పల్లా రాజేశ్వర్‌రెడ్డికే బాధ్యతలు? ‘సిట్టింగ్’పై BRS ఫోకస్

by Rajesh |
పల్లా రాజేశ్వర్‌రెడ్డికే బాధ్యతలు? ‘సిట్టింగ్’పై BRS ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు కంప్లీట్ కావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కసరత్తును ప్రారంభించింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబ్టెటుకోవాలని ప్రయత్నాలు షురూ చేసింది. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా, అందరూ కలిసి పనిచేసేలా చర్యలు చేపడుతోంది. ఉద్యమకారులు, సీనియర్ నేతలతో మంతనాలు జరిపి వారిని శాంతపరిచేలా ప్లాన్ చేస్తోంది.

ప్రచార అస్త్రంగా పదేండ్ల ప్రగతి..

ఉద్యమ కాలం నుంచి గులాబీ పార్టీకి కంచుకోటగా నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఉంది. 2007లో ఈ సెగ్మెంట్ ఏర్పడగా నాటి నుంచి వరుసగా జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది. కాగా బై పోల్‌లోనూ తిరిగి ఈ సీటు కైవసం చేసుకునేందుకు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రప్రగతిని, యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు కంపెనీల స్థాపనకు ఇచ్చిన ప్రోత్సాహకాలను ప్రచార అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

టఫ్ ఫైట్..

పట్టభద్రుల ఉప ఎన్నికలో కచ్చితంగా గెలువాలని కాంగ్రెస్‌ లక్ష్యం పెట్టుకోవడంతో పాటు ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, ఉమ్మడి ఖమ్మంలో భద్రాచలం, ఉమ్మడి నల్లగొండలో సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇందులో ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూడు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం. అందుకు ప్రత్యేక క్యాంపులనూ నిర్వహించనున్నట్టు తెలిసింది. జనగాం, సూర్యాపేట నియోజకవర్గాల్లో తప్ప అంతటా హస్తం పార్టీ వారే అధికారంలో ఉండటంతో ఈ ఎమ్మెల్సీ బై పోల్‌లో విజయం సాధించి పార్టీ కేడర్, నాయకుల్లో జోష్ నింపాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎలక్షన్ బూస్ట్ ఇచ్చేలా చర్యలు చేపడుతోంది.

తీన్మార్ మల్లన్నతోనే బీఆర్ఎస్‌కు గట్టిపోటీ..

పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మూడు ఉమ్మడి జిల్లాలపైన ఆయనకు పట్టుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతో స్పష్టమైన ఆధిక్యతను పల్లా ప్రదర్శించలేకపోయారు. దీంతో ఏడు రౌండ్స్‌ను లెక్కించాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపులో ఆది నుంచి మూడో స్థానంలో కొనసాగిన కోదండరాం చివరకు ఎలిమినేట్‌ అయ్యారు. కోదండరాంకు వచ్చిన ప్రథమ ప్రాధాన్యత బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా అత్యధిక ఓట్లు పల్లాకు లభించాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,61,811 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. చివరకు పల్లా 12,806 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి..పల్లా అనుచరుడు కావడంతో ఆయనకే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతలను అధిష్ఠానం అప్పగించినట్టు సమాచారం. నాడు స్వతంత్రంగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవడంతో బీఆర్ఎస్‌కు గట్టిపోటీ నెలకొంది.

వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు..

పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,74,794, పురుషులు 2,87,007 మంది, ట్రాన్స్‌జెండర్లు ఐదుగురు ఉన్నారు. కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1,67,853 మంది ఓటర్లు ఉండగా, ఇందులో వరంగల్ జిల్లాకు చెందినవారే ఎక్కువమంది ఉండటం బీఆర్ఎస్‌కు కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. అందుకే వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్‌రెడ్డికి టికెట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాకేశ్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడు, మంచి వాగ్ధాటి, క్లీన్ ఇమేజ్‌తో పాటు, క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఫలితాలు రాబట్టగల సమర్థత, కష్టపడి పనిచేసే సొంత టీమ్ ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు. 2013లో బీజేపీలో చేరి ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చిన రాకేశ్‌రెడ్డి..బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, రెండు పర్యాయాలు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు ప్లస్ అవుతాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాకేశ్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.

అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ప్లాన్..

ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజీనామా చేయడంతో బీఆర్ఎస్‌లో ఉద్యమకాలం నుంచి ఉన్న వారు ఆ టికెట్‌ను ఆశించారు. ఉమ్మడి వరంగల్‌కు చెందిన వాసుదేవరెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్‌గౌడ్, చెరుకు సుధాకర్, ఒంటెద్దు నర్సిరెడ్డి, కర్నె ప్రభాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి ఇలా పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. కాగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి టికెట్ విషయంలో చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. జగదీష్‌రెడ్డి సైతం తన అనుచరుడు నర్సిరెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించారని వినికిడి. అయితే, నేతలను, ఉద్యమకారులను సంప్రదించకుండానే రాకేశ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రాకేశ్ అభ్యర్థిత్వాన్ని బహిరంగానే వ్యతిరేకించారు. ప్రచారానికి సైతం పలువురు దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న అధిష్ఠానం వారందరినీ సమన్వయం చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. నేతలతో మాట్లాడి సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం సఫలీకృతమవుతుందో చూడాలి.

Next Story