- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జంధ్యం శపథం.. ఓ ధిక్కార స్వరం!
నీట్ పరీక్షల అవకతవకల నేపథ్యంలో ఒక తండ్రి చేసిన నిరసన, జంధ్యం, మహాకాలుడి ప్రతీకల ద్వారా వ్యక్తమైన రాజకీయ ఆవేదన, భావోద్వేగ రాజకీయాలు, ప్రజల భౌతిక అవసరాల మధ్య ఉన్న వైరుధ్యంపై విశ్లేషణాత్మక వ్యాసం. విద్యా వ్యవస్థ వైఫల్యాలు, యువత భవిష్యత్తు, ప్రజా అసంతృప్తి వంటి అంశాలను ఈ కథనం పరిశీలిస్తుంది.

నీట్ పరీక్షల అవకతవకల వల్ల ఒక సామాన్య హిందూ కుటుంబంలో బిడ్డ భవిష్యత్తు అంధకారమైతే, ఆ తండ్రి రాజకీయ భ్రమల నుండి మేల్కొన్నాడు. అతను దేవుడినో, మహాకాలుడినో నమ్మడం అతని వ్యక్తిగత మానసిక అవసరం కావచ్చు. కానీ తన జంధ్యాన్ని చేతబూని, దేశ సర్వోన్నత పాలకు డికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వెనుక ఉన్న సామాజిక సత్యాన్ని పాలకులు గుర్తించాలి.
ప్రతీకలే.. పాలకులను తుదముట్టిస్తాయి!
ఎప్పుడైతే వ్యవస్థలు క్షేత్రస్థాయిలో విఫలమై, మనుగడకు ముప్పు తెస్తాయో, అప్పుడు అదే మనుషులు తాము సృష్టించుకున్న పాత ప్రతీకలనే పాలకులపైకి అస్త్రాలుగా మారుస్తారు. ఇది ఒక మానసిక నిరసన రూపం. భావోద్వేగ రాజకీయాలతో సామ్రాజ్యాలు నిర్మించే శక్తులకు ఇదొక గట్టి హెచ్చరిక. నంద వంశాన్ని సమూలంగా నాశనం చేస్తానని చాణక్యుడు తన శిఖను విప్పి చేసిన ప్రతిజ్ఞ ఒక సామ్రాజ్య పతనానికి నాంది పలికింది. మధ్యయుగంలోనూ ఇదే నూలుపోగును నైతిక ఆయుధంగా వాడారు. ఇవన్నీ దైవిక శక్తులు కావు. ఇవి మనుషుల నమ్మకాలను కదిలించి, రాజకీయ మార్పులు తెచ్చిన చారిత్రక నమూనాలు. సమాజం సృష్టించిన ప్రతీకలు పాలకులకు రక్షణ కవచాలుగా మారినప్పుడు, అవే ప్రతీకలు ఒకరోజు వారి అహంకారాన్ని అణచే ఆయుధాలుగా మారతాయి...
భౌతిక అవసరాలు vs భావోద్వేగ రాజకీయాలు..
ఈ రోజు సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట నడుస్తున్న రైట్ వింగ్ రాజకీయాలు ఈ ప్రతీకలను తామే పేటెంట్ తీసుకున్నట్లు భావిస్తున్నాయి. కానీ తన జంధ్యాన్ని చేతబూని, దేశ సర్వోన్నత పాలకుడికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వెనుక ఉన్న సామాజిక సత్యాన్ని పాలకులు గుర్తించాలి. చాణక్యుడి కాలంలో నందులు ఎంత శక్తివంతులో, ఈనాటి పాలకులూ అంతే శక్తివంతులు కావచ్చు. కానీ వ్యవస్థల వైఫల్యం ఒక తండ్రి గుండెల్లో రగిల్చిన క్రోధాగ్ని ముందు ఏ అధికారమూ నిలబడదు. గాయత్రీ మంత్ర పవిత్రతను నమ్మే ఒక సనాతని, ఉగ్ర స్వరూపుడైన మహాకాలుడి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడంటే, లౌకిక విద్యా వ్యవస్థలు అతన్ని ఎంతగా మోసం చేశాయో అర్థమవుతుంది. పాలకులను రక్షకులుగా చూసే మత్తు వదిలిపోయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
పాలకులకు ప్రకృతి ఇస్తున్న హెచ్చరిక..
భవ్యమైన కట్టడాలు, మతపరమైన నినాదాలు యువతకు ఉద్యోగాలను, పారదర్శకమైన విద్యను ఇవ్వలేవు. సొంత ఓటు బ్యాంకు నుంచే ఈ తరహా తీవ్ర నిరసన రావడం పాలకుల పతనానికి స్పష్టమైన సంకేతం. క్షత్రియులు, బ్రాహ్మణులు గతంలో ధర్మ రక్షణ కోసం జంధ్యం పట్టుకుని ప్రతిజ్ఞలు చేశారు. నేడు అదే జంధ్యం పాలకుల అసమర్థతను ఎండగట్టడానికి వాడుతున్నారు. సాంస్కృతిక గర్వం అనే మేకపోతు గాంభీర్యం భౌతిక వాస్తవాల ముందు ఎప్పుడూ నిలబడదు. తాము పెంచి పోషించిన సెంటిమెంట్లే ఇప్పుడు రివర్స్‌లో తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రైట్ వింగ్ శక్తులు గ్రహించాలి.
బిడ్డల భవిష్యత్తు.. అతి పెద్ద నిజం!
ఆకలి, ఆవేదన, బిడ్డల భవిష్యత్తు అనేవి అన్నిటికంటే పెద్ద నిజాలు. నమ్మకం అనే కత్తిని రాజకీయాల కోసం సాన పెడితే, అది తిరిగి పాలకుల మెడకే చుట్టుకుంటుంది. మహాకాలుడు అనే రూపం ఒక కల్పన కావచ్చు. కానీ ఆ రూపం వెనుక ఉన్న ధిక్కార స్వరం మాత్రం పచ్చి నిజం. భౌతిక వాస్తవాలను విస్మరించి, భావోద్వేగాల మత్తులో తేలే ఏ రాజకీయాన్నైనా కాలం క్షమించదు. ఈ నిరసన స్వరంలోని తీవ్రతను గ్రహించకపోతే, చరిత్రలో గత నంద వంశాల లాగే నేటి సామ్రాజ్యాలూ నేలమట్టం కాక తప్పదు. ఇది కాలం రాసిన తిరుగులేని నిజం. జంధ్యం పట్టి మహాకాలుడి ముందు మోడీకి ఓటు వేయనన్న ఈ ధిక్కార శపథమే రేపు ఆ భ్రమల కోటల పతనానికి తిరుగులేని శాసనం కాబోతోందా..!
- నంబూరి చంద్రశేఖర్
రేడియో ఫిజిసిస్ట్
93939 90399






