- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజనుల మొదటి పండుగ.. ఇటుకల పండుగ
ప్రపంచంలోని అన్ని మతాల, కులాల, జాతుల వారు జరుపుకుంటున్న పండుగల లాగే, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో

ప్రపంచంలోని అన్ని మతాల, కులాల, జాతుల వారు జరుపుకుంటున్న పండుగల లాగే, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు వారి సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కొన్ని పండుగలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఎక్కువ భాగం పండుగలు.. వ్యవసాయానికి సంబంధించినవిగా ఉంటాయి. తెలుగు నెలలు, ఆంగ్ల నెలలు వలె గిరిజనులకు కూడా కొన్ని ప్రత్యేక నెలలు ఉన్నాయి. ఇవి కూడా ఏప్రిల్ నుండి ప్రారంభమై మార్చితో ముగుస్తాయి. ఈ సంవత్సర కాలంలో వారు తమవైన పండుగలు నిర్వహిస్తారు. అందులో భాగంగా మొదట నిర్వహించే పండుగ ఇటుకల పండుగ. ఈ పండుగ అనంతరం వీరు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు.
ఇటుకల పండుగలో..
ఈ ఇటుకల పండుగను వారి గ్రామాల్లో 3 నుంచి 7 రోజులు పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ఆదివాసీల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ పండుగ బాగా చేస్తే పంటలు బాగా పండుతాయని వీరు గట్టిగా నమ్ముతారు. గ్రామాల్లోని గిరిజనులంతా ఈ పండుగ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగలో, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు, పితృదేవతలను పూజిస్తారు. ఈ పండుగలో భాగంగా వేటకు వెళ్లడం, వేటకు వెళ్లే ముందు గ్రామంలోని అందరూ ఆయుధాలకు పూజ చేస్తారు. అనంతరం ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ “థీంసా” నృత్యాన్ని చేస్తారు. దీన్ని గిరిజన వ్యవహారిక భాషలో “గుమ్మాలాట” అని పిలుస్తారు. ఇక ఈ పండుగలో, ఆదివాసీ మహిళలంతా గ్రూపులుగా ఏర్పడి, ఊరి పొలిమేరలో రహదారి వద్ద గేట్ ఏర్పాటు చేసి తాచేరు/పజోర్పేరుతో డబ్బులు (చందాలు) వసూలు చేస్తుంటారు. డబ్బులు ఇచ్చిన వారినే గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. డబ్బులు ఇచ్చే వారి నుదుట బొట్టు పెట్టి గిరిజన సంప్రదాయం ప్రకారం మర్యాద చేస్తారు. డబ్బులు ఇవ్వని వారిని చల్లటి నీటితో తడిపేస్తారు. ఈ విధంగా వచ్చిన డబ్బులతో గ్రామస్తులు అందరు కలిసి వంటకు కావలసిన వస్తువులు కొనుకొని వంట చేసుకొని అందరు కలిసి పండుగ చేసుకుంటారు.
ఈ సంప్రదాయాలు ఇలాగే ఉండాలని..
అయితే నేటి ప్రపంచంలో మారుతున్న పరిస్థితులతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇవి స్వాగతించాల్సిన విషయమే కానీ ఎందులో మార్పులు కావాలి? అక్షరాస్యత, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో గణనీయమైన అభివృద్ధి లేదా మార్పు రావాలి. కానీ ప్రస్తుత ప్రపంచీకరణ ప్రభావం ఏజెన్సీపై కూడా ప్రభావం చూపడం వల్ల ఏజెన్సీ ప్రాంత సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో మార్పులు వచ్చి నేటి తరానికి తెలియని స్థితిలో ఉన్నాయి. ఇలా అయితే భావితరాలు ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతవరకు ఆచరిస్తాయనేది సందేహమే. ఇదే జరిగితే నిజంగా బాధాకరం. అయితే భావి తరాల వారు ఈ ఆచారాలు పాటించకపోయినప్పటికీ కనీసం వారి సంస్కృతి సంప్రదాయాలు ఇలానే ఉంటాయని తెలుసుకోవాలని ఆశిద్దాం.
- ఎన్.సీతారామయ్య,
94409 72048






