- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్వకుంట్ల కవిత సూచనలు శాస్త్రీయమైనవి, ఆలోచింపజేసేవి, ఆచరణీయమైనవి.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రియ తనయ, ఎమ్మెల్సీ కవిత అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతం కావడం పెద్ద

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రియ తనయ, ఎమ్మెల్సీ కవిత అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతం కావడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆ లేఖాస్త్రంలో సంధించిన ప్రశ్నలు మాత్రం కండ్లలో కలకలాంటివి. నిజానికి ఇవి బాధ కలిగించినా, కంటిలోని మలినాలను తొలగించి కళ్లు శుభ్రం చేస్తాయి. కవిత తండ్రికి ప్రేమతో రాసిన లేఖలో ఉన్న ప్రశ్నలు కూడా దరిదాపుగా అలాంటివే. తండ్రి మీద ప్రేమతో డియర్ డాడీ! అని సంబోధిస్తూనే అనుకూల, ప్రతికూల అంశాలను లోతుగా తడమడంలో వెనకాడలేదు.
ఇటీవల ఆ పార్టీ రజతోత్సవం వేదిక మీద పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగం పైనే తన ఫోకస్ పెట్టారు. నాణానికి బొమ్మ, బొరుసు ఎలాగో నాయకత్వానికి అనుకూల, అననుకూల అం శాలేమిటో కూడా తేల్చి చెప్పడం భేషుగ్గా ఉన్నది. ప్రాంతీయ పార్టీలలో అధినాయకత్వానికి ఇలా చెప్పే స్వేచ్ఛ చాలా తక్కు వగా ఉంటుంది. పార్టీ అధ్యక్షుడి కూతురైనందువల్ల ఈ సాహసం చేయగలిగారు.. ఇది మరెవరి వల్లా అయ్యే పని కాదే మో? తమ పార్టీ లుకలుకలతో కుప్పకూలి పోకూడదనే రాజ కీయ పరిణితితో కవిత ఈ విధంగా లేఖ రాసినట్టు అర్థం అవుతుంది.
ప్రజాస్వామ్యం కొరవడిందంటూ..
ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంత ప్రమాదకర పరిస్థితులు లేకపోయినా, అంతర్గత ప్రజాస్వామ్యం అయితే లేదనే విషయాన్ని చర్చకు తెచ్చారు. అధినాయకుడు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, మామూలు నాయకులను కూడా కలవకపోవడం, ఎన్నికల సందర్భంగా, బహిరంగ సభ సమయంలో మాత్రమే ప్రజల్లోకి రావడం, పాత కాపులకే మళ్లీ అధికారాలు కట్టబెట్టడం, వారిపై ఉన్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకపోవడం సరైనది కాదన్నది కవిత చేసిన సూచనలలో ప్రధానమైనది. గత ఎన్నికల సమయంలో సిట్టింగులకే బీఫామ్‌లు ఇవ్వడంతో తీవ్ర వ్యతిరేకత ఉన్న స్థానాలు కోల్పోవలసి వచ్చింది. ఈ కారణంగా అధికారమే కోల్పోవలసి వచ్చింది. కొత్త నాయకత్వం పార్టీకి అందకుండా పోయింది. నిరంతరం పాతా కొత్త కలయికలతోనే ముందుకు సాగడం వల్ల సుదీర్ఘకాలం పార్టీని అధికార అందలం వైపు నడపడం, నిలబెట్టడం సాధ్యమవుతుంది. విపరీతమైన జన సమీకరణ చేసి కూడా కొన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలి పెట్టడం వల్ల ప్రజలలోకి సరైన సందేశం వెళ్లలేదని కవిత గుర్తు చేశారు.
ఇలాగే కొనసాగితే భవిష్యత్ కష్టమంటూ..
దళితులకు రిజర్వేషన్లు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై, బీసీ కోటా పెంపు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం సరికాదనే భావనను కవిత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ని దునుమాడిన చోట, కేంద్రంలోని బీజేపీపై సరైన విమర్శలు చేయకపోవడం తప్పుడు సంకేతాలు ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఇది బలాన్ని ఇచ్చిందని నొక్కి వక్కాణించారు. సరైన రాజకీయ వైఖరి ప్రకటించని కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగోలా నెట్టుకొచ్చినా, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ పూర్తిగా చతికిలపడి పోయిందన్నది నిష్టుర సత్యం. వీటిలో వేటినీ సరి చేసుకోకుండా ఇలాగే కొనసాగితే భవి ష్యత్తు ఎన్నికలు కూడా ఇబ్బందులు కలిగిస్తాయి అన్నారు. రాబోయే కాలంలో ఎన్నికలను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని తేల్చి చెప్పారు. పార్టీ మొత్తం తానై నడుపుతున్న కేసీఆర్, ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఫోకస్ చేయకపోవడం వల్ల, ప్రత్యర్థి రాజకీయ పార్టీల తీరును ఎండ కట్టడంలో విఫలమవుతామన్న ఆమె సలహా పాటించదగ్గదే కాదు, అమలు చేయవలసింది కూడా.
సభ విజయవంతమైనప్పటికీ..
పార్టీ అధ్యక్షుడి ప్రసంగంపై విమర్శలకే పరిమితం కాకుండా ప్రసంగంలోని గొప్పతనాన్ని కూడా కవిత హుందాగా వివరించారు. కగార్ వ్యతిరేక నినాదం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని మెప్పించే ప్రయత్నం, పహెల్గాం ఘటనపై మౌనం, రాష్ట్ర ప్రభుత్వ నేత పేరు రాకుండా మాట్లాడటం భేషుగ్గా ఉందని మెచ్చుకున్నారు. అయితే కేసీఆర్ ప్రసంగంలో ఉండే ఛలోక్తులు, వ్యంగ్యాలు, ప్రత్యర్థులపై వేసే చురకలు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సభ ఘనంగా జరగడం, భారీగా జనం తరలి రావడం చూస్తుంటే పార్టీకి జనంలో ఉన్న ఆదరణ ఇంకా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతుందని వివరించారు. అయితే శాసనమండలి సభ్యురాలిగా ఇంతటి వివరణతో కూడిన లేఖ రాయడం కానీ, సూచనలు చేయడం కానీ ఒక ప్రాంతీయ పార్టీలో సాధ్యం కాదు. కూతు రుగా అయితేనేమి, ఒక మహిళగా ఆ పార్టీలో డైనమిక్ లీడర్‌గా ఫోకస్ కావడం వల్ల తను ఈ సూచన చేయగలిగి ఉండవచ్చు. పార్టీ అధిష్టానానికి ఆత్మ విమర్శ చేసుకునే అవకాశాన్ని గుర్తు చేశారు..
ఆమె సలహాలు పాటించదగ్గవే!
పార్టీని విజయపథంలో నడపాలంటే, అధికార అందలం చేజిక్కించుకోవాలంటే అధ్యక్షుడు నాయకత్వానికి, కార్యకర్తలకూ ఎప్పటికప్పుడు తగు సలహాలు ఇస్తూ, అప్రమత్తులను చేస్తూ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. పార్టీ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, సరైన శిక్షణలతోనే ఇది సాధ్యం. అందుకుగాను క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నిర్మాణాలను బలోపేతం చేసుకోగలగాలి. గతంలో తాము చేసిన ప్రజోపయోగమైన పనులను ప్రజలకు నిరంతరం గుర్తు చేస్తుండాలి. ప్రత్యర్థుల బలహీనతలను, తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టగలగాలి. ప్రత్యర్థి రాజకీయ పార్టీలను, వైఖరులను, పాలన లోపాలను వివరిస్తూ బలహీనపరచగల యం త్రాంగాన్ని తయారు చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ బలోపేతానికైనా పనికివచ్చే, ఉపయోగపడే అంశాలివి. ఈ విషయాలన్నింటినీ కవిత చాలా సున్నితంగా తట్టి చూపారు. కేసీఆర్‌ని తన తండ్రి గానే కాక, పార్టీ అధ్యక్షులుగా భావించి ఆమె చేసిన సూచనలు శాస్త్రీయమైనవి. ఆలోచింపదగినవి. ఆచరించదగినవి.
- రమణా చారి
99898 63039






