అగ్నికి అలసత్వమే ఆజ్యం!

by Ravi |   (  Updated:2026-06-07 00:30:45  IST  )

ఢిల్లీలో జరిగిన ఘోర హోటల్ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, భవన భద్రతా ప్రమాణాల వైఫల్యం, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించాల్సిన అవసరంపై విశ్లేషణ.

అగ్నికి అలసత్వమే ఆజ్యం!
X

ఢిల్లీలో ఒక హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించి, 21 మంది ప్రాణాలు కోల్పోవడం, మరికొంత మంది తీవ్ర గాయాలు పాలవ్వడం శోచనీయం. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏవైనా, ఇంత స్థాయిలో ప్రాణ నష్టం జరగడం, అదీ దేశ రాజధాని నడిబొడ్డున జరగడం ఆక్షేపణీయం. అధికార గణం అవసరమైన నిబంధనల్ని వాణిజ్య సముదాయాలు పాటించేలా చూడకపోవడం వల్లనే ఇలా మాటిమాటికీ ప్రమాదా లు, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి నేరం లో అధికభాగం వాటా వారిదే. ఆ 21 మందిలో విదేశీ‌యులు కూడా ఉన్నట్లు, వారు చికిత్స నిమిత్తమై వచ్చినట్లు వార్తలు చెబుతున్నాయి. భారత్‌లో నాణ్య మైన వైద్యం చవకగా దొరుకుతుందని ఆశించి వచ్చిన వాళ్లు ఇలా అగ్నికి ఆహుతి కావడం మాటల్లో చెప్పలేని విషాదం. సదరు హోటల్‌కి రాకపోకలకు ఒకటే దారి. ప్రవేశమైనా, బయటకుపోవడమైనా ఆ ఒక్క ద్వారమే గతి అని వార్త. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఎలాంటి అనుమతులూ లేకుండా నడుస్తున్నట్లు అధికారులిప్పుడు చెప్తున్నారు. మరి రొటీన్‌గా వారు ఇన్నాళ్లు చేసిన పని ఏమిటి? ఫైర్ సేఫ్టీ ఏ స్థాయిలో ఉందో, అతిక్రమణలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం ఈ అంతర్జాల యుగంలో, దేశ రాజధానిలో అంత కష్టమా? తెలిసిన తర్వాతనైనా చర్యలు తీసుకోవాలి కదా! ఆ మధ్య ఢిల్లీలో ఫైర్ సేఫ్టీకి అనుగుణంగా లేని భవనాలు వేల సంఖ్యలో ఉన్నాయని అధికారిక వార్త ఒకటి వచ్చింది. తర్వాత వాటిపై ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టిందీ తెలీదు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తిస్తామని అధికారులు అంటున్నారు. ఈ వేడి ఎన్ని రోజులో తెలీదు.. ఏతావాతా తేలిందేమిటంటే దుర్ఘట‌నలు జరుగుతుంటాయి, కొన్ని రోజులు వార్తల్లో ఉంటాయి.. కానీ భాద్యులు మాత్రం వాటినుండి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఈ ధోరణి దేశ వ్యాప్తం. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థలం. పోయే ప్రాణాలే మారుతుంటాయి. మిగతాదంతా సేమ్. మనిషి ప్రాణానికి విలువ నిచ్చి, సంఘటనల తర్వాతైనా పాఠాలు నేర్చుకొంటేనే సమాజానికి మేలు.

-డా.డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story