ఆత్మగౌరవానికి ప్రతీక.. లేబర్ అడ్డాలు..

by Ravi |   (  Updated:2026-05-12 01:00:10  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ‘లేబర్ అడ్డాలు’ అనే వినూత్న కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత కార్మికులకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఆధునిక సదుపాయాల కల్పనపై విశ్లేషణ.

ఆత్మగౌరవానికి ప్రతీక.. లేబర్ అడ్డాలు..
X

లేబర్ అడ్డాలు (కార్మిక కూడళ్లు) కేవలం పనికోసం వేచిచూసే ప్రదేశాలు కావు, అవి శ్రమజీవుల ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి ప్రతీకలు. కార్మికుల కష్టజీవుల చెమట, కండరాల నుండి చైతన్యం వస్తుందని, భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందు కు లేబర్ అడ్డాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 80 లక్షల మంది అసంఘటిత కార్మికుల సమస్యలకు పరిష్కార మార్గంగా, వారిని గౌరవప్రదమైన జీవనం వైపు నడిపించే కేంద్రాలుగా ఈ అడ్డాలు మారబోతున్నాయి.

ఎవరికీ తలవంచకుండా, సొంత శ్రమతో వచ్చిన డబ్బుతో కుటుంబాలను పోషించుకునే కార్మికుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈ అడ్డాలు నిలుస్తాయి. అంతేకాదు కూలీల్లో స్వాభిమానం పెరగడంతో పాటు వారికి తగినంత స్వేచ్ఛ కూడా లభిస్తుంది.

అడ్డా కూలీల బతుకులు నిత్యం పోరాటమే..

అట్టడుగు వర్గాల కార్మికులు, కూలీలు ఒకచోట చేరినప్పుడు వారి సమస్యలను చర్చించుకుంటూ, సమాజంలో ఒకరికొకరు మద్దతుగా నిలవడంతో పాటు సామాజిక చైతన్యానికి ఈ లేబర్ అడ్డాలు ఎంతగానో దోహదపడతాయి. కూటమి ప్రభుత్వం కార్మికుల ఆత్మగౌ రవాన్ని కాపాడేందుకు లేబర్ అడ్డాల వద్ద ఆధునిక వసతులు, విశ్రాంతి గదులు కల్పించాలని నిర్ణయించడం వారి గౌరవాన్ని పెంచడమే కాదు. అడ్డా కూలీలకు అవి ఆధునిక ఆశ్రయాలు అనడంలో సందేహం లేదు. అడ్డ కూలీల బతుకులు నిత్యం పోరాటంతో కూడుకునేవి. రోజు వారీ కూలిపై ఆధారపడి ఉదయాన్నే పని కోసం ఎదురుచూస్తూ, పనులు దొరకకపోతే పస్తులుండే పరిస్ధితులు వారి జీవితంలో సాధారణంగా ఉండేవి.

నరకయాతనకు పుల్ స్టాఫ్ పెట్టాలనే..

తెల్లవారు జామునుంచే పట్టణాలలోని అడ్డాల వద్ద వేలాది మంది కార్మికులు కూలి పనుల కోసం పడిగాపులు కాసేవారు. తెల్ల చొక్కా వేసుకుని బైక్ పై, కారుపై వచ్చిన వ్యక్తుల వద్దకు వందలాది కూలీలు పరుగున వచ్చి సార్ పని ఉందా.. సార్ పని ఉందా.. ఏదైనా చేస్తాం, వస్తాం మీ వద్దకు అంటూ బతిమిలాడుకుని పనికి వెళ్లే పరిస్ధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా గమనించారు. శ్రమ కోసం పాకులాడే పనిలోనే శ్రామికుడు నిమగ్నమైనప్పుడు మూడు పూటల తిండి కోసం తాను పడుతున్న నరకయాతనకు పుల్ స్టాఫ్ పెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో మెదిలింది. నిరుపేద కుటుంబాలు మనుషులుగా తల ఎత్తుకుని బతికినప్పుడే కదా అభివృద్ధి అని ఆయన భావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ కూలీలకు ఏదో ఒక ప్రయోజనం చేకూర్చి వారిలో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన ప్రారంభించింది.

అడ్డాలు కాదు.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు..

ఆ ప్రణాళికకు అనుగుణంగా భవన నిర్మాణ కార్మికులు పనుల కోసం రోజూ ఉదయం రోడ్లపక్కన ఇకవేచి చూసే పని లేకుండా కూటమి ప్రభుత్వం లేబర్ అడ్డాలు(చౌక్ లు)కు శ్రీకారం చుట్టింది. మేడే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాజిల్లా పమిడి ముక్కలో ఈ లేబర్ అడ్డాను లాంఛనంగా ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 15 నగరాల్లో ఈ అడ్డాలను నిర్మిస్తున్నారు. కేవలం ఇవి అడ్డాలే కాదు రాబోయే రోజుల్లో వీటిని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మార్చనున్నారు. స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులిస్తారు. తద్వారా వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి స్కిల్డ్ లేబర్‌గా తయారు చేస్తారు. ఇప్పటికే నైపుణ్యం ఉన్న వారికి కూడా మరింత శిక్షణ ఇచ్చి హైపవర్ స్కిల్డ్ లేబర్‌గా గుర్తిస్తారు. తద్వారా కార్మికుల సంక్షేమం, జీవితాలను సమూలంగా మార్చాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. అంతేకాకుండా ఆత్యాధునిక పని ముట్లతో పాటు ఈఎస్ఐ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తారు.

ప్రయోగాత్మకంగా లేబర్ అడ్డాలు..

ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనలకనుగుణంగా పదిహేను నగరాల్లో ప్రయోగాత్మకంగా లేబర్ అడ్డాలను అభివృద్ధి చేస్తారు.. కార్మికుల సేవలు అవసరమైన ప్రజలు నేరుగా లేబర్ చౌక్‌కు వెళ్ళి సంప్రదించొచ్చు. అంతేకాకుండా కార్మికులకు పక్కా చిరునామా, వీరందరి కోసం తగిన సదుపాయాలతో ప్రత్యేక భవనాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అందుకు సంబంధించి స్ధల సేకరణ కూడా జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు వీరంతా ప్రధాన కూడళ్లలో రోజు ఉదయమే చేరి అక్కడి నుంచి పనులకు వెళ్తుంటారు. ఈ 15 నగరాల్లో ఏర్పాటు కానున్న లేబర్ అడ్డాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 15 లక్షలు చొప్పున ఖర్చు చేస్తారు. వీటిలో తాగునీటి సదుపాయం, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, వంద నుంచి రెండు వందల మంది కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు.

కార్మికుల జీవితాల్లో వెలుగు క్రాంతులు..

వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి మరిన్ని ప్రైవేట్ కంపెనీలు రానున్నాయి. ఆయా కంపెనీల నిర్మాణాలు సాగేప్పుడు వారికి నైపుణ్యం ఉన్న కార్మికులు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న కార్మికులను పెంచడం ద్వారా పెట్టుబడి దారులు వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోకుండా స్ధానికులకు ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆ దిశగా అడుగు లు వేయడం వల్ల కార్మికులకు మేలు జరుగుతుందని, రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు లేబర్ అడ్డాలకు శ్రీకారం చుట్టారు.. అలాంటి శ్రమజీవుల గౌరవాన్ని, హక్కులను కాపాడటమే నిజమైన అభివృద్ధి. కూటమి ప్రభుత్వం చేపట్టిన సరికొత్త ప్రయోగం లేబర్ అడ్డాలు విజయవంతమై కార్మికుల జీవితాల్లో వెలుగు క్రాంతులు ప్రసరించాలని ఆశిద్దాం.

-వాసంశెట్టి సుభాష్

కార్మికశాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Next Story