- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత నిర్ణయాలు.. ట్రంప్ నోట నిజమేనా?
రష్యా నుంచి చమురు దిగుమతులను తక్షణం ఆపేయాలని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు భారత్ బెదిరిపోయి లొంగిపోయినట్లే కనపడుతోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేయని పక్షంలో

రష్యా నుంచి చమురు దిగుమతులను తక్షణం ఆపేయాలని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు భారత్ బెదిరిపోయి లొంగిపోయినట్లే కనపడుతోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేయని పక్షంలో భారీ సుంకాల మోత కొనసాగుతుందంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు మోడీ ప్రభుత్వం జీ హుజూర్ అంటూ తలొగ్గినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపి వేస్తానంటూ భారత ప్రధాని మోడీ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని ట్రంప్ పదేపదే చేసిన ప్రకటనలను బీజేపీ ప్రభుత్వం ఖండించింది. కానీ ఈ విషయంలో భారత్ అబద్ధాలు చెప్పినట్టు స్పష్టమయింది.
దిగుమతులను ఆపేసిన హెచ్‌పీసీఎల్..
ట్రంప్‌కు మోడీ ఇచ్చిన మాట ప్రకారం రష్యా నుండి క్రూడాయిల్ కొనుగోలు ఆపేసినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ పూర్తిగా నిలిపివేసినట్లు ప్రభుత్వం అధికారికంగా అందచేసిన వివరాలు వెల్లడిస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసినట్లు ఫెడరల్ అనే మీడియా సంస్థ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సమాధానమిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో రష్యా నుంచి ఒక్క చుక్క చమురును కూడా దిగుమతి చేసుకోలేదని జవాబిచ్చింది.
గోప్యత పేరుతో సమాచారం దాటవేత..
2022 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు రష్యా నుంచి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకున్న ముడి చమురు నెలవారీ వివరాలను తెలియజేయాలని ఫెడరల్ ఆర్టీఐ కింద కోరింది. దీనికి హెచ్‌పీసీఎల్ మాత్రమే జవాబివ్వగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల చమురు కంపెనీలు మాత్రం గోప్యతా నిబంధనలను సాకుగా చూపుతూ వివరాలు వెల్లడించడానికి నిరాకరించాయి. హెచ్‌పీసీఎల్ ఇచ్చిన వివరాల ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు కంపెనీ నిరంతరంగా ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. 2025 ఫిబ్రవరిలో అత్యంత తక్కువగా 131 టీఎంటీ (వేల మెట్రిక్ టన్నులు) ముడి చమురును దిగుమతి చేసుకోగా 2024 అక్టోబర్‌లో అత్యంత అధికంగా 1,146 టీఎంటీ దిగుమతి చేసుకుంది. అయితే 2022 ఆగస్టు, 2022 అక్టోబర్‌లో మాత్రం సున్నా దిగుమతులను చూపించింది. అదే విధంగా 2025 ఆగస్టులో కూడా సున్నా దిగుమతులు చూపించింది.
ట్రంప్ భారీ సుంకాల ప్రభావం..
భారత్‌పై అమెరికా భారీ సుంకాలు విధించిన తర్వాత ఈ విధంగా సున్నా దిగుమతి జరగడం గమనార్హం. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత 2022 జనవరి - మార్చి తొలి త్రైమాసికంలో రష్యా నుంచి హెచ్‌పీసీఎల్ చమురును దిగుమతి చేసుకోలేదు. అయితే ఆ తర్వాత నుంచి రష్యా చమురు దిగుమతులు క్రమంగా పెరుగుతూ పోయాయి. 2024 అక్టోబర్‌లో హెచ్‌పీసీఎల్ శుద్ధి చేసిన మొత్తం ముడి చమురులో రష్యా ముడి చమురు 13 శాతం ఉంటుంది.
భారత నిర్ణయాలు.. ట్రంప్ నోట!
భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు భారత దేశానికి సంబంధించిన నిర్ణయాలను భారత ప్రధాన మంత్రి మోడీకి బదులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నట్లు కనపడుతుంది. భారత ప్రభుత్వం పరిపాలన విషయంలో విదేశీ (అమెరికా అధ్యక్షుడు ట్రంప్) జోక్యం చేసుకుని నిర్ణయాలు ప్రకటించటం ఏమిటి? ఆ విషయాలు ఆర్టీఐ వెల్లడించటం విడ్డూరంగా ఉంది. బీజేపీ నాయకులు, ఆరెస్సెస్ శ్రేణులు తరచూ వల్లించే దేశ భక్తి అంటే ఇదేనా!
- డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,
98493 28496






