- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దర్ అవార్డ్స్ ఎంపిక పారదర్శకమేనా.. పునః సమీక్ష చేయాల్సిందేనా?
ఏదైనా అవార్డుల ఎంపిక కోసం జ్యూరీ మెంబర్స్‌గా యాక్టివ్‌గా సినిమాల్లో పనిచేసే వారికంటే విశ్రాంత దర్శకులో, రచయితలో

ఏదైనా అవార్డుల ఎంపిక కోసం జ్యూరీ మెంబర్స్‌గా యాక్టివ్‌గా సినిమాల్లో పనిచేసే వారికంటే విశ్రాంత దర్శకులో, రచయితలో, సినిమాలపై అధ్యయనం చేసినవారో, సినీ విశ్లేషకులో ఎక్కువ శాతం జ్యూరీ మెంబర్స్‌గా నియమించబడుతారు.. ఒకవేళ వర్తమాన సినిమా వ్యక్తులు ఉన్నా కూడా, వారు పని చేసినటువంటి సినిమాను అవార్డు పోటీలో దరఖాస్తు చేయకూడదు. లేదా వారు జ్యూరీలో ఉండకూడదు.. కానీ గద్దర్ అవార్డ్స్ కోసం అప్లై చేసిన సినిమాల్లో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ సెలక్షన్ కమిటీ జ్యూరీ మెంబర్స్‌గా ఉండడం, కమిటీ వేసిన వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. వాస్తవానికి అలాంటి అవార్డులు చెల్లవు.
ఉదాహరణకు గద్దర్ అవార్డు ప్రకటించిన ఓ సినిమాకు పాటలు రాసిన రచయిత, ఎంపిక చేసే జ్యూరీలో ఉన్నాడు. అప్పుడు ఆ సినిమా అనర్హతకు గురవుతుంది. అలా జరగకపోతే, ఈ అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరగనట్లేనని రుజువు అవుతుంది. ఇలాంటి అవకతవకలు ఇంకా ఎన్ని ఉన్నాయో? దీర్ఘంగా పరిశీలిస్తే గానీ తెలియదు.. ఇక ఒక ప్రముఖ మెంబర్ తన రాజకీయ ఎజెండాతో, పట్టు పట్టి మరీ ఒక సినిమాకు అవార్డు వచ్చేలా ఒత్తిడి తెచ్చారట. ఇది పారదర్శకమా?
సినిమాలు చూడకుండానే..
వాస్తవానికి న్యాయ నిర్ణేతలందరూ అన్ని సినిమాలను కలిసి కట్టుగా, పూర్తి సినిమాను శ్రద్ధగా చూసి, విధి విధానాలను పాటించి, సినిమాలో వివిధ అంశాలకు మార్కులు వేసి, వాటన్నింటిని జమ చేసి, సమిష్టిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అసలు జరిగిందా? జ్యూరీ సభ్యులందరూ కలిసి మొత్తం సినిమాలను పూర్తిగా వీక్షించారా? వీక్షించకుండానే, హాజరు అయినట్లు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి 5 - 10 నిమి షాలు అక్కడి నుండి వెళ్లిపోవడం బాధ్యతారాహిత్యం కాదా? ఈ రకంగా అశ్రద్ధగా చేసిన సినిమాల ఎంపిక ఎలా చెల్లు బాటు అవుతుంది? కొన్ని సినిమాలకు అన్యాయం జరిగినట్లే కదా! మొత్తం సుమారు 1200 సినిమాలు పారదర్శకంగా చూసి అవార్డులు ఇవ్వాలనుకుంటే.. రోజుకు రెండు సినిమాలు చూసినా 600 రోజులు పడుతుంది. నెలా రెండు నెల్లల్లో సాధ్యపడే పనికాదు. ఇప్పుడు అన్ని సినిమాలు చూడకుండా ఎంపిక చేసినట్లే కదా! ఎలా చెల్లుతాయి?
ఒక్కో ఏడాది.. 3 సినిమాలకే అవార్డులా?
2014 నుండి 2023 వరకు అవార్డులు ఇవ్వలేదని, వాటిని కూడా భర్తీ చేయాలని ఎవరు సలహా ఇచ్చారో కానీ, అది కూడా అర్థరహితంగా ఉన్నది. ఇస్తే అన్ని శాఖలకు న్యా యం చేయాలి లేదా ‘గతం గతః’ అని గత ప్రభు త్వం పై నెట్టివేసి, ప్రస్తుత పాలన లో మేం 2024 నుండి మొదలు పెట్టినం అంటే సరిపోయేది. ఇప్పు డు 10 సంవత్సరాలకు ఒకేసారి సంవత్సరానికి 3 సినిమా లు ఎంపిక చేసి అవార్డులు ప్రకటించడం అన్యాయం. ప్రతి సంవత్సరానికి, సినిమాలతో పాటుగా సినిమాల్లో పనిచేసిన వివిధ విభాగాలకు కూడా అవార్డులు ఇవ్వాలి కదా? ఈ రకంగా సంవత్సరానికి సుమారు 50 చొప్పున 10 సంవత్సరాలకు 500ల మంది నిపుణులు ఫిలిం అవార్డ్స్ కోల్పోయారు.
గద్దర్‌ని అవమానించినట్లు కాదా?
ఇక కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ ఎక్కువ శాతం సభ్యులు జ్యూరీలో ఉన్నప్పుడు, కళాత్మక, అర్థవంతమైన, సృజనాత్మక సహజ సిద్ధ సినిమాల విలువ వారికి ఏం తెలుస్తుంది? ఇది వారు ఎంపిక చేసిన సినిమాల లిస్ట్ చూస్తేనే అర్థం అయిపోతున్నది. వాళ్లకు ఎలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వాలో తెలియదని.. పక్కా కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇచ్చేదే ఉంటే, మొదలే తెలియ చేయనుండే, అవార్డుల కోసం అర్హత కలిగిన వారెందరో దరఖాస్తులు పెట్టేవారు కాదేమో.. గద్దర్ పేరు మీద అవార్డులు అని ప్రకటిస్తే, విలువలు కలిగిన సృజనాత్మక సినిమాల ఎంపిక అనుకొని భ్రమపడ్డారు. అలాంటి అత్యధిక డబ్బు సంపాదనే లక్ష్యంగా, అసాంఘీక కథాంశాలతో రూపొందించిన సినిమాలకు ఇచ్చే ఆ అవార్డుల పేరు, ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల గొంతుక ఐనా గద్దర్ పేరు ఎందుకు పెట్టాలి? ఎంపిక చేసిన సినిమాలకు గద్దర్ ఇమేజ్‌కి ఏమైనా పొంతన ఉన్నదా? ఆ మనిషిని గౌరవించాలనుకున్నారు కానీ ఈ నిర్ణయాల వల్ల, అవలంభించిన ప్రక్రియ వల్ల ఆయనకు అవమానమే జరిగింది. ఈ క్యాపిట లిస్టిక్ వ్యవస్థను అసహ్యించుకునే వ్యక్తి పేరు మీద క్యాపిటలిస్ట్‌క్ సినిమాలకు అవార్డులు ఇస్తున్నారు. ఏ అవార్డులను ఆయన తిరస్కరించాడో, ఆయన మరణానంతరం ఆయన పేరు మీద ఆయన వ్యక్తిత్వానికి అసంబద్ధమైన అవార్డులు ఇస్తున్నారు.
తెలంగాణ సినిమా పాలసీ తేవాలి..
మహారాష్ట్రలో మరాఠీ సినిమాలను ప్రోత్సహించినట్లుగా, తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడి నేపథ్య సినిమాలకు అవా ర్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. దానికంటే మొదలు.. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, లేదా ఉన్న యూనివర్శిటీస్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, క్రాఫ్ట్ మెన్‌షిప్ కోర్సులు పెట్టాలి. సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్‌ని ఎంపిక చేసి NFDC లాగా TFDC co ప్రొడక్షన్ లేదా ప్రొడక్షన్ లేదా ఫైనాన్స్ చేసి నిర్మాణాన్ని పెంపొందించా లి, తీసిన సినిమాలకు ఉన్న థియేటర్లలో చోటేనా కల్పించాలి. లేదా ప్రభుత్వమే మినీ థియేటర్స్ కట్టుకోడానికి వెసులుబాటు కల్పించాలి. ఓటీటీ, డిజిటల్ స్క్రీనింగ్ ప్రభుత్వమే చేపట్టాలి. తీసిన సినిమాలకు పన్ను మినహాయింపు, సబ్సిడీ కల్పించి, తీసిన సినిమాలను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపించి, ప్రాంతీయ నిర్మాతలను మొట్టమొదలు ప్రోత్సహించి, ప్రత్యా మ్నాయ తెలంగాణ సినీ పరిశ్రమ స్థాపనకు “తెలంగాణ సినిమా పాలసీ” తేవాలి. ఆ తరువాతే అవార్డులు ప్రకటిస్తే అర్థవంతంగా ఉంటుంది.
అవార్డుల ఎంపిక చెరపలేని మచ్చ
ప్రస్తుతం తెలంగాణ సినిమాల నిర్మాణమే లేదు.. బహుమా నాలు దేనికి? ఒకవేళ ఇవ్వాలనుకున్నా సృజనాత్మక తెలంగాణ సినిమాలకే ఇవ్వాలి. “తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” అని నామకరణం చేసి, సామాజిక సృహ, ప్రజల్లో చైతన్యం కలిగించే పాటకు గానీ సినిమాకు గానీ ప్రతిష్టాత్మక “గద్దర్ అవార్డు” ప్రకటించి గద్దర్ ఖ్యాతిని నిలబెట్టాలి. ఇన్ని అంశాల నేపథ్యంలో ఈ అవార్డులను రద్దు చేసి, పద్దతిగా, నిబద్ధతతో కొత్త జ్యూరీని ఎంపిక చేసి అన్ని సినిమాలను పునః పరిశీలించి న్యాయబద్ధంగా ఎంపిక చేస్తే, ప్రభుత్వ సదుద్దేశం నెరవేరుతుంది, లేదంటే ఇది చారిత్రక తప్పిదంలా, చెరపలేని మచ్చలా మిగిలిపోతుంది. ఈ సద్విమర్శను పెద్ద మనసుతో అర్థం చేసుకొని అవలంబిస్తే వెచ్చించే ప్రజాధనానికి, ప్రభుత్వ ఉద్దేశానికి ఒక సార్థకత లభిస్తుంది.
- సయ్యద్ రఫీ,
చిత్ర దర్శకుడు,
rafismovie@ gmail.com






