- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులగణన ఆలస్యం ఇందుకేనా?
దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటానికి తలొగ్గి కేంద్రం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది.

దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటానికి తలొగ్గి కేంద్రం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2027లో జనగనణతో పాటు కులగణన చేపడుతామని షెడ్యూల్ విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి బీసీ సంఘాలు.. జనాభా గణనతో పాటు కులగణనను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో ఇదొక రహస్య ఎజెండా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.
డీలిమిటేషన్ ప్రక్రియ యాదృచ్ఛికం కాదు, దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. 2026లో ప్రారంభమయ్యే జనగణన, కులగణన ప్రక్రియలు 2027 వరకు వాయిదా పడే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 2027లో కాకుండా 2026లో బీసీ కులగణన చేపట్టి, చట్టసవరణ చేసి బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నాం.
హోంమంత్రి హామీ ఇచ్చినా..
కేంద్రం 2026 అక్టోబర్ 1 నుంచి జమ్మూ కశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమా చల్ ప్రదేశ్‌లలో తొలి దశ కుల గణన ప్రారం భించి, 2027 మార్చి 1 నుంచి రెండో దశలో దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ గణన, నియోజకవర్గాల పునర్విభజనకు ఉపయోగపడనుంది. అయితే జనాభా నియంత్రణ విధానాలను కచ్చితంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల పార్లమెంట్ సీట్లను కోల్పోయే ప్రమాదం రావడం బాధాకరమైన విషయం. జనాభా నియంత్రణను పట్టించుకోని రాష్ట్రాలు అదనపు సీట్లను బహుమతిగా పొందడం ఎంత వరకూ కరెక్ట్? ఇది ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే చర్య కాక మరింకేమిటి? అందుకే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేసేలా డీలిమిటేషన్ విధానాన్ని రూపొందించాలి. ఈ విషయంలో అమిత్ షా హామీ ఇచ్చినప్పటికీ, స్పష్టమైన విధానం అవసరం. కార్యాచరణలో కూడా క్లారిటీ రావాలి. ఇక కులగణనలో ‘కులం’ అనే పదాన్ని స్పష్టంగా చేర్చాలి. సాంకేతిక పదాలు ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు. ఈ చర్యలు సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల కేటాయింపులో కుల ఆధారిత డేటాకు చట్టపరమైన విశ్వసనీయతను తీసుకుని వస్తుంది.
వృత్తి నైపుణ్యం లేకపోవడంతో..
జనగణన, కులగణన ప్రక్రియలో స్థానిక భాషలు, సామాజిక సమూహాల సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయడానికి సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందించాలి. ఇక కులగణనకు సంబంధించిన డేటా సేకరణలో కూడా సరైన చర్యలు తీసుకోవాలి. గోప్యతాపరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి. కులగణనపై మేధావులతో సమావేశం నిర్వహించి, సమగ్ర కులగణన కోసం విధి విధానాలు రూపొందించాలి. ఈ కులగణన సెన్సెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే జరగాలి. గతంలో కాంగ్రెస్ సోషియో, ఎకానమిక్ కులగణన చేసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో రూరల్ డెవలప్మెంట్ శాఖ, పట్టణ ప్రాంతంలో అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఈ పనిని చేపట్టింది. వీరికి వృత్తి నైపుణ్యం లేక డేటా మొత్తం తప్పుల తడకగా మారింది. సెన్సెస్ డిపార్ట్మెంట్ శిక్షణ పొందిన అధికారుల ద్వారా జరిగితేనే ఈ ప్రక్రియకు ఒక విశ్వసనీయత ఏర్పడుతుంది.
కులానికి ఓ కోడ్ ఇస్తే..
ఈ గణనలో ప్రతి కులానికి ఒక కోడ్ నంబర్ ఇవ్వాలి. లేదంటే అనేక కులాలు కలిసిపోయి డేటా స్వచ్ఛత దెబ్బ తింటుంది. ఉదాహరణకు ఒకే కులాన్ని ఒకే రాష్ట్రంలోనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీరందరినీ ఒకే కోడ్ నంబర్‌లోకి తీసుకొచ్చినట్లయితే కులాల లెక్కలు సరిగ్గా వస్తాయి. రాష్ట్రాలవారీ కులాల లిస్టులను తయారుచేసి వాటికి కోడ్ నెంబర్ ఇచ్చి పేపర్ ప్రకటనలు ఇవ్వడం మరింత మంచిది. కులగణన ద్వారా సేకరించిన డేటా ఆధారంగా, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలి. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. మన దేశ రాజకీయ, అభివృద్ధి ప్రక్రియలో బీసీలకు సరైన స్థానం కల్పించాలంటే, వారి జనాభా, సామాజిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలు తప్పనిసరి అని అందరూ గుర్తెరగాలి.
దుండ్ర కుమారస్వామి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు
99599 12341






