1971 యుద్ధంతో, ఆపరేషన్ సిందూర్‌ను పోల్చడం సరికాదు!

by Ravi |   (  Updated:2025-05-15 01:00:46  IST  )

పాక్ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందిస్తూ మే 7వ తేదిన పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ ద్వారా మన సైనిక

1971 యుద్ధంతో, ఆపరేషన్ సిందూర్‌ను పోల్చడం సరికాదు!
X

పాక్ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందిస్తూ మే 7వ తేదిన పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ ద్వారా మన సైనిక సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు అవగతమైంది. ఈ ఆపరేషన్‌కు ప్రజలు, రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన ఈ సందర్భం చరిత్రలో నిలిచిపోతుంది. భారత్ చేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక పోరులో ఈ ఆపరేషన్ సిందూర్ ఒక మైలురాయిగా నిలిచింది.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు కశ్మీర్ అంశం సమస్యగానే ఉంటూ వస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడి, పర్యాటకం అభివృద్ధి చెందుతున్న తరుణంలో, పహెల్గాం ఉగ్రదాడి జరగడంతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిపై దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆగ్రహించడంతో భారత ప్రభుత్వం ఈ దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నా వారికి శిక్ష తప్పదని హెచ్చరించింది. ఇందులో భాగంగా సైన్యం ఆప రేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.

ఇందిరా గాంధీతో పోల్చుతూ..

అయితే యుద్ధం ఉధృతమై పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందన్న క్రమంలో మే 10న అమెరికా మధ్య వర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం ప్రకటించడంతో దేశ ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో 1971 నాటి సంఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించి ఆ దేశం నుండి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)ను విభజించడంలో సఫలం అయ్యారు. ఇందిరా గాంధీ అప్పటి పరిస్థితుల్ని రాజకీయ, దౌత్య, సైనిక వ్యూహాలతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. అయితే నాడు యుద్ధ సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా) మద్దతు భారత్‌కి ఉంది. కానీ నేడు పరిస్థితులు అలా లేవు. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా ముగియలేదు. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కి ఒక బిలియన్ డాలర్లు రుణంగా ఇచ్చింది. పాకిస్తాన్ ఈ రుణాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంటుందని భారత్ ఎంత వారించినా ఐఎంఎఫ్ పట్టించుకోలేదు. మరి అమెరికా అనుమతి లేకుండా ఇది సాధ్యమేనా? అయితే దేశ ప్రజలు చీలిపోయారు. శత్రుదేశం మనపై ఉగ్రదాడుల్ని చేస్తుంటే శాంతి వచనాలు వల్లె వేయడం మంచిది కాదంటూ ఓ వర్గం వాదన. పెరిగిన శాస్త్ర, సాంకేతికత నేపథ్యంలో యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్‌తో పాటు భారత్‌లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని మరో వర్గం వాదన.

అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు

ఏదేమైనా ఇరు దేశాల మధ్య ఏ ఒప్పందాలు జరగ కుండానే సీజ్‌ఫైర్ అమలు అయింది. అయితే భవిష్యత్‌లో పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రదాడులకు పాల్పడితే యుద్ధానికి వెనకాడబోమని భారత ప్రభుత్వం హెచ్చిరిస్తూ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని తెలిపింది.ఇరుదేశాల కాల్పుల విరమణ అనంతరం అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రజల నుండి కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ బలాబలాలు ఏంటో మనకు తెలిసి వచ్చింది. యుద్ధం జరిగితే ఏ దేశం మన వెంట ఉంటుంది, శత్రు దేశం వెంట ఎవరుంటారో కూడా తెలియ వచ్చింది. ఏదేమైనా 1971 నాటి యుద్ధంతో, ఆపరేషన్ సిందూర్‌ను పోల్చడం సరికాదేమో..? అప్పటి పరి స్థితుల్ని ఇప్పటితో పోల్చలేం, ఎవరి యుద్ధనీతి వారిది. సింధూ నదీ జలాల ఒప్పందం, పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయాల్లో భారత ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామిక భారతావని సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను కాపాడుతూనే శత్రు దేశాలకు సరైన సమయంలో, సరైన రీతిలో గుణపాఠం చెప్పాలన్నదే దేశ ప్రజల ఆకాంక్ష.

డాక్టర్. అశోక్ మంద

ఉస్మానియా యూనివర్సిటీ ,

99590 46499

Next Story