నాలుగేళ్లలోనే ఇంతటి వ్యతిరేకతా?

by Disha edit |
నాలుగేళ్లలోనే ఇంతటి వ్యతిరేకతా?
X

రాష్ట్ర ప్రజలు ఎన్నికల సమయంలో జగన్ చేసిన ప్రసంగాలు, ప్రమాణస్వీకారం రోజు చెప్పిన మాటలు విని ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అవినీతి లేని ఆదర్శ పాలన అందిస్తారని ఆశపడ్డారు. నవరత్నాలు పేరుతో ప్రజాధనాన్ని తేరగా పంచడంతో.. సంక్షేమ రాజ్యం వచ్చిందని సంబరపడ్డారు. ఓదార్పు యాత్ర పేరుతో జాతర చేసిన జగన్‌ను చూసి జనం జాలిపడ్డారు. అతని నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించలేకపోయారు. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న వాస్తవాన్ని జగన్ గ్రహించారు. అందుకే కొత్తకొత్త ఎత్తులతో బయలుదేరారు. గడప గడపకు బయలుదేరిన వైసీపీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిలదీతలు, ఛీత్కారాలు ఎదురయ్యాయి. మా ఊరికి రావొద్దు, మా ఇంటికి రావొద్దు అంటూ ప్రజలు తిరగబడ్డారు. ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రులు సైతం పరారయ్యారు. ప్రజల తలరాతలు మారుస్తానని ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ పాలనపై భ్రమలు తొలగిపోయాయి. జగన్‌కు పరిపాలన చేతగావడం లేదని, అభివృద్ధిని గాలికి వదిలేశారని ప్రజలు భావిస్తున్నారు. దీంతో జనాకర్షక పథకాలతో, ఓటుబ్యాంకు రాజకీయాలతో పబ్బం గడపాలనుకుంటున్నారు.

ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడి..

రాష్ట్రంలో నాలుగేళ్లుగా నిరంకుశ పాలన సాగించి అన్ని వర్గాల ప్రజల ఆగ్రహానికి గురయ్యారు జగన్. ప్రజలకు వర్తమానమే కాదు.. భవిష్యత్ కూడా అంధకారం చేశారు. మరోసారి మోసం చేయడానికి జగన్ రెడ్డి మాయల ఫకీర్ అవతారం ఎత్తి కొత్త నాటకానికి తెర తీశారు. ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటానికి జగనన్న సురక్ష పేరుతో ఇటీవల కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అని జతచేశారు. జగన్ రెడ్డి ముఖంలో మాత్రమే చిరునవ్వు.. సామాన్యుడి ముఖంలో మాత్రం విషాదం కనిపిస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని సురక్షితంగా ఉంచడానికి రోజుకో కొత్తం వేషం వేస్తున్నారు. గడప గడపకు వైసీపీ, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నకు చెబుదాం లాంటి తుగ్లక్ కార్యక్రమాలు పెట్టారు. వాటి నుంచి పెద్దగా ఫలితాలు రాకపోగా.. ప్రజల నుంచి తిరస్కారాలు ఎదురయ్యాయి. మాకొద్దు బాబోయ్ ఈ జగన్ అని ప్రజలు భావిస్తున్నారు.

మీ అధ్వాన, అరాచక పాలనలో సామాన్యుడి ముఖంలో చిరునవ్వు కూడానా? సామాన్యులను సమిధలను చేసింది మీ పాలనలో కాదా? పార్టీని, ప్రభుత్వాన్ని సురక్షితంగా ఉంచడానికే తప్ప ప్రజలను సురక్షితంగా ఉంచడానికి కాదు. జగమే మాయ-జగనే మాయలా ఉంది. ఈ వాస్తవాలను గ్రహించి ప్రజలు తిరగబడుతుండటంతో ప్రభుత్వ అధికారులను, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను రక్షణగా పెట్టుకుని జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడి అధికారంలోకి వచ్చారు. ఇక భవిష్యత్తులో ఛాన్సే లేకుండా చేసుకున్నారు. అడుగడుగునా మోసపోతున్నామనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. దీంతో ముఖ్యమంత్రి పరదాల చాటున దాక్కుంటూ తప్పించుకు తిరుగుతున్నారు.

జగన్ అధికారంలో అక్రమాలు..

ప్రశాంతంగా ఉండే విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజధాని అయితే రాలేదు కానీ రౌడీ రాజ్యం వచ్చింది. సాక్షాత్తూ అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడి కుటుంబాన్ని అరాచక శక్తులు కిడ్నాప్ చేశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖలో ఉన్నరోజే కిడ్నాప్‌కు పథక రచన జరిగింది. సొంత పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని రౌడీలు కిడ్నాప్ చేసి చితక్కొట్టారు. గతంలో మరో ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టుచేసి చావగొట్టారు. పార్లమెంట్ సభ్యులకే రక్షణ లేకుండా పోయింది. సొంత పార్టీ ఎంపీనే పొరుగు రాష్ట్రానికి వెళ్లి వ్యాపారం చేసుకుంటానని చెప్పడం దేనికి సంకేతం? పార్లమెంట్ సభ్యులకే రక్షణ లేక పారిపోతుంటే సామాన్య ప్రజలను ఏవిధంగా సురక్షితంగా ఉంచుతారు? ఇప్పటివరకు ముఖ్యమంత్రి దీనిపై స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? జనాన్ని ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారు, పెట్రోల్ పోసి తగులబెడుతున్నారు. దళితులను చంపి ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు. పాలకపక్ష నాయకులే వీటన్నింటికి తెగబడుతూ ఎవరినీ సురక్షితంగా ఉండనివ్వడం లేదు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. పారదర్శకత, జవాబుదారీతనం లోపించి పాలన అరాచక స్థాయికి చేరింది. జగన్ రెడ్డి చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.

సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని అటకెక్కించారు. చీకటి జీవో నెం.1ని తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే పత్రికలు, మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు జీవో నెం. 2430ని తెచ్చారు. కొన్ని ఛానళ్లు, పత్రికలపై విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రుషికొండను బోడిగుండుగా మార్చారు. సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ఏజెన్సీలో గంజాయిసాగు, అక్రమ మైనింగ్‌‌తో పాటు విశాఖలో 40వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారు. ప్రభుత్వ అడ్డగోలు, అప్రజాస్వామిక నిర్ణయాలను రద్దు చేశారన్న అక్కసుతో న్యాయవ్యవస్థపైనే దాడికి తెగబడ్డారు. పోలీస్ వ్యవస్థను జగన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా మార్చుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేలా చేస్తున్నారు. కొత్త రోడ్లు వేయకపోగా ఉన్న రోడ్లను ధ్వంసం చేశారు. కనీసం వాటికి మరమ్మత్తులు చేయకుండా చోద్యం చూస్తున్నారు. ‘జే’ ట్యాక్స్ కమీషన్ల కోసం పారిశ్రామిక వేత్తలపై బెదిరింపులకు పాల్పడటంతో పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. 6 లక్షల మందికి పెన్షన్లు తొలగించారు. ప్రజల భావప్రకటన హక్కుపై ముప్పేట దాడి చేస్తున్నారు. దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. రకరకాల కారణాలు చూపి ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. నాలుగేళ్లలో నాలుగు వందల మంది ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టి చట్టాన్ని నీరుగార్చుతున్నారు.

గన్ను కన్నా ముందు వస్తానన్న జగన్ ఎక్కడ?

ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి, 4 ఏళ్లల్లో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. అధికారంలోకి వస్తే ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.7,86,413 భారం మోపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తానని మహిళలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. నాన్న బుడ్డీలో రూ.70 వేలు కొట్టేస్తూ మద్యం ధరలు పెంచి రూ.42 వేల కోట్లు దోచుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. నాలుగేళ్లలో 8 సార్లు ఛార్జీలు పెంచి రూ.57 వేల కోట్ల భారాలు వినియోగదారులపై మోపారు. రాష్ట్ర అప్పులను 10 లక్షల కోట్లకు చేర్చారు. 25 మందికి 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అక్క, చెల్లెమ్మలకు అన్యాయం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. నాలుగేళ్లలో మహిళలపై 52,587 నేరాలు జరిగినా ఒక్కరికీ న్యాయం చేయలేదు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏడాదికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని నాలుగేళ్లలో నిర్మించింది కేవలం 5 ఇళ్లు మాత్రమే. కమీషన్ల కోసం నాలుగేళ్లలో మూడు సార్లు ఇసుక పాలసీలు మార్చి తన బినామీ కంపెనీలకు కట్టబెట్టి రూ.12వేల కోట్లు కొల్లగొట్టారు. స్మార్ట్ మీటర్లలో రూ.12 వేల కోట్ల అవినీతి జరిగింది.

ప్రజలు కళ్లు తెరవకపోతే…

ఎదురులేని తిరుగులేని ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి నాలుగేళ్లలోనే ఇంతటి వ్యతిరేకతని ఎలా మూటగట్టుకున్నారు? దీనికి కారణంగా ఆయనలో ఉన్న అహంకారం, ప్రతీకారేచ్చలే కనిపిస్తున్నాయి. అభివృద్ధికి ఆనవాళ్లు లేకుండా చేసి బూతులను అధికార భాషగా మార్చి పాలన సాగిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని దానిని వ్యవస్థీకృతం చేశారు. సంక్షేమ రాజ్యం మత్తులో ప్రజలను ఉంచి సమస్త పన్నులు పెంచి పేదల నడ్డివిరిచారు. ఇప్పుడు రాష్ట్రం అధోగతి పాలయ్యిందని. జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ వర్గం సంతోషంగా లేదు. నేరాలు-ఘోరాలు, విద్వేషాలు, విధ్వంసాలు, లూటీలు, అబద్ధాలతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. సొంత బాబాయి వివేకా హత్యకు కుట్ర పన్ని ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడు బాబాయి హంతకులను కాపాడుతూ వారిని సురక్షితంగా ఉంచుతున్నారు. ప్రజలు కళ్లు తెరవకపోతే మరింత చీకట్లోకి పోయే ప్రమాదం ఉంది. జగన్ రెడ్డి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా తగులబెట్టక మునుపే మేల్కోవాలి.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

99497 77727

Next Story

Most Viewed