- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్ర మరిచిన ఝల్కారీ బాయి..
ఈ దేశ సంఘ సంస్కర్తలుగా, విప్లవ పోరాట యోధులుగా ఆధిపత్య కులాల వాళ్లే బ్రాండ్ వేసుకున్నారు. వారి చరిత్రనే మన విద్యా వ్యవస్థలో చదువుకుంటున్నాం. చరిత్ర ఎరుగని అస మాన్యులుగా ఎంతో మంది దళిత పీడిత వర్గాల నుంచి ఉన్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన గొప్ప పోరాట వీరనారి ఝల్కారీ బాయి గురించి..

ఈ దేశ సంఘ సంస్కర్తలుగా, విప్లవ పోరాట యోధులుగా ఆధిపత్య కులాల వాళ్లే బ్రాండ్ వేసుకున్నారు. వారి చరిత్రనే మన విద్యా వ్యవస్థలో చదువుకుంటున్నాం. చరిత్ర ఎరుగని అస మాన్యులుగా ఎంతో మంది దళిత పీడిత వర్గాల నుంచి ఉన్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన గొప్ప పోరాట వీరనారి ఝల్కారీ బాయి గురించి. ఆంగ్లేయులతో వీరోచిత పోరాటం చేసిన వీరవనిత ఝల్కారీ బాయి 1857 తిరుగుబాటు చరిత్రకు అందకుండా పోయింది.
చరిత్రలో కనుమరుగైన వీరనారి..
భారత ప్రథమ స్వాతంత్య్ర యుద్ధంలో తిరుగుబాటు చేసిన నేతల్లో రాణి లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియాతోపే, బహదూర్ షా జఫర్, మంగళ్ పాండే, బేగం హజ్రత్ మహల్, కున్వర్ సింగ్ వంటి కొందరు ముఖ్యులనే చరిత్రలో ప్రస్తావించారు. కానీ ఝాన్సీరాణి లక్ష్మీబాయికి తోడునీడగా నిలిచి ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసిన వీరనారి ఝల్కారీ బాయి దళిత కులానికి చెందిన కారణంగా చరిత్రలో లేకుండా పోయింది. ఆమె 1857 నాటి స్వతంత్ర సమరంలో మహిళా సైన్యంలో ఝల్కారీ బాయి కమాండర్. ఆమె ఈ సంగ్రామంలో ఝాన్సీ రాణి లక్ష్మీ బాయికి సమానంగా సాహసంగా రాణి రూపంలో బ్రిటిష్ సైనికులతో పోరాడిన వీర యోధురాలు. యుద్ధంలో, ఝల్కారీ బాయి తనను తాను రాణిగా చిత్రించుకుని, బ్రిటిష్ సైన్యాన్ని గందరగోళానికి గురి చేసి రాణి లక్ష్మీబాయికి సురక్షితంగా తప్పించుకునే అవకాశాన్ని కల్పించింది.
బాల్యం నుంచే సాహసం..
ఝల్కారీ బాయి 1830 నవంబర్ 22 బుందేల్ ఖండ్ ఝాన్సీలోని భోజలా గ్రామంలో పుట్టింది. తల్లి దనియా, తండ్రి మాల్ చంద్ కోరి కులానికి చెందినవారు. చిన్ననాడే ఝల్కారీ బాయిలో వీరత్వం, సాహసం, ధైర్యం ప్రతిధ్వనించింది. పన్నెండేండ్ల వయస్సులో అడివిలో పశువులు కాస్తున్నప్పుడు పులి పశువుల మీద పడితే వాటిని కాపాడేందుకు పులితో తలపడి చంపింది. ఈ వార్త ఝాన్సీ రాణి లక్ష్మీబాయి దాకా చేరింది. ఆమె సైన్యంలో సైనికుడిగా ఉన్న పూరన్ కుటుంబానికీ చేరింది. అట్లాంటి వీరత్వం ఉన్న అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని పూరన్ తల్లి ఇష్ట పడింది. ఝల్కారీ బాయి వివాహం సైనికుడు పూరన్‌తో జరిగింది. పూరన్ కుటుంబం ఝాన్సీ కోటకు దగ్గరగా ఉన్న ‘నయాపూరా’ బస్తీలో నివసించేది. పూరన్ సైన్యంలో చేరి కుస్తీ, కత్తిసాము, తుపాకీ, ఫిరంగులు పేల్చడం, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు.
లక్ష్మీబాయి కోరి ఎన్నుకున్న కమాండర్..
ఝల్కారీ రూపురేఖలు చూసిన ఝాన్సీ లక్ష్మీబాయి ఆమెను ఎట్లయినా మహిళా సైనిక దళంలో చేర్చుకోవాలనుకున్నది. భర్త పూరన్ ప్రోత్సాహం, ఆమెకు స్వతహాగా ఉన్న ఆసక్తితో ఝల్కారీ బాయి భర్త దగ్గర గుర్రపుస్వారీ, కత్తియుద్ధం, మల్ల యుద్ధం, ఫిరంగులు పేల్చడం, బాణ విద్యలు నేర్చుకున్నది. సైనికుడైన భర్త పూరన్, లక్ష్మీబాయి ప్రోత్సాహంతో యుద్ధ నైపుణ్యాలు ఒంటబట్టించుకున్న ధీర వనిత ఝల్కారీ బాయి. ఒక అంటరాని ‘కోరి’ కులం దళిత స్త్రీ మహిళా సైనిక దళానికి నాయకురాలుగా ఎదిగింది. దళిత సమాజంలో ఆమె ఘనతను స్ఫూర్తిదాయకంగా భావించి, జాన్సీ, బుండెల్ ఖండ్ ప్రాంతాల్లో ఆమె కథలు, గీతాలు ఇంకా ప్రజా సంస్కృతిలో విస్తరిస్తున్నాయి. ఝల్కారీ బాయి గాధ దళితుల చరిత్రలో ఎంతో గౌరవ ప్రదమైనది. భోపాల్‌లో 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఝల్కారీ బాయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విముక్తి వైపు ప్రయాణించాలంటే..?
దేశంలో తప్పుడు చరిత్రలతో బహుజన వర్గాల పోరాట వీరులను బహిర్గతం చేయలేకపోయారు. దీంతో బహుజన వర్గాల విప్లవ చైతన్యం తప్పుదారి పట్టింది. కావున దేశంలో బడుగు బలహీన వర్గాల పోరాట వీరుల జీవిత గాథలను, విప్లవ స్ఫూర్తిని సరిగ్గా తెలుసుకునేం దుకు చరిత్రను ఆధునిక దృష్టికోణంలో విశ్లేషణ అవసరం. చరిత్రలో అట్టడుగు వర్గాల కోసం పోరాడిన వీరుల గాథాలే నేటి సామాజిక సమరానికి దిక్సూచి. కావున విముక్తి మార్గం వైపు ప్రయాణించాలంటే చరిత్ర అంచున, చరిత్రకు తెలియని ఝల్కారీ బాయి వంటి వీర వనితలను తెలుసుకొని ముందుకెళ్లాలి. ఇది మహిళా చైతన్యానికి, అట్టడుగు వర్గాల విముక్తికి తోడ్పడుతుంది.
(నేడు ఝల్కారీ బాయి జయంతి)
-సంపతి రమేష్ మహారాజ్
79895 79428






