విద్యార్థి సంఘాల గళం మూగబోతోందా..?

by Ravi |   (  Updated:2026-07-05 00:45:24  IST  )

పాఠశాలలు, కళాశాలల్లో కొనసాగుతున్న విద్యారంగ సమస్యలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం, విద్యార్థి సంఘాల పాత్ర, విద్యా సంస్కరణల అవసరంపై చర్చ

విద్యార్థి సంఘాల గళం మూగబోతోందా..?
X

పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభమయ్యాయంటే ఒకప్పుడు జిల్లా కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాలు విద్యార్థి సంఘాల నిరసనలతో దద్దరిల్లేవి. పాఠ్య పుస్తకాల కొరత, యూనిఫాంల పంపిణీలో జాప్యం, హాస్టళ్ల సమస్యలు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు, ఫీజుల భారం వంటి అంశాలపై ఉద్యమాలు సాగేవి. విద్యార్థుల గళం ప్రభుత్వాలను స్పందిం పజేసే శక్తిగా నిలిచేది. కానీ నేడు సమస్యలు కొనసాగుతున్నా, వాటిపై విద్యార్థి సంఘాల స్పందన గతంతో పోలిస్తే మందగించడం ఆందోళన కలిగిస్తోంది.

సంస్కరణలు చేపడుతున్నప్పటికీ..

ప్రభుత్వాలు మారుతున్నా విద్యారంగ సమస్యలు మాత్రం పూర్తిగా పరిష్కారం కావడం లేదు. కాలానుగుణ మార్పులు, సంస్కరణల పేరుతో చర్యలు చేపడుతున్నప్పటికీ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తేవడంలో పాలకులు పూర్తిస్థాయిలో సఫలం కాలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కార్పొరేట్‌ విద్యావ్యవస్థ చాపకింద నీరులా విస్తరిస్తూ విద్యను అంగడి సరుకుగా మారుస్తోంది. పేదవాడికి నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే విద్యా వ్యవస్థకు సార్థకత ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితులు ఆ లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పాఠ్య పుస్తకాల కొరత, యూనిఫాంల ఆలస్యం, హాస్టళ్లలో సౌకర్యాల లేమి, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిలు, ప్రభుత్వ హామీలు, కొనసాగుతున్నాయి.

పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఎక్కడ?

ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడి పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారంగా మారుతోంది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రిని వారి పాఠశాలలో లేదా నిర్దిష్ట దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు కమిటీలు ఉన్నప్పటికీ పారదర్శకత లోపిస్తోంది. ప్రభుత్వ చర్యలు నామ మాత్రమే. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నప్పటికీ అమలు అనేక చోట్ల ప్రశ్నార్థకంగా మారింది. తగిన మౌలిక వసతులు లేకుండానే కొన్ని విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. ఇది విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతోంది. నాణ్యమైన విద్య అందించాల్సిన చోట పరీక్షల ఫలితాలకే ప్రాధాన్యం, బట్టి చదువులు పెరుగుతుండటంతో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, పరిశోధనా దృక్పథం దెబ్బతింటున్నాయి.

విద్యను ర్యాంకులకు పరిమితం చేయొద్దు!

విద్యను జ్ఞాన సాధనంగా కాకుండా మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలకు పరిమితం చేసే ధోరణి బలపడుతోంది. ఇలాంటి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాల కోసం పోరాడాల్సిన బాధ్యత విద్యార్థి సంఘాలదే. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సంఘాలు పోషించిన పాత్ర ఇందుకు నిద ర్శనం. విశ్వవిద్యాలయాల నుంచి గ్రామీణ కళాశాలల వరకు విద్యార్థి గళం సామాజిక మార్పులకు, ప్రజా చైతన్యానికి దిక్సూ చిగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఉద్యమాల ప్రభావం గతంతో పోలిస్తే తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రశ్నించే గొంతుకలు బలహీనపడితే..

ప్రశ్నించే గొంతుకలు బలహీనపడితే దోపిడీ బలపడుతుంది. అందుకే విద్యార్థి సంఘాలు తమ దృష్టిని మళ్లీ విద్యా సమస్యలపైనే కేంద్రీకరించాలి. విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం నిరంతర ఒత్తిడి తీసుకు రావాలి. శాస్త్రీయమైన, సమాన అవకాశాలు కల్పించే విద్యా విధానం కోసం ఉద్యమించాలి. ఏ లక్ష్యాలతో, ఏ నినాదాలతో విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయో ఆ లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాలి. విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించి, సమాజాన్ని ఆలోచింపజేసి, విద్యారంగ సంస్కరణల కోసం ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే చరిత్ర చెబుతోంది.. విద్యార్థి గళం బలంగా వినిపించినప్పుడే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యమవుతుంది. ఆ గళం నిశ్శబ్దమైతే సమస్యలే శాశ్వతమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

-గడగోజు రవీంద్రాచారి

98487 72232

Next Story