- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది అస్థిపంజరం కాదు.. మన వ్యవస్థ ప్రతిబింబం!
ఒడిశాలో జీతూ ముండా సంఘటన మన సమాజంలో మనిషి ప్రాణం కంటే కాగితాలకే ఎక్కువ విలువ ఉన్నదని చూపిస్తుంది. బ్యాంకింగ్ నిబంధనలు, గ్రామీణ సమస్యలు, మానవత్వం మధ్య ఉన్న సంఘర్షణపై ఈ విశ్లేషణ.

మనిషి పుట్టుక ఒక అద్భుతం. చావు ఒక అనివార్యం. కానీ ఈ రెండింటి మధ్య నలిగిపోయే బతుకు ఉంది చూశారా.. అది అసలైన విషాదం. ఒడిశాలోని కియోంఝార్ అడవుల నుండి వినిపించిన ఈ ఆర్తనాదం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది మన సమాజపు ఆత్మ మీద పడ్డ ఒక లోతైన గాటు..
అస్థిపంజరాన్ని భుజాన మోసుకుంటూ బ్యాంకు గడప తొక్కిన జీతూ ముండా అనే వ్యక్తి, మన కళ్ల ముందు ఒక భీకరమైన ప్రశ్నను నిలబెట్టాడు. మనిషి ప్రాణానికి ఇచ్చే విలువ కంటే, ఆ మనిషి ఉన్నాడని లేదా లేడని నిరూపించే కాగితం ముక్కకే ఈ లోకంలో విలువెక్కువ అని అతను సాక్ష్యంతో సహా నిరూపించాడు.
వ్యవస్థకు చెవులు ఉండవు..
ఈ సమస్య ఈ రోజు పుట్టింది కాదు. నాగరికత పెరుగుతున్న కొద్దీ మనం మనుషులను అంకెలుగా, ఖాతా సంఖ్యలుగా మార్చేశాం. జీతూ ముండా లాంటి అనాక్షరాస్య గిరిజనుడికి, బ్యాంకులోని ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడే భాషకు మధ్య కొన్ని వందల ఏళ్ల దూరం ఉంది. ఆవులు అమ్మి దాచుకున్న ఆ కొద్దిపాటి సొమ్ము తన చెల్లెలి ఆఖరి జ్ఞాపకం. ఆమె చనిపోయిందని అతను పదే పదే మొత్తుకున్నా, వ్యవస్థకు అది వినపడలేదు. ఎందుకంటే వ్యవస్థకు చెవులు ఉండవు, కేవలం కళ్లు మాత్రమే ఉంటాయి.. అవి కూడా కేవలం సంతకాలు, ముద్రలు మాత్రమే చూస్తాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ దృశ్యం మన ముందుకు వచ్చింది. ఒక అస్థిపంజరం భుజం మీద ఉన్న ఫోటో ఇంటర్నెట్‌ని కుదిపేసింది. ప్రతి ఒక్కరూ బ్యాంకు సిబ్బందిని తిట్టుకున్నారు. వ్యవస్థ క్రూరమైందని శాపనార్థాలు పెట్టారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటుంది. ఆ బ్యాంకు ఉద్యోగి కూడా ఒక నియమానికి బానిస..
చట్టాల్లో 'మానవత్వం' క్లాజును చేర్చాలి!
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డెత్ సర్టిఫికేట్ లేకుండా డబ్బులు ఇస్తే, రేపు అతని ఉద్యోగానికే ముప్పు రావచ్చు. ఇక్కడ తప్పు మనుషులది మాత్రమే కాదు, మనుషులను మరబొమ్మల్లా మార్చిన నిబంధనలది కూడా. ఒక గిరిజనుడికి డెత్ సర్టిఫికెట్ సంపాదించడం అనేది హిమాలయాలు ఎక్కడం కంటే కష్టమైన పని అనే స్పృహ మన పాలనా యంత్రాంగానికి ఎప్పుడు కలుగుతుందనేదే అసలు ప్రశ్న. ఈ గాయానికి మందు వేయాలంటే కేవలం సానుభూతి సరిపోదు. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ముందుగా మన బ్యాంకింగ్ చట్టాల్లో 'మానవత్వం' అనే క్లాజును చేర్చాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఉండే చిన్న చిన్న ఖాతాలకు సంబంధించి, వారసులను గుర్తించడానికి గ్రామ సర్పంచ్ సంతకమో లేక స్థానిక రెవెన్యూ అధికారి ధృవీకరణో సరిపోతాయని నిబంధనలు మార్చాలి. ప్రతి దానికీ కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిప్పడం అంటే వారిని బతకనివ్వకపోవడమే.
'సెన్సిటివిటీ ట్రైనింగ్' అత్యవసరం!
క్షేత్ర స్థాయిలో పని చేసే అధికారులకు 'సెన్సిటివిటీ ట్రైనింగ్' ఇవ్వాలి. ఒక వ్యక్తికి అక్షరం ముక్క రానప్పుడు, ఆ పత్రం ఎలా తెచ్చుకోవాలో వాళ్లే దగ్గరుండి చెప్పాలి. అవసరమైతే బ్యాంకు అధికారులే స్థానిక మండల ఆఫీసుతో సమన్వయం చేసుకుని ఆ పేదవాడికి సాయం చేసేలా ఒక మెకానిజం ఉండాలి. దీనికి పెద్ద చట్టాలు అక్కర్లేదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే చాలు.. అవసరమైతే మారుమూల గిరిజన ప్రాంతాల్లో 'మొబైల్ జస్టిస్ యూనిట్స్' ఏర్పాటు చేయాలి. కేవలం ఆధార్ కార్డులు మార్చడానికో, ఓట్లు వేయించడానికో కాకుండా.. మరణ ధృవీకరణ పత్రాలు, వారసత్వ సర్టిఫికేట్లు వంటివి అక్కడికక్కడే ఇచ్చేలా నెలకోసారి శిబిరాలు నిర్వహించాలి. అప్పుడే జీతూ ముండా లాంటి వాళ్లు సమాధులు తవ్వే పరిస్థితి రాదు.
ఆ అస్థిపంజరం వ్యవస్థలోని శూన్యం
చివరగా ఒక్క మాట. మనం చంద్రుడి మీదకు వెళ్తున్నాం, ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి. కానీ ఒక సామాన్యుడు తన సొంత డబ్బు కోసం శవాన్ని మోయాల్సి వచ్చిందంటే, ఆ వృద్ధికి అర్థం లేదు. నియమాలు మనిషిని రక్షించడానికి ఉండాలి కానీ, శిక్షించడానికి కాదు. జీతూ ముండా మోసినది ఆ అస్థిపంజరాన్ని కాదు, మన సమాజంలోని జడత్వాన్ని. లోకంలో ప్రతిదానికీ రుజువు వెతికే మనం, మనిషిలోని వేదనకు రుజువు వెతకడం మానేశాం. ఇంకైనా మనుషుల వైపు చూద్దాం. కాగితాల కంటే ప్రాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రోజు వచ్చినప్పుడే, మనం నిజమైన నాగరిక సమాజం అనిపించుకుంటాం. బహుశా ఆ రోజున జీతూ ముండా లాంటి వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు కాకుండా, భరోసా కనిపిస్తుంది.
- డాక్టర్ నంబూరి చంద్రశేఖర్
రేడియో ఫిజిసిస్ట్
93939 90399






