- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిగ్ వ్యవస్థ ఉపాధికి పరిష్కారమేనా..?
భారతదేశంలో ఆర్థిక సంస్కరణల పేరుతో అమలు చేసిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు ఉపాధి రంగంపై గణనీయమైన ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత సంస్థల విస్తరణతో గిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగింది.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణల పేరుతో అమలు చేసిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు ఉపాధి రంగంపై గణనీయమైన ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత సంస్థల విస్తరణతో గిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ వాస్తవంగా ఉపాధి పరిష్కారమా? లేక నిరుద్యోగానికి కొత్త రూపమా? అనే ప్రశ్న మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థిర ఉద్యోగాలు ప్రధాన ఆధారంగా ఉండగా, ఇప్పుడు అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, గిగ్ విధానాలు సాధారణమయ్యాయి. ప్రస్తుతం ఒక కారు, ఆటో కూడా కొనని సొంత డ్రైవర్లు లేని యాప్ సంస్థలు దేశవ్యాప్తంగా ఎలాంటి రక్షణ, హక్కులు లేని కోట్లాదిమంది గిగ్ కార్మికులను నియమించుకొని నిలువు దోపిడీ చేస్తున్నాయి. విద్య, వైద్యాన్ని మాత్రమే కాదు ఉద్యోగాలను కూడా ప్రైవేట్ పరం చేసి అన్ని విభాగాలను అవుట్ సోర్స్ కూలీలతో నింపుతున్న ఆర్థిక వ్యవస్థ మనది.
యువత నిరాశతో ఉండకూడదు..
ఉపాధిలో, అభివృద్ధిలో, పరిపాలనలో మానవ వనరుల భాగస్వామ్యమే ఉద్యోగం. మన దేశ జనాభాలో 28 సంవత్సరాల లోపల ఉన్న యువత 50%గా ఉన్నది. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా నివేదిక 2023 ప్రకారం, 25 సంవత్సరాల లోపల ఉన్న పట్టభద్రులు 42.3%. 20-24 ఏళ్ల వయస్సు వారిలో 63% నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలియజేస్తున్నది. 2022లో ప్రభుత్వ విభా గాలలో 9,64,359 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది. దీనిని బట్టి దేశంలో యువత ఏ పని దొరకక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని తెలుస్తున్నది. దేశ భవిష్యత్తు యువశక్తిపై ఆధారపడి ఉంటుంది. వారు నిరుద్యోగంతో, నిరాశతో ఉండకూడదు..
ఆర్ధిక వ్యవస్థ ఎంత పెద్దదైనా..
సాధారణంగా మన ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, దేశ ఆర్థిక వ్యవస్థను స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) పరంగా అంచనా వేస్తారు.. శ్రామికశక్తిని, వారి ఉపాధి ఆదాయాలను ఆధారంగా చేసుకుని ఆర్థిక వ్యవస్థను అంచనా వేయరు.. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదైనా తగినంత స్థాయిలో ఉద్యోగాలు పెరగటం లేదు.. శ్రామికులు చాలావరకు గిగ్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. ప్రజల శ్రామిక శక్తిని తెలియజేసే గిగ్ ఎకానమీ వీరిని కార్పొరేట్ కంపెనీలు ఇంటర్నల్ శ్రామిక శక్తిగా ఉపయోగిస్తారు. ప్రజల నుండి వచ్చిన వస్తు సేవల డిమాండుకు తగిన ఉత్పత్తిని పంపిణీ చేసేందుకు ఈ గిగ్ కార్మికులను వినియోగించుకుంటారు.. బీబీసీ ప్రకారం, శాశ్వత ఉద్యోగాలకు విరుద్ధంగా స్వల్పకాలిక ఒప్పందాలతో పనిచేసే కార్మికులను గిగ్ శ్రామికులంటారు.. వారు చేసే పనిని బట్టి ఈ కార్మికులకు చెల్లింపులు ఉంటాయి. అయితే వీరికి నిర్దిష్టమైన కాలంగానీ, స్థలంగానీ ఉండదు.. అలాగే ఉద్యోగ భద్రతకూడా ఉండదు.. అంతా ఒక స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ. అటు ఇటు అందరూ స్వతంత్రులే.. అంతా అనిశ్చితమే. మన దేశంలో యువతకు ఇదే తాత్కాలిక జీవనాధారంగా ఉన్నది. గిగ్ కార్మిక వ్యవస్థ నిరుద్యోగానికి మారుపేరు.
అభివృద్ధి అంటే అందరి వృద్ధి..
1991 నుంచి సరళీకృత ఆర్ధిక విధానాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. 1951లో కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐదు పరిశ్రమలతో ప్రారంభమైన మన పారిశ్రామికీకరణ 1956లో 17 మౌలికమైన కీలకమైన పరిశ్రమలకు పెరిగింది. దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వీటిని నెలకొల్పారు.. 2021 నాటికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు 365కు చేరాయి.. అయితే ఆ మేరకు ఉద్యోగాలు పెరగటం లేదు. 2013లో కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో 17.3 లక్షల ఉద్యోగాలు ఉండగా 2022 నాటికి ఈ సంస్థలో ఉద్యోగాలు 10 లక్షలకు తగ్గిపోయాయి. అందులోను కాంట్రాక్ట్ కార్మికులుగా 43 శాతం మందికి నియామకాలు జరిగాయి. ఇలా దేశంలో మెల్లగా ప్రవేట్ రంగం విస్తరించి కార్పెట్ రంగం పునాదులు బలంగా ఏర్పడడంతో ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు గిగ్ వర్కర్స్‌గా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిగ్ ఎకానమీ పెరిగిపోయిన నేపథ్యంలో.. ఉపాధి అవకాశాలు, జీతభత్యాలు పర్మనెం ట్‌గా లభించకపోవటంతో వాటికి చట్టబద్ధత కూడా లేకపోవటంతో ఇక్కడ పని చేసుకుంటే ఏముంది? అనే నిరాశా వాదంతో యువత వలసబాట పడుతున్నారు.. అభివృద్ధి అంటే అందరి వృద్ధి అంతేగాని కొందరి వృద్ధి కాదని గాంధీజీ అన్నారు. దేశపు ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు, ప్రజలకు కనీస అవసరాలు.. తిండి, వసతి, విద్య, వైద్యం ఏ మేరకు అందుతున్నాయన్నది ముఖ్యం. కార్మికుల ఉద్యోగ భద్రత ముఖ్యం.
-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు
డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్
98663 22172






