రిజర్వేషన్లతోనే రాజ్యాధికారం సాధ్యం?

by Ravi |   (  Updated:2025-01-25 01:15:49  IST  )

విద్యలో రిజర్వేషన్.. ఉద్యోగాల్లో రిజర్వేషన్.. సర్పంచ్‌గా నిలబడాలన్నా రిజర్వేషన్.. కౌన్సిలర్‌గా పోటీ చేయాలన్నా

రిజర్వేషన్లతోనే రాజ్యాధికారం సాధ్యం?
X

విద్యలో రిజర్వేషన్.. ఉద్యోగాల్లో రిజర్వేషన్.. సర్పంచ్‌గా నిలబడాలన్నా రిజర్వేషన్.. కౌన్సిలర్‌గా పోటీ చేయాలన్నా రిజర్వేషన్.. మున్సిపల్ చైర్ పర్సన్.. జడ్పీ చైర్ పర్సన్ కావాలన్నా రిజర్వేషన్.. ఇలా అన్నింటా రిజర్వేషన్లు అమలు చేస్తున్న పాలకులు.. రాజ్యాధికారం విషయానికి వచ్చేసరికి మాత్రం మౌనం వహిస్తున్నారు. వివిధ వర్గాలు రాజ్యాధికారం సాధించే అవకాశాలున్న పదవులైనా మంత్రి, సీఎం, ప్రధాన మంత్రి పదవుల విషయంలో మాత్రం మిన్నకుండిపోతున్నారు.

స్థానిక, మున్సిపల్ రిజర్వేషన్లపై చర్చ ప్రస్తుతం తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై జోరుగా చర్చ నడుస్తున్నది. బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ త్వరలో నివేదిక అందజేయనుంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇప్పుడు చర్చ అంతా రిజర్వేషన్ల గురించే! ఏ వార్డు ఎవరికి కేటాయిస్తారు? ఏ వర్గానికి అది రిజర్వ్ అవుతుంది? అనే అంశాలు రాజ కీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే సంబరాలు.. లేకుంటే నిరాశ అనే పరిస్థితి ఉన్నది. రిజర్వేషన్ అనుకూలంగా లేకపోతే అప్పటి వరకు ఆ కాలనీలో ప్రజలకు సేవలందించిన కౌన్సిలర్ ఎన్నికల బరిలో నిలబడలేని పరిస్థితి వస్తుంది. మరికొందరికి అదృష్టం కలిసి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి. పోటీ చేయాలనుకున్న వారు పోటీకి దూరమైపోతారు. అనుకోని అదృష్టం కలిసి వస్తే మరికొందరు సర్పంచులుగా గెలుపొందుతారు. మరికొందరు జడ్పీ చైర్ పర్సన్, మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాలను అధిరోహిస్తారు.

ర్యాండమైజేషన్ పద్ధతి..

స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆయా వార్డులకు రిజర్వేషన్ కేటాయిస్తారు. సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా.. మున్సిపల్, జడ్పీ చైర్ పర్సన్లయినా.. రిజర్వేషన్ మారుతూ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ ర్యాండమైజేషన్ కాలపరిమితిని పదేండ్లుగా నిర్ణయించగా, ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఐదేండ్లకు కుదించింది. ర్యాండమై జేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తుండడం బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు లాభమే. ఒకటి, రెండు సార్లయినా పదవులను అధిరోహించే అవకాశం దక్కుతుంది. అయితే రిజర్వేషన్ జనరల్ అయితే పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశమిచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అగ్రవర్ణాల వారికే అవకాశమిస్తూ ఉంటాయి. ఇంకా తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పని చేస్తున్నామంటూ ఊదరగొడుతూ ఉంటాయి.

చిత్తశుద్ధిని శంకించాల్సిందే..

అవసరమున్నప్పుడు రాజ్యాంగాన్నే సవరిస్తున్న పాలకులు.. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి పదవులకు రిజర్వేషన్ అమలు విషయంలో మౌనంగా ఉండడంతో వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తున్నది. భారతదేశంలో ప్రతి ఎన్నిక పరోక్ష పద్ధతిలోనే ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలనేవి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణ స్వీకారం చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించారు. ఆ తర్వాత నిబంధనలను మార్చి వైఎస్ఆర్ పరోక్ష పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు. మున్సిపాలిటీ విషయానికి వస్తే కౌన్సిలర్లంతా కలిసి మున్సిపల్ చైర్ పర్సన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదే అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా కలిసి ముఖ్యమంత్రిని, పార్లమెంట్‌లో ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక విష యంలో రిజర్వేషన్ అమలు చేస్తున్న పాలకులు.. మరీ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఎన్నిక విషయంలో రిజర్వేషన్ గురించి మాట మాత్రం కూడా మాట్లాడరు.

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇప్పటి వరకు బడుగు, బలహీన, అణగారిన వర్గాల నుంచి ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులుగా ఎన్నికైన వారు అంతంత మాత్రమే. ఒకటి, రెండు సార్లు అవకాశమొచ్చినా.. ఆ తర్వాత అగ్రవర్ణాల కుట్రలకు వారు బలవుతూనే ఉన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర, దేశ పాలకులు.. తమ మంత్రివర్గంలో ఎందరికి అవకాశమిచ్చారో చెప్పుకోలేకపోతారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన అగ్రవర్ణాలు బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చేసింది అంతంత మాత్రమే. అయితే వారికి అన్ని రంగాల్లో అవకాశమిస్తామని గొప్పలు చెప్పుకుంటూనే.. రాజ్యాధికారం విషయానికి వచ్చేసరికి మౌనం వహిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలవాలంటే కోట్ల రూపాయల డబ్బు అవసరం. అది ఎలాగూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల వద్ద లేదు. అయితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులకు సైతం రిజర్వేషన్లు అమలు చేస్తే రాజ్యాధికారం సాధించే అవకాశం వస్తుంది. ఈ దిశగా బడుగు, బలహీన, అణగారిన వర్గాలు పోరాటాలు చేయాల్సి ఉంది. కొత్త తరహా ఉద్యమాన్ని లేవదీస్తేనే ఇది సాధ్యమవుతుంది.

-ఫిరోజ్ ఖాన్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

96404 66464

Next Story