కుల గణన సర్వే లెక్క తేలిందా..?

by Ravi |   (  Updated:2025-02-07 01:16:26  IST  )

తెలంగాణ పల్లెల్లో కుల, మతాలకు అతీతంగా అన్నా- తమ్ముడు, అక్కా- చెల్లె... అంటూ ఆప్యాయంగా పిలుచుకునే సుహృద్భావ

కుల గణన సర్వే లెక్క తేలిందా..?
X

తెలంగాణ పల్లెల్లో కుల, మతాలకు అతీతంగా అన్నా- తమ్ముడు, అక్కా- చెల్లె... అంటూ ఆప్యాయంగా పిలుచుకునే సుహృద్భావ వాతావరణం ఉన్నది. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు తోడుగా ఉండే వాతావరణం ఉంది. పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టు కుల దురభిమానం లేదు. అది తెలంగాణ సమాజానికి మంచిది కూడా.. భిన్నత్వంలో ఏకత్వంతో తమ హక్కుల కోసం కొట్లాడే సంస్కృతి తెలంగాణ సమాజానికే సొంతం. అటువంటి ఐక్యత, పోరాట స్ఫూర్తి కలిగిన తెలంగాణ గడ్డ మీద కుల గణన ద్వారా కొంత మంది నాయకులు ఒక వర్గం మీద మరొక వర్గాన్ని రెచ్చగొట్టడం సరికాదు.

తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నాక మొదటిసారి 2014లో ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఈ సర్వేలో దాదాపు మూడు కోట్ల అరవై మూడు లక్షల జనాభా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందులో సామాజిక వర్గాల వారీగా జనాభా శాతం చూస్తే ఓసి -21%, బీసీ -51%, ఎస్సీ -18%, ఎస్టీ -10%. అయితే ఇందులో ముస్లిం, మైనార్టీలు దాదాపు 14% ఉన్నట్టు తెలిపింది. ఇందులో కూడా బీసీ, ఓసీలు ఉంటారు. కానీ ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ బీసీ, ముస్లిం మైనార్టీ ఓసీలని ప్రత్యేకించి చెప్పలేదు.

లక్షల్లో జనాభా తక్కువ నమోదైంది!

ఇక బీసీల్లో బీసీ- ఏ, బీసీ -బి,- బీసీ-డి లు మాత్రమే హిందూ బీసీలు.. బీసీ- సి వర్గంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ప్రజలెవరైనా క్రైస్తవ మతంలోకి వెళ్తే వారు బీసీ- సి కింద పరిగణింపబడతారు.. ఇక బీసీ- ఈ లో ముస్లిం, మైనార్టీల్లో సామాజిక, ఆర్ధిక వెనకబాటు ఉన్నవారు వస్తారు.. దాదాపుగా బీసీ- ఏలో 68 కులాలు.. బీసీ-బిలో 28 కులాలు, బీసీ - సీలో ఒకటి, బీసీ- డిలో 51 కులాలున్నాయి. ముస్లిం మైనార్టీలకు సంబంధించి బీసీలైన బీసీ- ఈ వర్గంలో 14 కులాలు ఉన్నాయి. మొత్తంగా బీసీ సామాజికవర్గంలో 162 కులాలు ఉన్నాయి. ఇప్పుడు పదేళ్ల తర్వాత 2024లో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొన్న మొత్తం జనాభా 3.54 కోట్లు అయితే సర్వేకు దూరంగా ఉన్న జనాభా దాదాపు 16 లక్షలని ప్రభుత్వం తెలిపింది. అంటే మొత్తం జనాభా 3.70 కోట్లు.. 2011 జన గణనలో తెలంగాణ జనాభా 3.51 కోట్లు.. 2014 నాటికి సమగ్ర సర్వేలో పెరిగిన జనాభా 3.63 కోట్లు అంటే దాదాపు మూడు ఏండ్లలో 12 లక్షలు పెరిగింది. అంటే ఏడాదికి సగటున 4 లక్షల జనాభా పెరిగింది. ఈ సగటును పరిగణనలోకి తీసుకున్నా 2014 నుండి 2024 వరకు జనాభా దాదాపు 35- 40 లక్షలు పెరగాలంటే 4 కోట్లకు పైగా ఉండాలి. కానీ లక్షల్లో జనాభా తక్కువగా నమోదైంది.. అంటే సర్వేలో పాల్గొన్నది 97% కాదు.. అంత కంటే తక్కువే.. దాదాపు 5-6% మంది ప్రజలు సర్వేకు దూరంగా ఉండి ఉంటారు.

ఈ గందరగోళం అందుకే..!

2024లో జరిగిన కుల గణనలో సామాజిక వర్గాల వారీగా జనాభా శాతం ఈ విధంగా ఉంది. సామాజిక వర్గాల వారీగా.. ఓసి - 13.31%, బీసీ - 46.25%, ఎస్సీ - 17.43%, ఎస్టీ - 10.45%, ముస్లిం మైనార్టీ - 12.56% (ఇందులో బీసీ -10.08%, ఓసీ-2.48%) ఉన్నారు.. ఎస్సీ, ఎస్టీ వర్గాల్ని మినహాయించి ముస్లిం మైనర్టీల్లోని బీసీలను కలిపితే రాష్ట్రంలో మొత్తం బీసీ జనాభా 56.33%, అదే విధంగా ముస్లిం మైనర్టీల్లోని ఓసీలను కలిపితే రాష్ట్రంలో మొత్తం ఓసీ జనాభా 15.79%. వీటిని 2014, 2024 కుల గణన సర్వేలో వెల్లడైన వివరాల్ని పోల్చినపుడు ఎస్సీ, ఎస్టీ జనాభా శాతంలో పెద్దగా మార్పు లేదు కానీ, బీసీ, ఓసీ జనాభా శాతంలో మార్పు కనిపిస్తుంది. కారణం 2014 సర్వేలో ముస్లిం మైనార్టీలను బీసీ, ఓసీలలో వారి శాతాన్ని ప్రత్యేకంగా చెప్పకపోవడమే. 2024లో ముస్లిం మైనార్టీలను బీసీ, ఓసీలలో ప్రత్యేకించి చెప్పడం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి 2014లో మొత్తం బీసీ జనాభా 51% ఉంటే 2024 నాటికి 56% శాతానికి పెరిగింది. అంటే దాదాపు 5% పెరిగింది ఇందులో ముస్లిం మైనార్టీ బీసీలు 10% ఉన్నారు. ఇక ఓసీలు 2014 సర్వేలో 21% ఉంటే 2024 నాటికి 15.79% శాతానికి తగ్గారు. అంటే దాదాపు 5.21%. ఇందులో కూడా ముస్లిం, మైనార్టీ ఓసిలున్నారు..

ప్రజల అపోహలు తొలగించాలి!

2014 సర్వేలో బీసీ జనాభా శాతంలో ముస్లిం, మైనార్టీ జనాభా శాతాన్ని లెక్కించకుండా ఓసీ జనాభా శాతం 21% ఉంటే అందులో నుండి 13% ముస్లిం మైనార్టీలను తీసేసి ఓసీ జనాభా పది శాతం లోపు మాత్రమే అని ప్రచారం చేస్తున్నారు. అయితే అది వాస్తవ దూరమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.. ఓసీల్లో ఉన్న ముస్లిం, మైనార్టీల జనాభా శాతాన్ని తీసివేసినప్పుడు, బీసీల్లో ఉన్న ముస్లిం, మైనార్టీల (బీసీ - ఈ) జనాభా శాతాన్ని తీసి వేసినపుడే అసలు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. 2024 కుల గణన సర్వేలో బీసీ జనాభా ముస్లిం మైనార్టీలను మినహాయించి 46.25% ఓసీ జనాభా 13.31%. వాస్తవానికి బీసీ జనాభా శాతం ఎక్కువగా ఉంటదని కొంతమంది.. లేదు ముస్లిం, మైనార్టీలను మినహాయించి ఓసీ జనాభా ఎక్కువగా ఉంటుం దని కొన్ని కుల సంఘాల వారు వాదిస్తున్నారు.. ప్రభుత్వమే ఈ వివాదానికి తెర దించాలి.. కుల ,మత, ప్రాంత వైషమ్యాలు లేని తెలంగాణ రాష్ట్రంలో కుల గణన కొత్తగా కులాల కుంపట్లు పెట్టినట్టు అవుతుంది. రెండు సర్వేల గురించి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతుంటే ప్రభుత్వం చేసిన ఈ బృహత్తర కార్యక్రమం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. లేదా ఈ వివరాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి.

ప్రజలను రెచ్చగొట్టొద్దు!

తెలంగాణ సామాజిక చరిత్రను పరిశీలిస్తే తెలంగాణలో చాతుర్వర్ణ వ్యవస్థ లేదు.. అసలు దక్షణాది రాష్ట్రాల్లోనే లేదు. శూద్ర వర్ణాలుగా చెప్పబడిన కొన్ని కులాలే కాలక్రమేణా ఓసీలుగా పేర్కొనబడ్డాయి. దేశంలో ఒక రాష్ట్రంలో బీసీలుగా గుర్తించబడిన కులాలు మరో రాష్ట్రంలో ఓసీలు, ఒక రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తించబడిన వారు మరొక రాష్ట్రంలో బీసీలుగా గుర్తింపబడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వివిధ కులాల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని బట్టి కులాలు వివిధ వర్గాల్లో చేర్చబడ్డాయి.. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం నుండి మొదలుకొని తర్వాత జరిగిన 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమం, 2009లో జరిగిన మలి దశ ఉద్యమంలో కుల మతాలకు అతీతంగా సకల జనులు జరిపిన పోరాటం భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అటువంటి ఐక్యత, పోరాట స్ఫూర్తి కలిగిన తెలంగాణ గడ్డ మీద కుల గణన ద్వారా కొంత మంది నాయకులు ఒక వర్గం మీద మరొక వర్గాన్ని రెచ్చగొట్టడం సరికాదు. ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడి హక్కులు సాధించుకోవాలి.

డా. అక్కెనపల్లి వెంకట్రాం రెడ్డి

97002 06444

Next Story