్ చూసు కుంటూ ప్రభుత్వాన్ని సంఘ నాయకులు విమ ర్శిస్తే లాభం లేదు. ఉద్యమ సంఘానికి నాయకులకు అండగా నిలవాలి. నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్న కొన్ని సంఘాలు, నాయకు లు మన కోసమే ఉన్నారని గ్రహించి అటువంటి సంఘాలకు చేయూతనివ్వాలి. వాటి బలోపేతం చేయాలి. పోరాటం అందరిదీ ఫలితం కూడా అందరిదీ కావాలి. ఆ దిశగా మేధావి వర్గమైన ఉపాధ్యాయులందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ..
సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS
90006 74747






