- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన జనాభా ఇంతేనా !!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన నివేదికపై గత కొన్ని రోజులుగా వివిధ వర్గాల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన నివేదికపై గత కొన్ని రోజులుగా వివిధ వర్గాల నుండి వస్తున్న జనాభా లెక్కల వివరాలపై దుమారం రేగుతోంది. అనేక సామాజిక వర్గాలు సర్వే రిపోర్టుపై తమ వాణిని, నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్‌కి సంబంధించిన జనాభా లెక్కలపై ప్రభుత్వం ప్రకటించిన నివేదికలో 37 లక్షలని పేర్కొనడంపై చాలా గిరిజన సంఘాలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కారణం గిరిజనులలో ప్రధానంగా సగటు సంతాన ఉత్పత్తి రేషియో అన్ని వర్గాల కంటే ఎక్కువగా ఉండటం, ఈ కారణంగా జనాభా ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువనే ఉంటుంది కానీ ఇదయితే కాదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
2014లో తెలంగాణ ఏర్పడక ముందే బంజారాల జనాభా షెడ్యూల్ తెగల జనాభా కలిపి 12 శాతం పైగా ఉంటుందని అంచనా వేశారు. కానీ నేడు జరిగిన సర్వేలో 10.45% అని తేలడం బాధాకరం. నిజమైన జనాభా లెక్కలు జరిగితే గాని ఇందులో ఉన్న అంశం బయటకు రాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కలతోనే దీని వెనుక మతలబు బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే మేధావులు, గిరిజన శ్రేయోభిలాషులు తమ సందేహాలను ప్రభుత్వానికి నివేదించి వాస్తవాలను కప్పి పుచ్చకుండా తప్పు లెక్కలు జరగకుండా సరిదిద్దే అవకాశం ఇప్పటికీ ఉంది.
రాష్ట్రం మొత్తంలో..
రాష్ట్ర మొత్తం జనాభా మూడున్నర కోట్లు. 33 జిల్లాలలో షెడ్యూల్ ట్రైబ్ జనాభాను చూస్తే.. నాలుగు లక్షలతో భద్రాద్రి కొత్తగూడెం, మూడు లక్షల మందితో మహబూబాబాద్, 2.25 లక్షలతో ఆదిలాబాద్, రెండు లక్షల పదివేలతో నల్గొండ, 2 లక్షలతో ఖమ్మం అధిక జనాభాను కలిగి ఉన్నాయి లక్ష నుంచి లక్షన్నర మధ్య రంగారెడ్డి, సూర్యాపేట, కొమరం భీమ్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ 50 నుండి లక్ష జనాభా మధ్యన కలిగిన షెడ్యూల్ ట్రైబ్స్ జిల్లాలు.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మంచిర్యాల, నిర్మల్, ములుగు అదే విధంగా హైదరాబాద్‌లో 50,000, యాదాద్రిలో 44,000, వనపర్తిలో 46,000 ఎస్టీల జనాభా ఉంది. 20 నుండి 40 వేల మధ్యన గిరిజన జనాభా గలిగిన జిల్లాలు జనగాం, హనుమకొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, జోగులంబ గద్వాల్, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల ఇవి తక్కువ జనాభాతో కలిగి ఉన్న జిల్లాలు.. ఈ లెక్కలను చూస్తే క్రమంగా గిరిజనులలో విద్య కోసం, ఉపాధి కోసం గ్రామాలను వదిలి పట్టణాల వైపుకు మళ్లుతున్నట్టు పట్టణాలలో పెరిగే జనాభాను బట్టి నిర్ధారించవచ్చు.
వారికి ప్రత్యేక పథకాలు తప్పదు!
గిరిజనులు ఎక్కువగా ఆటోలు నడపడం, ఫంక్షన్ హాల్‌లో పనిచేయడం, అడ్డాల మీద లేబర్ పనిచేయడం, రోడ్లపై చిన్న చిన్న వ్యాపారం చేయడం, అనేక చిన్న సన్నకారు వృత్తులలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల కోసం ఒక ప్రత్యేకమైన టువంటి ప్యాకేజీని ప్రకటించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. గ్రామాలలో భూములను కోల్పోయి ఉపాధి మార్గాలు సన్నగిల్లడం సరైన అవకాశాలు దక్కక చాలామంది గిరిజనులు ఈరోజు హైదరాబాద్ మీదనే ఉపాధి కోసం ఆధారపడి బతుకుతున్నారు. అందుకే ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాన్ని రూపొందించి అమలు పరచవలసిన అవసరం ఈ లెక్కల ద్వారా తేలుతుంది.
సర్వేలో పాల్గొనని వారు ఎవరు?
ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో చాలా మంది బంజారాలు పాల్గొన్నారు. కానీ కొందరు నాయకులు, మేధావులు మాత్రం ఈ సర్వేలో పాల్గొంటే తమ ఆస్తులు వివరాలతో సహా సర్వే ఫామ్‌లో అన్ని అంశాలు ప్రకటిస్తే భవిష్యత్తులో మనకేమైనా ఇబ్బందులు జరుగుతుందా? అనే కోణంలో కొందరు పాల్గొని ఉండకపోవచ్చు. మరోవైపు ప్రభుత్వం కూడా జనాభా తగ్గించి చూపించే అవకాశం ఉంటుంది. అందుకు కారణం జనాభా పెరిగితే రిజర్వేషన్లు పెంచవలసిన అవసరం ఉందనే డిమాండ్ ఏర్పడుతుందని మరో కోణంలో చర్చ జరగవచ్చని. ఇప్పటికే బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు పెరగవలసిన జనాభా ఎందుకు తగ్గిపోయింది 2014 తెలంగాణాలో గత ప్రభుత్వం ప్రకటించినసర్వే వివరాల కంటే జనాభా ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తున్నారు. లేకపోతే పాలకులే వీళ్లకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం వీళ్ళ జనాభా ఇంతే అని ఫిక్స్ చేసి ఏదో కాస్త కోస్తూ తేడా చూపించినట్టు కనిపిస్తుంది.
తప్పులు సరిదిద్దే అవకాశం ఇదే..
ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి వివరాలతో గ్రామ గ్రామాన గ్రామపంచాయతీలో ఈ సర్వే రిపోర్ట్‌ని పబ్లిష్ చేయాలి. ఎవరైతే నమోదు చేసుకోలేదో వారిని ఇప్పుడు నమోదు చేసుకునేటట్టు చూడాలి. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల పైన తమ అభిప్రాయాన్ని, తమకున్న సందేహాలను గిరిజన సమాజం ప్రశ్నించకపోతే ఇదే కరెక్ట్ అవుతుందని ప్రభుత్వాలు భావించి తదనుగుణంగానే నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ తరానికి, గిరిజన జనానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. పైగా రిజర్వేషన్ శాతాన్ని కూడా ప్రభు త్వాలు ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేధావులు, గిరిజన శ్రేయోభిలాషులు తమ సందేహాలను ప్రభుత్వానికి నివేదించి వాస్తవాలను కప్పిపుచ్చకుండా తప్పులెక్కలు జరగకుండా సరిదిద్దే అవకాశం ఇప్పటికీ ఉందని గ్రహించాలి.
డా. శంకర్ కుమార్
అసోసియేట్ ప్రొఫెసర్
9110716674






