సంవత్సరం మారితే చాలదు.. భవిష్యత్తుకు బాసట మారాలి

by Bhoopathi Nagaiah |

క్యాలెండర్ పేజీ మారితేనే జీవితం మారిపోదు. సమస్యలు, సవాళ్లు, అసమానతలు అలాగే నిలిచిపోతాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఈ వాస్తవాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.

సంవత్సరం మారితే చాలదు.. భవిష్యత్తుకు బాసట మారాలి
X

కొత్త సంవత్సరం వస్తోందంటే మన కళ్ల ముందు ముందుగా మెదిలేది రంగుల బాణసంచాలు, మెరుస్తున్న కాంతులు, గోడలపై కొత్త క్యాలెండర్లు. అవన్నీ క్షణిక ఆనందం ఇస్తాయి. కానీ నిజంగా మారాల్సింది అవి కాదు. మారాల్సింది మన బతుకులు, మన వ్యవస్థలు, మన ఆలోచనలు. ప్రతి డిసెంబర్ 31 రాత్రి ప్రపంచం ఒక ఉన్మాదంలో మునిగిపోతుంది. సంబరాల మధ్య ‘కొత్త సంవత్సరం వచ్చింది’ అనే భావనను మనం బలంగా నమ్ముతాం.

కానీ క్యాలెండర్ పేజీ మారితేనే జీవితం మారిపోదు. సమస్యలు, సవాళ్లు, అసమానతలు అలాగే నిలిచిపోతాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఈ వాస్తవాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. అప్పుల భారంతో అలసిపోయిన రైతు కుటుంబాలకు కొత్త సంవత్సరం వేడుకలు కాదు, నిత్య జీవన పోరాటమే ముఖ్యం. ఇదే సమయంలో ఆ శ్రమను లాభాలుగా మార్చుకునే వర్గం సంబరాల్లో మునిగిపోతోంది. ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు ఉన్నా… శ్రమించే చేతులకు కన్నీటి రాత్రులు, లాభాల వర్గానికి ఉత్సవాలు. ఈ విరోధాభాసమే సమాజాన్ని నిశ్శబ్దంగా విభజిస్తోంది.

తాత్కాలిక మత్తే అందలమైతే..

ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామపంచాయతీ ఎన్నికలు వాయిదాల మీద వాయిదాల తర్వాత జరిగాయి. కానీ ఎన్నికలు జరిగాయన్న ఒక్క కారణంతోనే ప్రజల సమస్యలు పరిష్కారమైతే, అది ప్రజాస్వామ్యం అవుతుందా? పాలన మారినా పాలసీలు మారకపోతే, ప్రజలకు దక్కేది నిరాశే. అసలు సమస్యలను మరల్చేందుకు సినిమాలు, పైరవీలు, ఆర్భాటాలు పెరుగుతున్నాయి. సామాన్యుడికి శాశ్వత పరిష్కారం కాదు, కేవలం తాత్కాలిక మత్తే అందుతోంది. మరోవైపు వరుస బస్సు ప్రమాదాలు, దాడులు, ప్రాణ నష్టాలు రవాణా వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

పరిష్కారం లేని సామాజిక సమస్యలు

సామాజిక సమస్యలు కూడా తగ్గడం లేదు. బీసీ రిజర్వేషన్ల అమలుకోసం సాగిన పోరాటంలో ఒక అమరుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు, దిశానిర్దేశం లేక నిరాశలో ఉన్న యువత వీటి వలలో చిక్కుతోంది. మానవ విలువలు క్షీణిస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు రోజువారీ వార్తలుగా మారాయి. మహిళలకు భద్రత ప్రశ్నార్థకమైంది. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరం కావడంతో పేదలకు అందని దూరంగా మారాయి. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లభించడం లేదు.

కేక్ కోయగానే కష్టాలన్నీ కరిగిపోవు

క్యాలెండర్‌పై అంకె మారగానే కాలం మారిపోయిందని భ్రమపడటం అమాయకత్వమే. అర్ధరాత్రి కేక్ కోయగానే కష్టాలన్నీ కరిగిపోవు; బాణసంచా వెలుగులు నిండగానే పేదరికం చీకట్లు తొలగిపోవు. ఆకాశం నుంచి అద్భుతాలు జరగవు. అట్టడుగు వర్గాల బతుకుల్లో మార్పు రావాలంటే అధికార యంత్రాంగం ఆలోచనా విధానం మారాలి. సామాన్యుడి కన్నీటి చుక్కకు విలువనిచ్చే వ్యవస్థ కావాలి. శ్రమను దోచుకునే శక్తుల కంటే, శ్రమించే చేతులకు గౌరవం దక్కే రోజే నిజమైన నూతన సంవత్సరం.

వేడుకల వెనుక ఆకలి కేకలు

వందల కోట్లు ఖర్చు చేసే వేడుకల వెనుక గంజి మెతుకు కోసం అలమటించే సగటు మనిషి ఆకలి కేకలు వినిపించనంత కాలం, ఎన్ని ఏళ్లు మారినా ఫలితం ఉండదు. ఆర్భాటాల మత్తులో నుంచి మేల్కొని, సమస్యల వాస్తవికతను గుర్తించి, కుల–మతాలకు అతీతంగా మానవత్వమే ప్రాతిపదికగా వ్యవస్థలు పునర్నిర్మాణం కావాలి. పాత ఏడాదిలో చిందిన రక్తం, కన్నీళ్లు కొత్త ఏడాదిలో కనీసం భవిష్యత్తుపై భరోసానైనా ఇవ్వాలి. రంగులు మారడం కాదు – బతుకు చిత్రం మారాలి. అప్పుడే ఈ భూమిపై మనిషి పుట్టుకకు, కొత్త ఏడాదికి సార్థకత చేకూరుతుంది.

క్యాలెండర్ మార్చుకున్నాం.. మనం మారామా?

ఈ పరిస్థితులన్నింటి మధ్య కొత్త సంవత్సరం మనల్ని నిలదీసి ఒకే ప్రశ్న వేస్తోంది: “క్యాలెండర్ మార్చుకున్నాం… కానీ మనం మారామా?” నిజమైన మార్పు బాణసంచాల వెలుగుల్లో కాదు. అది విధానాల్లో, ఆలోచనల్లో, అమలులో కనిపించాలి. రైతుకు గిట్టుబాటు ధర దక్కాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. మహిళలు భయంలేకుండా జీవించగల పరిస్థితులు ఏర్పడాలి. విద్య–వైద్యం అందరికీ అందేలా ప్రభుత్వ బాధ్యత పెరగాలి.

ఆశలు నెరవేరే కాలం ఎప్పుడు

ఆకాశంలో మెరుస్తున్న కాంతులు క్షణాల్లో ఆరిపోతాయి. కానీ పేదరికంలో, నిరాశలో ఉన్న మనసుల్లో వెలిగే ఆశ మాత్రం శాశ్వతం కావాలి. కుల–మత గోడలు కూలి, శ్రమకు గౌరవం లభించి, మానవత్వమే పాలనకు కేంద్రంగా మారినప్పుడు మాత్రమే నిజమైన నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. క్యాలెండర్ కొత్తది. కానీ ఇప్పుడు మారాల్సింది మన బతుకులు… మన వ్యవస్థలు… మన మనసులు.

- గడగోజు రవీంద్రాచారి,

98487 72232

Next Story