భార్య ప్రేమకు మగాడు దూరం అవుతున్నాడా? అందుకేనా ఈ దారుణాలు..

by Ravi |   (  Updated:2025-07-25 01:15:21  IST  )

పెళ్లంటే ఇద్దరు మనుషుల మధ్య శరీర బంధం కాదు. అది రెండు మనసుల మధ్య జరిగిన అపూర్వమైన ఒప్పందం

భార్య ప్రేమకు మగాడు దూరం అవుతున్నాడా? అందుకేనా ఈ దారుణాలు..
X

పెళ్లంటే ఇద్దరు మనుషుల మధ్య శరీర బంధం కాదు. అది రెండు మనసుల మధ్య జరిగిన అపూర్వమైన ఒప్పందం. కానీ నేటి కాలంలో ఎంతో మంది మగవాళ్లు ప్రేమ లేని పెళ్లిలో బతుకుతున్నారు. వారి జీవితాల్లో భార్య ఉన్నా.. ప్రేమ లేదు. ఈ పరిస్థితే వారిని పరాయి ప్రేమ వైపు తోస్తోంది. పురుషుడు కూడా ఓ మనిషే. అతనికీ మనసుంటుంది భావాలుంటాయి. అలసిన ఆ హృదయానికి ఓ మురిపాల మాట కావాలిసిందే. అది దొరకనప్పుడే అతడు తనను అర్థం చేసుకునే ఇంకో మనిషిని చూస్తాడు. అది తప్పు అయినా, తెలియక ఆ దారి పడతాడు.

నేటి కాలంలో పురుషులు అక్రమ సంబంధాల్లోకి లాగ బడ్డారని వినిపించే మాటలు చాలానే ఉన్నాయి. ఇటీవలి సర్వే ప్రకారం, భారతదేశంలో వివాహితులలో అక్రమ సంబంధాల శాతం పురుషులలో 45%కు చేరింది. పురుషుడు పరాయి స్త్రీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? ఆ పరిచయం ప్రారంభమయ్యేదెప్పుడు? అని మనం ప్రశ్నించుకోవాలి. వీరిలో చాలా మంది, మొదట్లో భార్యలను ప్రేమించినవారే. కానీ కాలక్రమేణా వాళ్ల మధ్య మౌనం పెరిగింది. స్నేహం తగ్గింది. ఆత్మీయత మాయమైంది.

ప్రేమ అంటే శృంగారమే కాదు..

ఈ యుగంలో పెళ్లి అయ్యాక ఇళ్లు మగవాడికి గుహలా మారింది. ఆ ఇంట్లో భార్య పక్కన ఉంటోంది.. కానీ గుండెకి ఆవాసం కాదు. ఆమె ఒడిలో నిద్రపోతున్నాడు కానీ మనసుకు సమాధానం దొరకడం లేదు. మొత్తంగా పురుషుడు భౌతికంగా కాపురం చేస్తున్నాడు. కానీ భావో ద్వేగంగా ఒంటరి అయ్యాడు. సాంప్రదాయంగా మనకు తెలుసు మనుషులు ఇద్దరూ ఒక్కటయ్యే బంధమే పెళ్లి. కానీ ఆ బంధం కేవలం బాధ్యతలపై ఆధారపడితే అది కలకాలం కొనసాగదు. స్త్రీ ప్రేమ మగవాడి జీవితంలో వసంతం లాంటిది. అతని ఆత్మకు ఆహారం. కానీ చాలా మంది భార్యలు ప్రేమను శరీర సంబంధంగా మాత్రమే చూస్తు న్నారు. కానీ మగవాడు కోరేది దేహంతో పాటు గౌరవం, అభిమానం, మనస్పూర్తి. పొద్దంతా పనిచేసి భర్త ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు భార్య నవ్వుతూ పలకరించాలి. అతని విజయాలను సంబరంగా పంచుకోవాలి. అతని అప జయాల్లో పక్కన నిలవాలి. కానీ ఇంట్లో అలా ఉంటోందా?

మగవాడి మౌన రోదన

నేటి మోడ్రన్ గృహిణి వంట, పిల్లల పాఠాలు, మొబైల్, టీవీ, సీరియల్స్‌లో బిజీగా ఉంటుంది. ఇంకొందరు భార్యలు భర్తపై ప్రేమ చూపకుండా, వారి ధ్యాసంతా పిల్లలు, ఇంటి పనులు, బంధువులపై ఉంటుంది. మగవాడు ఉదయాన్నే బయటకు పోతాడు. కష్టపడతాడు. దుఃఖం దాచుకుని జీవించేందుకు పోరాడతాడు. ఇంటికి వచ్చినప్పుడు భార్య కనీసం ఓ మాట మాట్లాడకుండా మొబైల్ చూసుకుంటే.. అతని మనసు ఎక్కడికి వెళ్లాలి? ఆ పరిస్థితుల్లో అతనికి ఎవడైనా కాల్ చేస్తే, ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా చింతన పంచుకుంటే అతడు లొంగిపోతాడు. ఇది మానవ స్వభావం. ఇది నైతికతపై కాకుండా భావోద్వేగ శూన్యతపై ఆధారపడి ఉంటుంది. సామాజిక దృష్టిలో మగవాడిని శక్తివంతుడిగా చూపిస్తారు. కానీ అతడికి కూడా తార్కికమైన అవసరాలే ఉంటాయి. అభిమానానికి తాకిడి కావాలి, తన భావాలకు విలువ కావాలి, తన పనికి గుర్తింపు కావాలి. తన ఒంటరితనానికి తోడు కావాలి, వీటిని భార్య ఇవ్వకపోతే, అతడు తప్పు చేస్తాడు కాదనలేం. కానీ తను అలా చేయడానికి గల కారణాలను సమాజం పరిశీలించాలి.

అర్థం చేసుకోండి..

ఇంట్లో ఇలా ఉన్నప్పుడే మగాడు భౌతికంగా ఇంటికి వస్తు న్నాడు కానీ భావోద్వేగంగా అతడు ఎప్పుడో గేటు దాటి వెళ్లిపోయాడు. ఏ భార్య తన భర్తను ముసి నవ్వుతో పలకరిస్తుందో, అతనిపై ప్రేమ ఓ స్పర్శతో చూపిస్తుందో ఆ భర్త మరొకరిని చూడడు. కానీ చాలా చోట్ల పరిస్థితి తారుమారైంది. బాధ్యతలతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ భార్యల జీవితంలో భర్తకు స్థానం ఇవ్వడం లేదు. దీంతో భర్త ఒక మానసిక పరాజయాన్ని అనుభవిస్తున్నాడు. మగవాడు ఎన్నో విషయాలు భార్యతో పంచుకోవాలనుకుంటాడు. కానీ ఆమె దృష్టి టీవీలో ఉంటే, చేతిలో ఫోన్ ఉంటే, మగవాడి హృదయం తుపాకీ బుల్లెట్‌లా గుండెల్లోనే పగిలిపోతుంది. ఆ కన్నీళ్లు బయట పడవు. కానీ స్నేహితుల వద్ద అతడు పడి ఏడుస్తాడు. తాను అనాధను అయ్యానని అనిపించుకుంటాడు. అప్పుడే అతడికి తృప్తిని, ప్రోత్సాహాన్ని ఇచ్చే ఏ కాంతి కనబడితే... అదే ఇతని దారి మార్పుకు కారణం అవుతుంది.

పరిష్కారం..

పురుషుడి మనసు కూడా పూల వంటిదే. భార్యలు దాన్ని నిందించకుండా ప్రేమించాలి. అతడి కష్టాలను అర్థం చేసుకుని ప్రోత్సహించాలి. భార్యగా ప్రేమించడమే కాకుండా స్నేహితురాలిగా కూడా ఉండాలి. పురుషుడి భావోద్వేగ అవసరాలను తేలిగ్గా తీసుకోకూడదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆత్మీయత బలమైనదైతే, అక్రమ సంబంధాలకు చోటే ఉండదు. ఒకరి గుండెను ఇంకొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఒకరు నొచ్చుకోకుండా, రెండో వాడు కన్నీళ్లతో జీవించకుండా ఉంటేనే నిజమైన సంసారం. ప్రతి స్త్రీ మగవాడిని ప్రేమిం చండి ప్రశంసించండి. అర్థం చేసుకోండి. అంతే.. మగవాడి హృదయం మళ్లీ మీ వైపు తిరుగుతుంది. ఆ గుండె వెనుక మన దేశ భవిష్యత్తు ఉందనే విషయం మరవద్దు.

-డా. కేశవులు భాషవత్తిని

ఎండి. సైకియాట్రీ

85010 61659

Next Story