ఇదేనా చట్టసభల ప్రాధాన్యత?

by Ravi |   (  Updated:2026-04-08 00:45:47  IST  )

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రస్తుత తీరు ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబిస్తుందా? లేక రాజకీయ జగడాలకే వేదికగా మారిందా? చర్చలు, విభేదాలు, ప్రతిపక్ష పాత్రపై విశ్లేషణ.

ఇదేనా చట్టసభల ప్రాధాన్యత?
X

ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది కేవలం చట్టాలను ఆమోదించే స్థలం మాత్రమే కాదు.. అది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆవేదనలు, సమస్యలను ప్రతిధ్వనించే వేదిక. చట్టాల రూపకల్పన, ప్రభుత్వ విధానాల సమీక్ష, ప్రజా సమ స్యలపై చర్చ, ఆర్థిక వ్యవహారాల పరిశీలన ఇవి అన్నీ శాసన సభల ప్రధాన బాధ్యతలు.. ఈ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో చర్చలు, వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజం, విభేదాలు సహజం. కానీ ఆ విభేదాలు నిర్మాణా త్మకంగా ఉండాలి.

ఇవి రాజకీయ జగడాలా?

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు సమాజంలో విస్తృత చర్చకు దారి తీసింది. సభలో వినిపిస్తున్నది నిజంగా ప్రజాస్వామ్య స్వరమా? లేక వ్యక్తిగత, రాజకీయ జగడమా? అనే ప్రశ్న ఇప్పుడు సమాజంలో ఎదురు నిలుస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్షం సంబంధాలే శాసనసభ పనితీరును నిర్ణ యిస్తాయి. అధికార పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో వేగం చూపాలి. కానీ అదే సమయంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షం కూడా కేవలం గందరగోళం సృష్టించి, సభను అడ్డుకోవడం కాకుండా నిర్మాణాత్మకంగా విమర్శించాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమతుల్యత కనిపించడం లేదు. ప్రతిపక్షం తరచూ వాక్‌ అవుట్‌లకు దిగడం, కొన్నిసార్లు సస్పెన్షన్‌లకు గురవడం, సభలో చర్చలు మధ్యలోనే నిలిచిపోవడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

భూ సంస్కరణలకు పునాది ఈ చర్చే..

1950లలో శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య భూ సంస్కరణలపై పదేపదే లేవనెత్తిన చర్చలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయి.. అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన భూ సంస్కరణల చర్చల్లో పుచ్చలపల్లి సుందరయ్య స్పష్టంగా ‘దున్నేవాడికే భూమి’ అన్న సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. భూస్వాముల చేతుల్లో భూమి కేంద్రీకృతమై ఉండటం సామాజిక అన్యాయానికి దారి తీస్తుందని ఆయన వాదించారు. భూ సంస్కరణల అంశంపై ఆయన చేసిన వాదనలు ఒక కీలక మలుపుగా చెప్పాలి. పెద్ద భూస్వాములు వేల ఎకరాల భూమిని కలిగి ఉండగా, చిన్న రైతులు భూమి లేక బాధపడుతున్నారని ఆయన గట్టిగా ప్రస్తావించారు. చివరకు భూ సంస్కరణలపై దేశ వ్యాప్తంగా చట్టాలు రావడానికి ఈ చర్చలు పునాది వేశాయి.

వాజ్‌పేయి నెలకొల్పిన ప్రమాణాలు..

ప్రతిపక్షం ఎలా ఉండాలో చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్ పేయి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన విమర్శలు గట్టిగా ఉండేవి, కానీ గౌరవం కోల్పోయేవి కాదు.. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి, ప్రధానంగా ప్రజా సమస్యలపై, అంశాల కేంద్రీకృతంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఒకసారి విదేశాంగ విధానంపై ఆయన చేసిన విమర్శలను అప్పటి ప్రభుత్వం కూడా గౌరవంగా స్వీకరించడం ప్రజాస్వామ్యంలో చర్చల స్థాయిని సూచిస్తుంది. అలాగే లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, సభ గౌరవాన్ని కాపాడారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం కనిపిస్తున్న పరి స్థితులు ఈ ప్రమాణాలకు ఎంతవరకు సరిపోతున్నాయన్నది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే కాదు ఓట్లేసిన ప్రజలు కూడా ఆలోచించాల్సిన సందర్భం.

కీలకదశలో తెలంగాణ అసెంబ్లీ..

భవిష్యత్తులో తెలంగాణ అసెంబ్లీ మరింత సమర్థవంతంగా పని చేయాలంటే కొన్ని కీలక మార్పులు అవసరం. ప్రతిపక్షానికి తగిన సమయం ఇవ్వాలి. బిల్లులపై సవివర చర్చలు జరపాలి. స్పీకర్ తటస్థతను కాపాడాలి. సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహ‌రించాలి. మొత్తంగా చూస్తే, తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రజాస్వామ్యం జీవించాలంటే సభలు సజావుగా నడవాలి. నాయకులు బాధ్యతాయుతంగా వ్యవ హరించాలి. తెలంగాణ అసెంబ్లీ ఆ దిశగా ముందడుగు వేస్తేనే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది.

- విజయ్ పుట్టపాగ

80080 28237

Next Story