పిల్లల భాగస్వామ్యం లేని ప్రయోగశాలలు..

by Ravi |   (  Updated:2025-02-03 23:46:05  IST  )

ప్రయోగశాల పని విజ్ఞాన శాస్త్రానికి ఒక అద్భుతమైన అభ్యాసన వనరు. ఇది ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది.

పిల్లల భాగస్వామ్యం లేని ప్రయోగశాలలు..
X

ప్రయోగశాల పని విజ్ఞాన శాస్త్రానికి ఒక అద్భుతమైన అభ్యాసన వనరు. ఇది ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రయోగశాల పనికి నేటి విద్యా విధానంలో సముచిత స్థానం పాఠ్య ప్రణాళికలో ఇచ్చారు. కానీ ప్రయోగ శాల తరగతి నిర్వహణ పాఠశాల, కళాశాలల్లో అంత ఫలవంతంగా లేదనేది అందరూ బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం. సైన్స్ పాఠాలలో ఇచ్చిన ప్రయోగశాల కృత్యాలను తప్పనిసరిగా పిల్లల భాగస్వామ్యంతో నిర్వహించాలి. కానీ ఎంతరకు కృత్యాలు నిర్వహిస్తున్నారనేది ప్రశ్నార్థకం. పాఠశాల స్థాయిలో కొందరు ఉపాధ్యాయులు మాత్రమే ప్రయోగ పని విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించి మార్కులు ఇస్తున్నారు. కానీ ఈ పరిస్థితి వేళ్లపై లెక్కపెట్టవచ్చు.

సైన్స్‌కి చెందిన వివిధ భావనలు అర్థం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రయోగశాల పని ఉపయోగపడుతుంది. ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందగలుగుతారు. ఈ విధంగా పొందిన జ్ఞానం విద్యార్థుల మదిలో శాశ్వతంగా ఉండిపోతుంది. ప్రయోగశాల పని ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో పరిశీలన, వర్గీకరణ, విశ్లేషణ, నమోదు చేయడం, అన్వయించడం, సాదారణికరణ, వ్యక్తీకరణ మొదలైన నైపుణ్యాలు పెంపొందించగలరు.

ప్రయోగశాల పని వలన..

విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా వివిధ విజ్ఞాన శాస్త్ర విషయాలపై కుతూహలం పెంచుకుని, వాటిని తెలుసుకుని భవిష్యత్తుకు విజ్ఞాన బాటలు వేసుకుంటారు. విద్యార్థులు మిగతా విద్యార్థులతో కలిసి జట్టుగా ప్రయోగశాలలో పనిచేయడం వల్ల సహకార భావం, జట్టుభావం, ఉత్సాహం, కొంత స్వేచ్చానుభూతి పొందుతారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని, పెంపొందించుకోవడమే కాకుండా వివిధ విషయాలను తెలుసుకోవడంలోనూ, సమస్య పరిష్కారం చేయడంలోనూ శాస్త్రీయ పద్ధతిని వినియోగించుకోగలుతారు. ప్రయోగశాల పని వలన విద్యార్థులలో నిజాయితీ, ఐకమత్యం, చొరవ, వారిమీద వారికి నమ్మకం, ఇతరుల మీద ఆధారపడకపోవడం లాంటి అనేక సుగుణాలు అభివృద్ధి చెందుతాయి.

అంతేకాక ప్రయోగశాల పని జ్ఞానాత్మక సామర్ధ్యాలు, ప్రక్రియ సామర్ధ్యాలు, శాస్త్రీయ వైఖరులు, విజ్ఞానశాస్త్రం పట్ల అవగాహన అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రయోగశాల పనికి నేటి విద్యావిధానంలో సముచిత స్థానం ఇచ్చా రు. కానీ ప్రయోగశాల తరగతి నిర్వహణ పాఠశాల, కళాశాలల్లో అంత ఫలవంతంగా లేదు. ఆర్థిక సమస్యల వల్ల ప్రయోగశాల వనరులను సమకూర్చుకోలేకపోతున్నాం అనేది పాఠశాల యాజమాన్యాల వాదన. ఒక వేళ ప్రయోగ పరికరాలు ఉన్న ఉపాధ్యాయుల నిరాసక్తత వలన ప్రయోగ సామాగ్రి ఒక గది మూలాన లేదా అల్మరాలో దుమ్ము పట్టి ఉండి నాపై ఉన్న దుమ్ము దులపండి అని ఎదురుచూస్తూ ఉంటా యి. అధికారులు పర్యవేక్షణకు వచ్చిన సమయంలో ప్రయోగశాలను ఉపయోగించే విధానం తెలిసినా ఉదాసీనత చూపిస్తున్నారనేది ఒక ఆక్షేపణ.

ప్రయోగశాల నైపుణ్యాలు నేర్చుకుంటే..

ఇంటర్మీడియట్ స్థాయిలో చాలా కళాశాలల్లో ప్రయోగ తరగతులకు (జంతు శాస్త్రం , వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) కేటాయించే పీరియడ్లు పేపర్ పై మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగశాల తరగతులు, వాటిపై నిర్వహించే వార్షిక పరీక్షలు, మార్కులు వేసే విధానం గురించి ప్రతి సంవత్సరం ఆరోపణలు వస్తుంటాయి. వాటిపై సంబంధిత ప్రభుత్వ విభాగం తీసుకునే దిద్దుబాటు చర్యలు చీకటిలో వేసిన బాణాలలా ఉంటాయనేది మేధావుల విశ్లేషణని దినపత్రికలు చదివితే అర్థమవుతుంది. అన్ని తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావంతులు వారి బాధ్యతను విస్మరించి మార్కులు వస్తే చాలు అనే ధోరణి.. భవిష్యత్తుకు అంతమంచిది కాదని గుర్తెరగాలి. ప్రయోగశాల తరగతుల వలన విద్యార్థులకు ప్రయోగ, పరిశోధన నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీని ఫలితంగా భవిష్యత్తులో వచ్చే సమస్యలను సహకార ధోరణితో శాస్త్రీయ దృక్పథంతో పరిష్కరించుకుంటారు. పాఠశాల, కళాశాలలో ప్రయోగశాల నైపుణ్యాలు నేర్చుకుంటే తరువాత విద్యార్థులు మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ కోర్సులలో సులువుగా ప్రయోగశాల విధానానికి అలవాటుపడుతారు. కాబట్టి ప్రయోగశాల తరగతుల నిర్వహణ, వాటి పరీక్షలు, మార్కులు ఇచ్చే విధానం అందరి మన్ననలు పొందేలా భవిష్యత్ సమాజం ఎదుగుదలకు సహాయపడేలా ఉండాలని ఆకాంక్షిద్దాం.

" ప్రయోగశాల అనేది అనుభవానికి కేంద్రబిందువు. ఇది విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు నిజ జీవిత పరిస్థితుల్లో విజ్ఞానం, పరిశోధనను పరీక్షించడానికి అవకాశం కల్పిస్తుంది." అని అల్బర్ట్ ఐన్‌స్టైన్ అభిప్రాయ పడ్డారు. కాబట్టి అన్ని కళాశాలలు, పాఠశాలలు పకడ్బందీగా ప్రయోగశాల తరగతులు నిర్వహించేలా ప్రభుత్వ విభాగాలు నడుం బిగించాలని ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం.

మహేశ్వరం భాగ్యలక్ష్మీ,

అసిస్టెంట్ ప్రొఫెసర్

95056 18252

Next Story