- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కథా కదంబం’.. సమకాలీన జీవన విలువలను పలికించిన కథల సమాహారం
భావనాప్రియ సాహితీ వేదిక ప్రచురించిన తొలి కథా సంకలనం ‘కథా కదంబం’ లోని 16 కథలు మానవ సంబంధాలు, పర్యావరణం, కుటుంబ విలువలు, స్త్రీ సాధికారత, సామాజిక బాధ్యత వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరిస్తాయి.

నాడు సాహితీ సంస్థలు నేడు సాహిత్య వాట్సాప్ సమూహాలు, కాలానుగుణంగా వచ్చిన మార్పులతో తెలుగు సాహిత్యంలో వచ్చిన వైజ్ఞానిక విజ్ఞానాత్మక ప్రగతి. వాట్సాప్, ఫేస్బుక్ అనే ఆధునిక మాధ్యమాల సాయంగా భావాలు కలిసిన వారు, కలుపుకోవాలి అనుకున్న వారు, అందరూ వారి వారి సెల్ ఫోన్లతో జతగూడి సాహితీ అభివృద్ధికి సంఘటిత కృషి చేస్తున్నారు.
అందులో భాగంగానే ఖమ్మం యువ కవయిత్రి పాలపర్తి హవీలా స్థాపించిన "భావనాప్రియ సాహితీ వేదిక". లబ్ద ప్రతిష్టులైన ఎన్,సి, హెచ్, చక్రవర్తి, డాక్టర్ బట్టు విజయ్ కుమార్ వంటి సాహితీవేత్తల సారధ్యంలో వేదిక దినదిన ప్రవర్ధమానమై నవవసంతాలుగా అక్షర కృషి సాగిస్తూ... ఎల్లలు లేని సాహితీ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంది.
ప్రచారాలకు దూరంగా పనులకు దగ్గరగా
సాహిత్య సేవలో భాగంగా ఔత్సాహికులకు తెలుగు భాషా రచనా మమకారం పెంచడం, పద్య రచనల్లోని మర్మాలు చెప్పడం, అవధానాలు నిర్వహించటం, వివిధ ప్రక్రియలో పుస్తకాలు ప్రచురించుకోవడం, తదితర కార్యక్రమాలతో "ప్రచారాలకు దూరంగా పనులకు దగ్గరగా" ఉంటూ అంకిత భావపు సాహితీ కృషి చేస్తున్న నేటి కాలపు మేటి సాహితీ వేదిక భావనాప్రియ, తన సప్తమ వార్షికోత్సవం సందర్భంగా సభ్యుల కథా సృజనతో ప్రచురించిన తొలి కథా సంకలనం "కథా కదంబం".
కథా ప్రక్రియకు నిండుదనం..
ఎన్.సి.హెచ్ చక్రవర్తి సంపాదకత్వంలో వెలువడిన ఈ కదంబంలో మొత్తం 16 కథలు ఉన్నాయి, కథలన్నీ మానవ సంబంధాలు, ప్రకృతి, పర్యావరణాల సమ్మేళనంగా సాగి పాఠకులను నూతన కథా లోకంలో విహరింపజేస్తాయి. "రాలిన కొమ్మ" మొదలు "రాములమ్మ నవ్వింది" వరకు సాగిన ఈ కథావళిలోని కథలు అన్నీ వర్తమాన రచయితలవి కాకపోయినా కథా రచనల పరంగా కొత్తవారివే. కథలు నిరాడంబరంగా అనవసరపు వర్ణనలు లేకుండా కథా వస్తువు కేంద్రంగానే కథలను నడిపిస్తూ కథాకథనాలు సమతుల్యంగా సాగాయి, ఎత్తుగడలు లేకపోయినా ఆసక్తికరమైన ముగింపులు కలిగిన ఈ కథలు తెలుగు కథా ప్రక్రియకు నిండుదనంగా నిలిచాయి.
సామెతల ఆమెత..
తెలుగు సాహితీ శోభకే సొంతమైన సామెతల సాయంతో కథ ఆసాంతం సాగిన వినూత్న కథ డాక్టర్ చెంగల్వల పద్మజ రాసిన "సామెతల ఆమెత", సెలవులకు తాతా బామ్మ ఇంటికి పల్లెటూరు వచ్చిన నందు అనే పిల్లాడు వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో గడిపిన వారం రోజుల్లో ఏమి తెలుసుకున్నాడు? అప్పటి ఇప్పటి మనుషుల జీవన విధానంలో వచ్చిన మార్పులు ఏమిటి? తెలియాలి అంటే ఈ కథ విధిగా చదివి తీరాలి. జనారణ్యంగా మారిన నేటి పట్టణాల్లో కాంక్రీట్ వనాల లాంటి భవనాల మధ్య మనిషికి ప్రాణాధారమైన పచ్చని చెట్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది, మనిషి స్వార్థం సాక్షిగా సాగుతున్న "వృక్షాల ఊచకోత" వల్ల రాబోయే పర్యావరణ ప్రమాదం గురించి సుతి మెత్తని హెచ్చరికగా సాగిన కథలు, రాలిన కొమ్మ, దిద్దుబాటు.
గుండెను పిండే 'రాలిన కొమ్మ'
మనిషికి చెట్టుకు గల పవిత్ర సంబంధాన్ని స్వార్థ గుణం ఎలా బలహీన పరుస్తుందో కరుణరసాత్మకంగా చెబుతూ... చక్రవర్తి కలం నుంచి వెలువడిన "రాలిన కొమ్మ" కథ ముగింపు మనసున్న ప్రతి మనిషిని గుండె పిండి ఆలోచింపజేస్తుంది. జనారణ్యపు అపార్ట్మెంట్ దగ్గర గల పెద్ద చెట్టును కాలనీ పురుష సభ్యులు తొందరపాటు ఏకపక్ష చర్యతో నరికించి వేయడం, తదనంతరం కాలనీ మహిళల ద్వారా చెట్టు లేమి వల్ల కలిగిన నష్టం తెలుసుకొని పశ్చాత్తాప పడటం, మగవారు తాము చేసిన తప్పును ఎలా సరి చేసుకున్నారో తెలుసుకోవాలి అంటే వి .నాగజ్యోతి వ్రాసిన "దిద్దుబాటు" కథ వివరంగా చదివి తీరాల్సిందే!!
కనువిప్పు కలిగించే కారుణ్య కథ
తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను పిల్లలు నెరవేర్చిన నాడు వారికి కలిగే ఆనందం ఎలా ఉంటుందో పిల్లలు మాట తప్పి జీవితం దారి తప్పి చేజారి పోయినప్పుడు అంతే ఆగ్రహం కడుపుకోతతో కలిసి వస్తాయి ఈ విషయాన్ని పిల్లలకు తల్లిదండ్రులకు కలిపి కనువిప్పు కలిగించే తీరులో కరుణ రసాత్మకంగా చెప్పిన కథ డాక్టర్ బట్టు విజయ్ కుమార్ గారి "చితికిన ఆశ" నేటితరం పిల్లలు అమ్మా నాన్నలు అంతా విధిగా చదవాల్సిన కథ ఇది. మనిషి ప్రవర్తనకు కారణం అప్పటి జీవన స్థితిగతులే "మనుషులు ఎవరు మంచి గానూ చెడ్డగాను పుట్టరు పరిస్థితులను బట్టి తయారు అవుతారు" అన్న జీవన సత్యాన్ని చాటి హృద్యంగా చిరు హాస్య గుళికలు కలిసిన మందహాసపు సంభాషణలతో సాగి "మార్పు మనిషికి అనివార్యం" అనే విలువైన సందేశం పంచిన చక్కని కథ విద్యాసాగర్ వ్రాసిన "రాములమ్మ నవ్వింది"
స్త్రీకి స్ఫూర్తినిచ్చే "ఒంటెద్దు బండి"
అమలిన శృంగార శైలిలో హృదయాన్ని తాకే సంఘటనల నేపథ్యంలో సాగిన "ప్రేమంటే" కథను కర్రి రాధాకృష్ణ చక్కని శైలిలో ఆకర్షణీయంగా అక్షరీకరించారు. ఒంటరి మహిళలు సమాజంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వివరించిన ఆదర్శ ప్రేమ కథ ఆర్. నవజీవన్ రెడ్డి రాసిన "ఒంటెద్దు బండి" ప్రతి స్త్రీ మూర్తికి స్ఫూర్తిని నింపే కథ ఇది. ఈ కధంబంలోని ప్రతి కథ ఒక ఆణిముత్యమై అలరారుతుంది అనడంలో అతిశయం లేదు.
పుస్తకం: కథా కదంబం (కథా సంకలనం),
సంపాదకులు: ఎన్.సి.హెచ్. చక్రవర్తి,
పేజీలు:96, వెల:120/-,
ప్రతులకు: బట్టు విజయ్ కుమార్,
95055 20097
సమీక్షకులు
-డా: అమ్మిన శ్రీనివాసరాజు,
77298 83223






