అమెరికా.. అహంకారం!

by Bhoopathi Nagaiah |

అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా వ్యవహరించిన తీరు ఓ వీధి రౌడీలా ఉండటాన్ని సామాన్యుడి నుంచి దేశాధ్యక్షుల వరకూ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

అమెరికా.. అహంకారం!
X

వెనిజులాపై అమెరికా దుశ్చర్య.. ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. దేశాలకు భద్రత ఉందా? బలం ఉన్నోడిదే రాజ్యం అన్న మాటను ఈ ఘటన అక్షరాలా నిజం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ఒక దేశాధ్యక్షుడిని రాత్రికి రాత్రి మరో దేశం సైనికులు వచ్చి ఎత్తుకెళ్తే ప్రశ్నించే నాథుడే లేకపోవడం సామాన్య ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా వ్యవహరించిన తీరు ఓ వీధి రౌడీలా ఉండటాన్ని సామాన్యుడి నుంచి దేశాధ్యక్షుల వరకూ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

200 ఏళ్ల క్రితం అమెరికా ఐదో అధ్యక్షుడు జేమ్స్ మన్రో తెచ్చిన సిద్ధాంతం ప్రకారం లాటిన్ అమెరికాలో మరే యూరప్ దేశం ఆక్రమణను సహించబోమని ప్రకటించగా.. అనేకమంది అమెరికా అధ్యక్షులు ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తూనే ఉన్నారు. ఆ జాబితాలో ట్రంప్ కూడా చేరారు. అందుకే మన్రో సిద్దాంతాన్ని వక్రీకరించిన తీరును ఎండగడుతూ వెనిజులాపై ట్రంప్ ప్రతాపాన్ని అమెరికా పత్రికలు డోన్ రో థియరీ అని వ్యాఖ్యానిస్తున్నాయి.

కూటములే ప్రత్యామ్నాయం

‘ఖండిస్తున్నాం’ అనే మాట తప్ప ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో మరే చర్య తీసుకోకపోవడం బలమున్నోడిదే రాజ్యం అన్న సత్యాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నది. ఐరాస, నాటో వంటి కూటములు ఇటువంటి దుశ్చర్యలను అడ్డుకోకపోతే వీటి మనుగడకు అర్థం ఏమున్నది? ఇంతకాలం ఆపత్కాల సమయంలో ఆదుకుంటాయని అనుకున్న వ్యవస్థల దుస్థితిని చూస్తున్న దేశాలు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. ఐరాస, నాటో విఫలమవుతున్న తీరును గమనిస్తున్న ఈయూ, బ్రిక్స్, ఎస్సీవో, క్వాడ్, ఆకస్ వంటి కూటములు.. ఆసియాన్, ఆఫ్రికన్ యూనియన్, ఓపెక్ వంటి సమూహాలు తమ స్వయంప్రతిపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐరాస, నాటో నుంచి బయటపడేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆ దేశ గౌరవం మాటేమిటి?

అమెరికా అగ్రరాజ్యమే అయినా తమ దేశాధ్యక్షుడిని చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న దృశ్యాలను వెనిజులా ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవడిచ్చాడు నీకీ ఈ అధికారం? అని ట్రంప్‌ దుస్సాహసంపై మండిపడుతున్నారు. దాడికి వంద కాదు.. లక్ష కారణాలు చెప్పినా ట్రంప్ చేసిన పనిని వెనిజులా పౌరులెవరూ ఆమోదించలేరు. అమెరికా తీరును వీధివీధినా ఎండగడుతూ జరుగుతున్న పోరాటాలే ఇందుకు నిదర్శనం. ‘ఈ రోజు మా దేశానికి పట్టిన గతే రేపు మీకు పట్టవచ్చు’ అని వెనిజులా రక్షణ శాఖ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్ చేసిన వ్యాఖ్యలు స్వాభిమానం ఉన్న ప్రతి మనిషి గుండెను తూటాలా తాకాయి.

దాడి వెనుక వాస్తవాలు

వెనిజులాపై దాడికి డ్రగ్స్ మాత్రమే కారణమా? అంటే ఏమాత్రం కాదు. ముఖ్యంగా చమురు, బంగారం నిల్వలు అసలు విషయం. అందుకే మదురో కిడ్నాప్ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడిన మొదటి ఇంటర్వ్యూలోనే వెనిజులాలో అమెరికా చమురు కంపెనీలు తమ వాటాను దక్కించుకుంటాయని వెల్లడించారు. గత అధ్యక్షుడు హ్యూగో చావెజ్ రద్దు చేసిన అమెరికా చమురు కంపెనీల కాంట్రాక్టులన్నీ ఇప్పుడు కొనసాగుతాయని ఏకపక్షంగా ప్రకటించారు. అందుకే తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన డెల్సీ రోడ్రిగెజ్‌కు ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. చమురు విషయంలో ఏదైనా తిరకాసు వస్తే మదురోకన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఇకమీదట వెనిజులాలోని సహజవనరుల పెత్తనం మొత్తం అమెరికా చేతుల్లోకి పోనున్నదా? ఆ దేశ ప్రజలు దీనిని ఆమోదిస్తారా? ఎదురుతిరిగి అగ్రరాజ్యానికి ఓటమి రుచిచూపిస్తారా? అన్నది వేచి చూడాలి.

గ్రీన్‌ల్యాండ్‌పై కన్ను

వెనిజులాపై జులుం ఘటన జరిగిన రెండురోజులకే అమెరికా మరో దేశంపై ఆక్రమణకు సిద్ధమైంది. డెన్మార్క్‌లో అంతర్భాగంగా స్వయంప్రతిపత్తితో కొనసాగుతున్న గ్రీన్‌ల్యాండ్‌ని దక్కించుకోవాలని అమెరికా ఆశ పడుతున్నది. సహజవనరుల కోసమే కాకుండా ఉత్తర అర్కిటిక్ గ్రీన్ ల్యాండ్‌కు కనెక్టివిటీ ఇక్కడ అమెరికాను ఆకర్షిస్తున్నది. మరోవైపు ఉత్తర అర్కిటిక్‌పై రష్యా, చైనాలు దృష్టి పెట్టడం కూడా అమెరికా కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నది. అందుకే వెనిజులాపై విజయంగా భావిస్తు్న్న ట్రంప్ వెంటనే గ్రీన్ ల్యాండ్‌పై కన్నేశారు. ఎన్నికల్లో గెలిచిన ఏడాదిలోపే గత అధ్యక్షుల కంటే ఎక్కువ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు సీఐఏ అధికారులే వెనిజులాపై దాడికి వ్యూహం రచించారు అన్న వాదనను ఆ సంస్థకు చెందిన మాజీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం సీఐఏకి ట్రంప్ చాలా దూరం పాటిస్తున్నారని.. ఆ సంస్థ ఇచ్చే ఇన్‌పుట్స్‌ని నమ్మడం లేదని అంటున్నారు. ఆ సంస్థకు చెందిన ముఖ్యమైన అధికారులు స్వచ్చందంగా పదవీ విరమణ చేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. పైగా ట్రంప్ డీప్ స్టేట్ అనే పదం ఎక్కువగా వాడటం.. అమెరికాలో ప్రభుత్వాలను సైతం శాసించే శాశ్వత వ్యవస్థలు ఉన్నాయని ఆయన చేస్తున్న ఆరోపణలు సీఐఏను ఉద్దేశించేనని పేర్కొంటున్నారు. మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న ప్రమాదకరమైన నిర్ణయాలు భవిష్యత్తులో అమెరికాకు తీవ్ర నష్టం చేకూర్చబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

భారత్ మౌనం ఎందుకు?

వెనిజులాపై దాడిని భారత్ ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నది? అన్న సందేహం చాలామందిలో వ్యక్తమవుతున్నది. విదేశీవ్యవహారాల మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా కఠినంగా లేకపోవడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. కానీ, వెనిజులాపై దాడిని ఎక్కడ భారత్ లాంటి దేశం ఖండిస్తుందేమోనన్న భయంతోనే రష్యా చమురు కొనుగోలు వంటి పాత విషయాల్ని బూచిగా చూపి టారిఫ్ 50 శాతం కాదు 500 శాతం వేసినా తక్కువేనంటూ ప్రకటనలు చేస్తున్నది. పైగా బంగ్లాదేశ్ సంక్షోభాన్ని భారత్‌ మెడకు అంటగట్టి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నది. ఇండియా ఎక్కడా అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్లు చేయకుండా స్ట్రాటజిక్ గేమ్ ప్లే చేస్తున్నది. ట్రంప్ వ్యాఖ్యలతో భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు పెద్దఎత్తున ఉపసంహరణ మొదలుకావడం, స్టాక్ మార్కెట్ పడిపోయే పరిస్థితులు రావడంతో ప్రభుత్వం కూడా వెనిజులా విషయంలో గట్టి విమర్శలు చేయకుండా మౌనం పాటించాల్సి వస్తున్నది. ఏ దేశమైనా తన సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడకుండా పోరాడితే ఎంతటి అగ్రరాజ్యమైనా తోకముడవక మానదు.. ఇందుకు వియత్నాం నుంచి క్యూబా, అఫ్ఘానిస్తాన్ వరకు ఎన్నో చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరో దుస్సాహసానికి దిగితే అగ్రరాజ్యానికి భంగపాటు తప్పదు.

హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story