ఐటీ హబ్‌తో ఉద్యోగ శక్తి

by Ravi |   (  Updated:2026-01-28 00:30:50  IST  )

తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దేశానికే దిశా నిర్దేశం చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా ఎదిగి రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి, అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది.

ఐటీ హబ్‌తో ఉద్యోగ శక్తి
X

తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దేశానికే దిశా నిర్దేశం చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా ఎదిగి రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి, అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ అభివృద్ధి రాజధానికే పరిమితమవడం వల్ల జిల్లాల యువతకు ఆ వెలుగు సమానంగా అందడం లేదు. ఉద్యోగాల కోసం వలస బాట పట్టడం ఇప్పటికీ తప్పని పరిస్థితిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో, ముఖ్యంగా జగిత్యాల వంటి నూతన జిల్లాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఒక ప్రాంతీయ కోరిక మాత్రమే కాదు.. ఇది తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన మౌలిక ప్రశ్న.

మనశ్శాంతిని చెరుపుతున్న కొలువులు..

జగిత్యాల జిల్లాతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి మహానగరాలకు, కొందరు విదేశాలకు కూడా వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జీతాలు వచ్చినా, అక్కడి జీవన వ్యయం, అద్దెలు, ప్రయాణ ఖర్చులు, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వారి జీవితాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చేతిలో జీతం ఉన్నా, చేతిలో నిల్వ ఉండడం లేదు. మనశ్శాంతి మరింత దూరమవుతోంది.

సొంత ఊళ్లోనే ఉద్యోగాలు..

ఇదే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తే పరిస్థితి పూర్తిగా మారుతుంది. స్థానిక యువత తమ ఊరిలోనే ఉద్యోగాలు చేసుకుంటూ వ్యవసాయం, కుటుంబ వృత్తులను కొనసాగించగలుగుతుంది. తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో కలిసి సొంత ఇంట్లోనే జీవిస్తూ ఉద్యోగం చేయగల అవకాశం కలుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి వస్తుంది. చిన్న వ్యాపారాలు, సేవారంగం విస్తరిస్తాయి. వలసలు తగ్గి సామాజిక స్థిరత్వం పెరుగుతుంది.

ప్రతి జిల్లాకు ఒక ఐటీ హబ్

ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఐటీ పార్కులు, ఐటీ హబ్‌ల విస్తరణపై ప్రకటనలు చేసింది. ఇప్పుడు ఆ మాటలను స్పష్టమైన విధానంగా మార్చాల్సిన సమయం వచ్చింది. ప్రతి జిల్లాకు కనీసం ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దశలవారీ కార్యాచరణ రూపొందిస్తే, తెలంగాణ దేశంలోనే ఒక ప్రత్యేక అభివృద్ధి మోడల్‌గా నిలుస్తుంది.

హైదరాబాద్‌పై భారం తగ్గితే

జిల్లాల్లో ఐటీ హబ్‌లు ఏర్పడితే హైదరాబాద్‌పై భారం తగ్గడమే కాకుండా, రాష్ట్రంలోని మానవ వనరుల్ని సమర్థంగా వినియోగించుకున్నట్లవుతుంది. పరిశ్రమలకు కూడా ఇది లాభదాయకమే. నగరాలతో పోలిస్తే జిల్లాల్లో భూమి, అద్దెలు, నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. స్థానికంగా నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉంటుంది. విన్–విన్ మోడల్ ఇది—యువతకు ఉపాధి, పరిశ్రమలకు వ్యయ తగ్గింపు, ప్రభుత్వానికి సమతుల్య అభివృద్ధి.

ఉద్యోగాలే జిల్లాలకు రావాలి!

ఇక ముఖ్యంగా, “ఉద్యోగాల కోసం నగరాలకు వలస” అన్న పాత ఆలోచనకు తెరదించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలే జిల్లాలకు రావాలి అన్నదే కొత్త దృష్టికోణంగా ప్రభుత్వం స్వీకరించాలి. ఐటీ హబ్‌లు కేవలం భవనాలు కాదు.. అవి జిల్లాల భవిష్యత్‌కు పునాది. నూతన జిల్లాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు ద్వారా యువత ఆశలు నిలబడతాయి, కుటుంబ వ్యవస్థ బలపడుతుంది, గ్రామీణ–పట్టణ విభేదం తగ్గుతుంది. జగిత్యాల వంటి జిల్లాలతో మొదలుపెట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించి, కాలపరిమితితో కూడిన కార్యాచరణ చేపడితే.. అది చరిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుంది. ఐటీ హబ్‌ల ద్వారా జిల్లాలకు ఉద్యోగ శక్తి.. అదే తెలంగాణకు సమతుల్య ప్రగతి.

-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,

90101 28884

Next Story