జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు కొలిక్కి వచ్చేనా!?

by Disha edit |
జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు కొలిక్కి వచ్చేనా!?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ప్రభుత్వ నేతలపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యల అంశం ముగిసిపోయే సమయంలో తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పిదమే అనుకోవాలి. పవన్ రోజురోజుకూ తనంతట తానే తన ప్రజాదరణను మసకబార్చుకుంటున్నారు, తన స్థాయిని దిగజార్చుకుంటున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనుభవం అవగాహన లేమితో వ్యాఖ్యలు చేస్తూ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారంటున్నారు ఆయన అభిమానులు. ప్రజల్లో నలిగిన వాళ్లనే జనం విశ్వసిస్తారు. తమ నేతగా గుర్తిస్తారు. అంతే తప్ప అప్పుడప్పుడు చేసే విమర్శలకు విలువ ఎలా ఉంటుంది?

పవన్ అభిప్రాయం ఏంటి?

పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడే కావచ్చు. నిక్కచ్చిగా ఉంటారని భావించవచ్చు. కానీ అసలు రాజకీయ లౌక్యం తెలీకపోతే ఎలా? అంటూ ఆయన అభిమానులే ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్న పవన్‌ వ్యాఖ్యల వెనక రాజకీయ ఎత్తుగడ ఉందా? భవిష్యత్తు పొత్తులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా స్పందించారా అన్నది వేచి చూడాలి.

ఏది ఏమైనా వ్యూహాత్మక తప్పిదాల వల్ల పార్టీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశముంది. దీనికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థి తి. అయితే పవన్ సామాజిక వర్గానికి చెందిన యూత్ పూర్తిగా అండదండలు అందిస్తున్నా, మిగతా వర్గాల మద్దతు అంతంత మాత్రంగా ఉండటంతో ఏదో రకంగా కొత్త ఉత్సాహం తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలలో నిమగ్నం కావడం వల్ల పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోవడంపై నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్న తరుణంలో, ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని, అలాగే తెలంగాణలోని పార్టీని పటిష్టపరుస్తూ సమర్థవంతమైన యువనేతకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని వ్యూహం అయితే తాను జాతీయ అధ్యక్షుడిగా ఉండాలనేది పవన్ అభిప్రాయమట. తెలంగాణలో పార్టీ ప్రభావం ఏమాత్రం లేకపోవడం, ఏపీలోను అంతంతమాత్రం గానే ఉన్న తరుణంలో పవన్ జాతీయ అధ్యక్షుడుగా ఉండేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అనేది అనుమానమే.

జనసేన గ్రాఫ్ ఏంటి?

జనసేన పార్టీని సరికొత్త రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. పార్టీ పెట్టి ఏళ్ళు గడుస్తున్నా, ఇప్పటికీ పెద్దగా బలం లేకపోవడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయలేకపోవడం, పార్టీలో ఉన్న నాయకులకు పెద్దగా నమ్మకం కలిగించకపోవడం, రాబోయే ఎన్నికల నాటికి బలం పుంజుకుని అధికారం లోకి వచ్చే ఛాన్స్ అంతంత మాత్రంగా ఉండడం, ఇలా ఎన్నో అంశాలు జనసేనను ఇబ్బంది పెట్టే విషయాలు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడం. తెలుగుదేశంతో పొత్తు అనివార్యం అన్న సంకేతాలు సూచిస్తున్నా తెలుగుదేశం పార్టీతో పొత్తు షరతులతో కూడుకున్నది. జనసేన ఆశించిన సీట్లు, కోరిన నియోజకవర్గాలు, అభ్యర్థుల ఎంపిక ఇలా అనేక సమీకరణాల వల్ల జనసేన సర్దుకుపోవాల్సిన పరిస్థితి. అలా అని ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతాయి. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తెలుగుదేశం ఆధినేతతో ఇప్పటికే టచ్‌లో ఉన్నారు. వైసీపీ అసమ్మతి నేతలు సైతం తెలుగుదేశం వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున జనసేన లోకి వలసలు వచ్చే పరిస్థితి కనిపించకపోవడం తదితర కారణాలతో జనసేన గ్రాఫ్ పెద్దగా పెరగలేదు.

ఏది ఏమైనా పవన్ కల్యాణ్ అచితూచి స్పందించాలి. పార్టీని బలోపేతం చేయాలి. పొత్తుల పై అవగాహనకు రావాలి ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మెలిగేందుకు జనసేనను ఎన్నికలకు సిద్ధం చేయాలి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల సేవలను వినియోగించుకోవాలని . బరిలో గెలిచే నాయకులకు సీట్లు ఇవ్వాలి. పాత అనుభవాలను తలచుకుంటూ పార్టీలోకి వస్తానన్న నాయకుల పట్ల ఉదాసీనంగా ఉంటూ నిర్ణయాన్ని నానిస్తే ప్రయోజనం శూన్యం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు వుండరూ సమయానుకూలంగా వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ అవకాశం ఇవ్వలేని వారి సేవలను గౌరవప్రదంగా పార్టీ క్రియాశీలక వ్యవహారాలలో వినియోగించుకోవాలి. పార్టీ మనగలగాలి అంటే ఎన్నికల్లో గెలవాలి అన్నది ప్రాథమిక సూత్రం.

ఢిల్లీ పర్యటన ఎందుకు?

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. ఆయన బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఫలించలేదు.కేవలం కొంతమంది నాయకులను మాత్రమే ఆయన కలవగలిగారు తప్పా, అంతకు మించి ఆయన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి మార్పులేదు. ఎన్నికలు సమీపిస్తుండటం, వారాహి యాత్రను కూడా త్వరలో ప్రారంభించాల్సి రావడంతో పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దల వద్దనే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమై హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నారు. పవన్ ఢిల్లీటూర్‌తో మరోసారి రోడ్ మ్యాప్ ఎపిసోడ్ వచ్చినా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిపే చర్చల్లో ఈ విషయంపై స్పష్టత రాలేదు. టిడిపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని, తమ పొత్తు జనసేనతో మాత్రమేనని బీజేపీ రాష్ట్ర నేతలు కరాఖండిగా చెబుతున్నారు. జనసేన తమతోనే ఉందని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రాబల్యం భారతీయ జనతా పార్టీ కి ఏ మేర బలాన్ని ఇస్తుందో అన్నది బీజేపీ రాష్ట్ర నేతలకు సైతం అంతుచిక్కని ప్రశ్న.

పవన్ పయనం ఎటువైపు?

బీజేపీ, జనసేన రెండు పార్టీలూ కలిసి పోరాటం చేయడంలేదు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోలేకపోయాయి. బీజేపీ జాతీయ నేతలు తమ పట్ల సానుకూలంగా ఉన్నా రాష్ట్ర నాయకత్వం సరిగా వ్యవహరించడం లేదని పవన్ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ సూచిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను అంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్నారే కానీ, పొత్తులపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా ఉంది. సీట్ల విషయంలో పవన్‌తో గీచి గీచి బేరాలాడుతోంది. ఇవి ఎడతెగకుండా సాగుతున్నాయి. ఈ దశలో అసలు బీజేపీ సంగతేంటో తేల్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు పవన్. ఏపీలో ఏ ఉప ఎన్నికలోనూ జనసేనకు బీజేపీ అవకాశం ఇవ్వలేదు.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేనతో సంప్రదించకుండానే అభ్యర్థులను నిలబెట్టి పరువు తీసుకుంది. జనసేన మాత్రం సైలెంట్‌గా టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు పవన్‌పై అక్కసు వెళ్లగక్కారు. కానీ బయట పడటం లేదు.

అమిత్ షా కొంత టీడీపీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నారన్న సమాచారం. అమిత్ షా అందుకు అంగీకరిస్తే తాను పొత్తుపై చర్చలు ప్రారంభించవచ్చన్న ఆలోచనతో ఉన్నారు. అమిత్ షా నుంచి కలవాలని మాత్రం పిలుపు రాకపోవడంతో పవన్ కొంత అసహనంతోనే ఉన్నారని తెలిసింది. మరోవైపు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్న దృష్ట్యా ఈ విషయమై చర్చించేందుకు ఆయనను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది. తెలుగు వారి ప్రాబల్యం వున్న నియోజకవర్గాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కసరత్తు చేసే పని నల్లారి వారికి అప్పగించింది. ఉత్తర కర్ణాటకలో చాలా వరకూ తెలుగు ప్రాబల్యమే ఎక్కువ. బళ్లారి, రాయచూరు, సింధనూర్, గంగావతి, దావనగిరి, గుల్బర్గా, బీదర్ వరకూ అయితే ఆంధ్రా, లేదంటే తెలంగాణ సెటిలర్స్‌ది కీలక వర్గం. మరి ఆ తెలుగు ఓట్లను ప్రభావితం చేసేలా స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ సేవలని వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ అభ్యర్థుల నిర్ణయంపై ఢిల్లీలో జరిగిన భేటీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది.

దోస్తీ ఎవరితో?

టిడిపి నేత చంద్రబాబు కూడా మోదీతో దోస్తీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా సుజనా చౌదరిని రంగంలోకి దింపినట్లు సమాచారం. ఈ పరిణామాలు పరిశీలిస్తే బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు భావన మళ్ళీ బలంగా వినిపిస్తోంది. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జన సైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024 లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో వ్యూహం ఉండాలి. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు అవసరం లేదు. గెలుపుపై జన సైనికులు భరోసా ఇస్తే ఒంటరిగానే పోటీ చేస్తాం. లేదంటే షరతులతో కూడిన పొత్తుకు వెళ్తాం అన్నది పవన్ వ్యూహం. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడానికి అవసరమైతే త్యాగాలకు సిద్ధపడి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కట్టడానికి తమ అధినేత సిద్ధపడ్డారని, అటువంటి వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకు లొంగరని జనసేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పొత్తుల కత్తులతో జరిగే ఎన్నికల రణంలో విజయం ఎవరిదో?

ఇవి కూడా చదవండి: ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం జగన్.. తాజా పరిణామాలతో పార్టీ క్యాడర్ సైతం బేజారు!

శ్రీధర్ వాడవల్లి

99898 55445

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed