ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం జగన్.. తాజా పరిణామాలతో పార్టీ క్యాడర్ సైతం బేజారు!

by Disha Web Desk 2 |
ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం జగన్.. తాజా పరిణామాలతో పార్టీ క్యాడర్ సైతం బేజారు!
X

కోడి కత్తి కేసు విచారణను ఎన్​ఐఏ కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్​ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్​కోసం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్​పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ రెండు కేసులపై దర్యాప్తులు వైసీపీ క్యాడర్​ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేట్లున్నాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను దీటుగా ఎదుర్కొనే పరిస్థితులు కనిపించడం లేదు. తాజా పరిణామాలపై సీఎం జగన్​తో పాటు కీలక నేతలూ కలవర పడుతున్నారు. ఒకవేళ అవినాశ్ ​రెడ్డి అరెస్టయితే తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. వివేకా హత్య, కోడి కత్తి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అవినాశ్ ​రెడ్డి అరెస్టును ఆపేందుకు కేంద్ర పెద్దలు సీఎం జగన్​కు సహకరిస్తారా ? అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో సీబీఐ ముందుకు వెళ్తుందా అనే అంశాలపైనే ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ ​రెడ్డి సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. పులివెందుల నుంచి అవినాశ్​హైదరాబాద్ ​ప్రయాణించినప్పుడు ఆయనతోపాటు పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా ఉన్నారట. కేసు విషయమై చర్చించినట్లు సమాచారం. ఈ క్లిష్ట సమయంలో ఎలా ముందుకు పోవాలనే అంశంపై సాయంత్రం టీటీడీ చైర్మన్ ​వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి.. సీఎం జగన్​తో భేటీ అయ్యారు. మంగళవారం ముందస్తు బెయిల్ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు ఎలా తీర్పునిస్తుంది.. ఒకవేళ సీబీఐ అరెస్టు చేస్తే ఏం చెయ్యాలనే దానిపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇది వైఎస్సార్​ కుటుంబ ప్రతిష్టకు సంబంధించిన అంశం. సీబీఐ అరెస్టుల తర్వాత సీబీఐ దర్యాప్తు ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చించారట. ఈ పరిణామాలన్నీ పార్టీ యంత్రాంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.. తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూలంకషంగా సీఎం జగన్​మాట్లాడినట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అవినాశ్ అరెస్టయితే వైసీపీకి ఇక్కట్లే..

కోడి కత్తి కేసు విషయంలో ఎలాంటి కుట్ర లేదని ఎన్​ఐఏ తేల్చింది. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ ​దాఖలు చేసింది. వైఎస్ ​జగన్​ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తానే ఈ నాటకం ఆడినట్లు నిందితుడు శ్రీను చెప్పాడు. అసలు ఇదంతా సానుభూతి కోసం జగనే నాటకానికి శ్రీకారం చుట్టినట్లు శ్రీను చెప్పి ఉంటే అధికారం కోసం ఇంత బరితెగిస్తారా అని జనం విస్తుపోయేవారు. ఆ ప్రమాదం నుంచి పార్టీ బయటపడింది. వివేకా హత్య కేసు నుంచి బయటపడడం అంత తేలిక్కాదు. అవతల వివేకా కుమార్తె సునీత మరింత పట్టుదలతో ఉన్నారు. చివరకు అవినాశ్ ​ముందస్తు బెయిల్ ​పిటిషన్​లో తనను ఇంప్లీడ్ ​చేయాలని కోరుతూ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాశ్​ అరెస్టు అయితే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని విశ్లేషకుల అంచనా.

అరెస్టయినా.. కాకున్నా..

అవినాశ్ ​అరెస్టు అవుతారా లేదా అనే చర్చతో రాష్ట్రంలోని అన్ని అంశాలూ దారి మళ్లాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకీరణ, కార్మికుల ఆందోళన, బీఆర్​ఎస్​మంత్రి హరీష్​రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల ప్రతిస్పందనలన్నీ పక్కకు పోయాయి. వివేకా హత్య కేసుపై సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు వైసీపీ సోషల్ ​మీడియా దీటుగా స్పందించలేకపోతోంది. వైసీపీ, బీజేపీ రహస్య బంధానికి గండిపడిందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ అవినాశ్ అరెస్టు కాకుంటే బీజేపీతో వైసీపీ బంధం మరింత బలపడిందనే విమర్శలనూ ఎదుర్కోక తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈపాటికే సీఎం జగన్​ ఉక్కిరి బిక్కిరవుతూ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. రేపటి నుంచి బయటకొస్తే పార్టీ నేతలకు ఏం చెబుతారు.. పార్టీ క్యాడర్​కు ఏం నిర్దేశిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి: జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు కొలిక్కి వచ్చేనా!?


Next Story

Most Viewed