- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైలా మజ్నూ నుంచి మలయ్ సినిమా పితామహుడి వరకు.. దర్శకుడు బి.ఎస్. రాజ్‌హన్సు ప్రయాణం
హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తాం, తెలుగు సినిమా రంగాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాం... సినిమా హబ్‌గా మారుస్తాం లాంటి మాటలు అనేక సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం.

హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తాం, తెలుగు సినిమా రంగాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాం... సినిమా హబ్‌గా మారుస్తాం లాంటి మాటలు అనేక సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. కానీ జరిగింది తక్కువ. కానీ ఎప్పుడో దశాబ్దాల క్రితమే పంజాబీ సిక్కు దర్శకుడు బి.ఎస్. రాజ్‌హన్సు భారతదేశానికి ఆవల ‘మలయ్’ భాషా సినిమాకు పునాదులు వేశాడు.
నిజానికి దక్షిణాసియా సినీ చరిత్రలో వివిధ భాషా సినిమాల నడుమ ఒక సేతువుగా నిలిచాడు. మన భారతీయ సినీ రంగ చరిత్రలో అనేక మంది దర్శకులు ఉన్నారు. కానీ మన దేశ సరిహద్దులను దాటి, విదేశీ సంస్కృతుల్లో కలిసిపోయి కొత్త సినీ మార్గాలు చూపినవారు చాలా అరుదు. అటువంటి వారిలో బల్బీర్ సింగ్ రాజ్‌హన్సు ప్రధానమయిన వాడు.
అరబ్ ప్రేమకథను చూపిస్తూ..
బల్బీర్ సింగ్ రాజ్‌హన్సు యువకుడిగా ఉన్నప్పుడే ఆయనకు నాటకం, సంగీతం, సినిమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. భారతదేశ సినిమా రంగంలో పెద్దగా పేరు లేక పోయినా, మొదట ఆయన సృజనాత్మక దృష్టి, సాంకేతిక పరిజ్ఞానం సింగపూర్ నిర్మాత రాయ్ బహదూర్ సేథ్ హుర్దత్‌రాయ్ మోతీలాల్ చమ్రియా దృష్టిని ఆకర్షించింది. 1930ల ప్రారంభంలో చమ్రియా, అరబ్ ప్రేమకథ ‘లైలా మజ్నూ’ ఆధారంగా తీసిన హిందీ సినిమాను సింగపూర్‌లో ప్రదర్శించారు. ఆ సినిమా విజయం చూసిన అతనికి అదే కథను మలయా భాషలో తీసే ఆలోచన వచ్చింది. ఆ బాధ్యతను రాయ్ బహదూర్ సేథ్ హుర్దత్‌రాయ్ మోతీలాల్ చమ్రియా బి.ఎస్. రాజ్‌హన్సుకు అప్పగించారు. రాజ్‌హన్సు రాంగూన్ నుండి సింగపూర్‌కు వచ్చి 1933లో సినిమా పనిని ప్రారంభించారు. ఈయన ఈ సినిమాను మలయా ప్రేక్షకుల ఆసక్తికి తగ్గట్టు సినిమా రూపొందాలని ఆలోచన చేశాడు. కథలోని అరబ్ నేపథ్యాన్ని కాపాడాలి. అదే ప్రధాన లక్ష్యం అయింది. అప్పుడు స్థానిక రాజ కుటుంబాలకు చెందిన నాటక, సంగీత రంగాల్లోని ప్రతిభావంతులను నటులుగా ఎంపిక చేశారు. సింగపూర్‌లోనే చిత్రీకరించిన ఈ సినిమాకు అరబ్ ఈజిప్షియన్ సంగీతం, నృత్యాలను జోడించి విశిష్టమైన సాంస్కృతిక సమ్మేళనాన్ని సినిమాలో సృష్టించారు.
లైలా మజ్నూ.. ప్రేక్షకుల నీరాజనం
1934 మార్చిలో లైలా మజ్నూ విడుదలైంది. అది సింగపూర్‌లో రూపొందిన మొట్టమొదటి మలయా భాషా టాకీ. అదొక చరిత్ర. ఆ సినిమా అల్‌హాంబ్రా సినిమా హాల్లో జరిగిన ప్రదర్శనలు హౌస్‌ఫుల్. ఈ సినిమా విజయం మలయా ద్వీపకల్పంలో సినీ సంస్కృతికి నూతన ఆరంభాన్ని ఇచ్చింది. అయితే 1940ల్లో సింగపూర్‌పై జపాన్ దురాక్రమణ జరిగినప్పుడు స్థానిక చిత్ర నిర్మాణం నిషేధించబడింది. లైలా మజ్నూ యొక్క ఏకైక కాపీ కూడా ఆ సమయంలో నాశనం అయింది. బి.ఎస్. రాజ్‌హన్సు తీస్తున్న మెనంతు దుర్హకా (అవిశ్వాసి అల్లుడు) సినిమా యుద్ధపరిణామాల వల్ల ఆగిపోయి, యుద్ధం ముగిసిన తరువాత 1946లో పూర్తయింది. ఈ చిత్రం ఆయనకు యుద్ధానంతర సినీ పునరాగమనానికి నాంది అయింది.
మలయ్ సినిమా స్వర్ణయుగం
యుద్ధం ముగిసిన తర్వాత రాజ్‌హన్సు రూపొందించిన సెరువాన్ మెర్దేకా (అంటే “స్వాతంత్ర్య పిలుపు”) మలయా, చైనీస్ నటులతో కలిసి తీసిన అరుదైన చిత్రం. ఇది జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన యువ మలయా, చైనీస్ పౌరుల గాధ. ఆ సినిమా వాణిజ్య పరంగా అంతగా ఆడకపోయినా, సింగపూర్‌లో ప్రారంభమైన ‘మలయ్ సినిమా స్వర్ణయుగం’కు ఇది ఆరంభం పలికిందనే చెప్పాలి. భారతీయ సినిమాలలాగే పాటలు, నృత్యాలు, భావోద్వేగాలతో నిండిన కథలతో ఆయన సినిమాలు రూపొందించడంతో అవన్నీ ప్రత్యేకంగా నిలిచాయి.
మలయాలో తొలి రంగుల చిత్రం..
1953లో ఆయన తీసిన బులోహ్ పెరిందు (మ్యాజిక్ ఫ్లూట్) మలయాలో వచ్చిన మొదటి రంగుల చిత్రం. పర్లిస్ ప్రాంతంలోని ప్రకృతి సహజ సౌందర్యంలో చిత్రీకరించి, గెవా కలర్ టెక్నాలజీతో తీసిన ఈ సినిమా రంగులు, వేషాలు, పాటలు, సాంప్రదాయ నృత్యాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. అప్పుడు ది సండే స్టాండర్డ్ పత్రిక బి.ఎస్. రాజ్‌హన్సును ప్రశంసిస్తూ ‘భారతదేశం విడిచి విదేశాల్లో పేరు సంపాదించాలనే అతని కల నెరవేరింది’ అని రాసింది. ఆయన తీసిన ముఖ్య సినిమాల విషయానికి వస్తే తొలి మలయ్ భాషా టాకీ లైలా మజ్నూ (1934), మెనంతు దుర్హకా (1946),సెరువాన్ మెర్దేకా, సింగపూరా ది వక్తు మలం, చింతా, బులోహ్ పెరిందు లాంటివి పేరెన్నిక గన్నాయి. రాజ్‌హన్సు విజయవంతమయిన సినిమాలు తీయడంతోపాటు కొత్త టాలెంట్‌ను కూడా అక్కడి పరిశ్రమకు పరిచయం చేశాడు. అలా కనుగొన్న ఒక తార పి.రామ్లీ.
మలయ్ సినిమా చరిత్రలో లెజెండ్
రాజ్‌హన్సు మలయా సినిమాకు ఇచ్చిన అత్యంత మధురమైన కానుక పి. రామ్లీ. 1948లో పెనాంగ్‌లో జరిగిన ఒక సంగీత పోటీలో అనామకుడయిన ఓ 19 ఏళ్ల గాయకుడు తీయుకు జకారియా బిన్ తీయుకు న్యాక్ పుతెహ్ స్వరం పాట ఆయనను ఆకట్టుకున్నాయి. అతనికి చింతా (ప్రేమ) సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు. తరువాత ఆ గాయకుడు తన పేరును తమిళ శైలిలో ‘పి. రామ్లీ’గా మార్చుకున్నాడు. 1950లో బక్తి (‘భక్తి’) చిత్రంతో రామ్లీ మలయ్ సినిమా చరిత్రలో లెజెండ్‌గా నిలిచాడు. పి. రామ్లీ సంగీతం, నటన, నృత్యాలు అన్నీ భారతీయ సినిమాల్ని ప్రతిబింబించాయి. 1955 మే 31న రాజ్‌హన్సు 52 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్‌తో మరణించారు. 1957లో మలయా స్వాతంత్ర్యం పొందినప్పుడు ఆయన లేరు. కానీ ఆయన వేసిన పునాదుల మీదే మలయ్ సినిమా అభివృద్ధి చెందింది. ఇప్పటికీ సింగపూర్, మలేషియా దేశాల్లో బి.ఎస్. రాజ్‌హన్సును “మలయ్ సినిమా పితామహుడిగా పరిగణిస్తారు గౌరవిస్తారు.
- వారాల ఆనంద్
94405 01281






