Kadaisi Vivasayi: మాయమవుతున్న మట్టి వాసన.. మనిషి అస్తిత్వానికి ఒక ప్రశ్న!

by Ravi |   (  Updated:2026-04-11 01:06:48  IST  )

అభివృద్ధి పేరుతో మనం మర్చిపోతున్న మట్టి మూలాలను కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుత చిత్రం ‘కడైసి వివసాయి’. ఎనభై ఏళ్ల రైతు మాయాండి జీవన పోరాటం, వ్యవస్థల నిర్లక్ష్యం, మనిషికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించే ఈ సినిమాపై విశ్లేషణ.

Kadaisi Vivasayi: మాయమవుతున్న మట్టి వాసన.. మనిషి అస్తిత్వానికి ఒక ప్రశ్న!
X

వర్తమాన కాలంలో అభివృద్ధి అనే పదం గొప్పగా వినిపిస్తుంది. కానీ ఆ అభివృద్ధి అడుగుల కింద ఏం నలిగిపోతోందో మనం ప్రశ్నించుకునే సమయం లేనంతగా వేగంలో పడి కొట్టుకుపోతున్నాం. ఎం.మణికందన్ తెరకెక్కించిన ‘కడైసి వివసాయి’ లో కథ కంటే జీవితం ఎక్కువ. కథనం కంటే అనుభూతి ఎక్కువ.

నిజానికి భారతీయ గ్రామీణ భారత జీవన నిర్మాణంలో రైతుది కేవలం వృత్తి కాదు. అది ఒక సంస్కృతి, అది ఆత్మ. కానీ మారుతున్న కాలంలో కొద్దీ వ్యవసాయం మెల్లగా మాయమవుతూ, నగరీకరణ దాని స్థానాన్ని ఆక్రమి స్తోంది. ఈ మార్పులని ద్రుశ్యీకరించిన మౌన చిత్రమే కడైసి వివసాయి.

కథేంటంటే..

ఉసిలంపట్టికి సమీపంలోని ఓ గ్రామంలో ఎనభై ఏళ్ల వయసులోనూ భూమిని వదలని రైతు మాయాండి. అతనిది సాదా సీదా జీవితం, అతనికి మాటలు తక్కువ, భావాలు లోతైనవి. ఆ ఊర్లో మిగిలిన చివరి రైతు అతను. అందుకే కుల దేవాలయోత్సవానికి తొలి గింజను సమర్పించే బాధ్యతను తీసుకుంటాడు.. ఎందుకంటే అప్పటికే మిగతా రైతులు తమ భూములను అభివృద్ధి పేరుతో అమ్మేసి వ్యవసాయం నుంచి దూరమయి పోయివుంటారు. ఈ నేపథ్యంలో మాయాండి తన పొలంలో కొత్త పంటను వేస్తాడు, వ్యవసాయ పనులన్నింటినీ తానే స్వయంగా చేసుకుం‌టాడు. కానీ ఒక అనూహ్య సంఘటన అతని జీవితాన్ని తారుమారు చేస్తుంది. ఆయన తన పొలంలో చనిపోయిన పడివున్న మూడు నెమళ్లు కనిపించగా, వాటిని మురుగన్ దేవుని వాహనాలుగా భావించి గౌరవంగా పూడ్చిపెడతాడు. అయితే మాయండి ఆ నెమళ్లను చంపి పాతరేసాడని అపార్థం చేసుకున్న ఒక గ్రామస్తుడి సమాచారంతో పోలీసులు అతనిపై ‘జాతీయ పక్షిని చంపాడు’ అనే ఆరో పణతో కేసు నమోదు చేస్తారు.

ఇది రైతు పంట నష్టం కాదు..

గతంలో జరిగిన సంఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు నిర్దోషి అయిన మాయండిని నిందితుడిగా నిలబెడతారు.. న్యాయస్థానంలో సాక్షి వాస్తవం చెప్పినా విధాన పరమైన ఆలస్యం కారణంగా మాయాండి జైలులోనే ఉండాల్సి వస్తుంది. పోలీసుల బలహీనతలను జడ్జి పలు ప్రశ్నలతో కడిగేస్తుంది. ఈ సమయంలో మాయాండి తను పోతానంటాడు. అదెలా అని జడ్జి అడిగితే అక్కడ పొలంలో వెయ్యి ప్రాణాలున్నాయి వాటిని రక్షించాలి, నీళ్లు పోయాలి, సాకాలి కదా అంటాడు.. చలించిపోయిన న్యాయమూర్తి పోలీసు సిబ్బందిని పొలాన్ని చూసుకోవాలని ఆదేశిస్తుంది. వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల పంట నాశనం అవుతుంది. ఇది కేవలం ఒక రైతు పంట నష్టం కాదు అది మన సమాజం విలువల పతనానికి ప్రతీక.

సేద్యం.. ప్రకృతితో మనిషి అనుబంధం

సినిమాలో మాయాండి కథతో పాటు సమాంతరంగా పొరలు పొరలుగా సాగే కథలు కూడా సమాజంలోని విభిన్న అంశాల్ని మనముందు ఉంచుతాయి. మాయాండితో పాటు మరో ముఖ్య పాత్ర విజయ్ సేతుపతి పోషించిన పాత్ర రామయ్య. మరదలి ప్రేమలో విఫలమై ఆమె చనిపోయిన ప్పటికీ బతికే వుందని భావిస్తూ పిచ్చివాడైన రామయ్య దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటాడు. అనేక ప్రశ్నల్ని సంధిస్తూ ఉంటాడు. ఇక్కడే ఈ ప్రపంచంలో నిజంగా పిచ్చివాడు ఎవరు అనే ప్రశ్నను దర్శకుడు నిశ్శబ్దంగా లేవనెత్తుతాడు. అలాగే భూమిని అమ్మి ఏనుగును కొనుగోలు చేసిన రైతు తాడికొళంతై కథలో, అభివృద్ధి పేరుతో జరిగే విస్మరణను దర్శకుడు మన ముందుంచాడు. ఇంకా హైబ్రిడ్ విత్తనాలు, రసాయన ఆధారిత వ్యవసాయం, అధిక వ్యయ పద్ధతులు ఇవన్నీ చిన్న రైతును పతనపు అంచులకు తీసుకెళ్తున్న వాస్తవాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. సంప్రదాయ వ్యవసాయం కేవలం ఒక పద్ధతి కాదు. అది ప్రకృతితో మనిషి అనుబంధం. ఆ అనుబంధం కోల్పోతే, మనిషి తన మూలాన్ని కోల్పోతాడు. అన్న అంశాన్ని ప్రతిభావంతంగా చూపిస్తుంది.

మాయమవుతున్న మట్టివాసన..

ఈ సినిమాని అర్థం చేసుకునే కోణంలో ఆలోచిస్తే ఈ భూమి మీద మనిషి మొదట ఊపిరి పోసుకున్నప్పటి నుండీ అతని చేతుల్లో మట్టి వాసన ఉంది. ఆ వాసనే నాగరికతకు మొదటి శ్వాస. కానీ, కాలం గడిచేకొద్దీ అదే మట్టి మన చేతుల్లోంచి జారిపోతూ కాంక్రీట్ అడవుల్లో మాయమవుతోంది. ఈ మాయమవుతున్న మట్టి గాథను మెల్లగా, నిశ్శబ్దంగా మన ముందుంచిన సినిమా కడైసి వివసాయి. సాదాసీదాగా కనిపించినా, ఆ సాదాసీదాలోనే ఒక గొప్ప తత్వం దాగి ఉంది. మయాండికి ‘వ్యవసాయం ఒక వృత్తి కాదు.. జీవన శ్వాస’ మాయాండి మాట్లాడడు. కానీ అతని చేతులు మాట్లాడతాయి. పొలం మీద అతను వేసే ప్రతి అడుగు మనిషి ప్రకృతిల మధ్య ఉన్న నిశ్శబ్ద సంభాషణమే. ఈ చిత్రంలో సంభాషణలు తక్కువ. కానీ ప్రతి మౌనం ఒక వాక్యం. మాయాండి కోర్టులో నిలబడినప్పుడు కూడా ఆయన చెప్పేది ఒక్కటే ‘నేను నా పని చేసాను.’ ఇది ఒక డైలాగ్ కాదు. ఒక జీవిత సారాంశం.

రైతు లేకుంటే.. మనిషే అనాథ!

ఈ సినిమా ఒక ప్రశ్న వేస్తుంది ‘వ్యవస్థ మనిషిని రక్షిస్తుందా? లేక అతన్ని నొక్కేస్తుందా?’. రైతు అయిన మాయాండి మీద కేసు పడుతుంది. కానీ ఈ కాలంలో రైతు కావడం ఒక నేరంగా మారిపోయిందా?. ఇందులో మరో ప్రత్యేక పాత్ర రామయ్య అతను నవ్విస్తాడు. అతని మాటలు అర్థం లేనట్టే అనిపిస్తాయి. ‘సాధారణం అనిపించేది నిజంగా సాధారణమా?’ “విచిత్రం అనిపించేది నిజానికి సత్యమా?” రామయ్య పాత్ర ఈ చిత్రానికి ఒక అద్దం. “కడైసి వివసాయి” అంటే “చివరి రైతు. “ కడైసి వివసాయి” ఒక సినిమా కాదు. కానీ జీవితం ఉంది. ఈ సినిమా “రైతు లేకుంటే భూమి అనాథ కాదు.. మనిషే అనాథ.” అంటుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ సినిమాగా అవార్డును అందుకుందీ సినిమా.

- వారాల ఆనంద్

94405 01281

Next Story