- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ వ్యధను కవిత్వంలా మార్చిన కవి
సాహిత్యంలో, తెలంగాణ ఉద్యమంలో, సామాజిక స్పృహలో చిరస్మరణీయుడైన మహనీయుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

సాహిత్యంలో, తెలంగాణ ఉద్యమంలో, సామాజిక స్పృహలో చిరస్మరణీయుడైన మహనీయుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అంటూ కలంతో గలమెత్తిన ప్రజాకవి. కవిత్వం కేవలం కవి హృదయపు ఆవేదనే కాక ప్రజల గొంతుకగా ఎలా మారుతుందో ఆయన జీవితం నిరూపించింది. కవిత్వాన్ని ఆయుధంగా మార్చి, అసమానతలపై గొంతెత్తిన ధీరుడు.
తెలంగాణ వ్యధను కవిత్వంలా మార్చి
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని దేశభక్తిని ప్రజల్లో నింపి, వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. అయినా స్వాతంత్య్రంకై, పేదల సమానత్వం కోసం, న్యాయం కోసం నిరంతరం కృషి చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలను కవిత్వంగా ప్రపంచానికి వినిపించారు. బడి పలుకుల భాష కాదు పలుకు బడుల భాష కావాలంటూ ప్రజా భాషను కోరి సరళమైన భాషలో, ప్రజలకు అర్థమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా ఆయన రచనలు సాగించారు. అందుకే ఆయనను ‘ప్రజాకవి’, ‘తెలంగాణ గుండె చప్పుడు’గా గౌరవిస్తారు.
సరళ భాషకు పట్టం కట్టి..
వరంగల్ జిల్లాలో 1914, సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీకి చిన్ననాటి నుంచే కవిత్వం పట్ల ఆసక్తి పెరిగింది. ఆనాటి నిజాం పాలన, సామాజిక అసమానతలు, అణచివేత ఆయన కవిత్వానికి ఊపిరి పోశాయి. నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇదీ నా గొడవ, పేరుగాంచిన రచనలు.. ఆయన సరళమైన భాషలో గొప్ప భావాలను పలికించారు. ‘అన్యాయం జరిగితే సహించొద్దు, ఎదురించాలి’ అనేదే ఆయన కవిత్వం ప్రధాన సందేశం. 'నా గొడవ' సంపుటాలు ఆయన జీవన పోరాటాల చరిత్రకు, ప్రజల వ్యథలకు అద్దం పట్టాయి.
అక్షరంతో మనిషి విముక్తి..
ప్రజల హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం జరిగిన పోరాటాల్లో ముందుండి తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన గళం ఎత్తారు. జైలుకు వెళ్లినా, ఆయనలో పోరాట స్ఫూర్తి తగ్గలేదు. ‘అక్షరం మనిషిని బానిసగా ఉంచడానికి కాదు, విముక్తి చేయడానికి’ అనే నమ్మకంతో బతికారు. ప్రాంతీయ అసమానతలపై, ప్రజల దుస్థితిపై పదేపదే రచనలు చేశారు.
ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా!
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా అంటూ సూటిగా తెలుగు మాట్లాడేందుకు ఇష్టపడని వారికి చురకలు అంటించారు. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగాను పనిచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయగా, భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో భారత ప్రభుత్వం కాళోజీని సత్కరించింది.కాళోజీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ భాషా దినోత్సవం'గా నిర్వహిస్తోంది. ఆయన ఆదర్శాలను స్వీకరించి అన్యాయాన్ని ప్రశ్నించే గుణం ఉన్నంతవరకు కాళోజీ మన మధ్య జీవిస్తూనే ఉంటారు. ఉపాధ్యాయులు, కళాకారులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, పాలకులు ఆయన మార్గాన్ని అనుసరించి ప్రతి మనిషిలో ఉన్న మానవత్వాన్ని మేల్కొలిపి సమానత్వం కోసం ముందడుగు వేయాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి.
(నేడు ప్రజాకవి కాళోజీ జయంతి)
-దుప్పటి మొగిలి
84668 27118






